రాయపోల్ : అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కేటాయించారు. ఆ ట్రాక్టర్‌తో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడంతో కనీసం చెత్త ట్రాక్టర్లు నడిపించే పరిస్థితి లేదు. వీధుల నిండా చెత్త పేరుకుపోయి గ్రామాలు అపరిశుభ్రంగా మారిపోయాయి. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాల్సిన మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తమకేమీ పట్టనట్లుగా
వ్యవరిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని చాలా గ్రామాల్లో చెత్త ట్రాక్టర్లు డీజిల్ లేక నడిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వలన పంచాయతీ కార్యదర్శులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. గ్రామాలు దేశానికే పట్టుకొమ్మలని, గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో అభివృద్ధి పథంలో నడిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి గ్రామంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను కేటాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో చెత్త సేకరణ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ ఉందని, ఆర్థిక భారం ఎక్కువైందని గ్రామ పంచాయతీలకు నిధులు రావడం లేదు. దాంతో గ్రామాలలో ఎలాంటి పనులు జరగడం లేదు. మురికి కాలువలు శుభ్రం చేయడం, దోమలు ఈగల నివారణకు మందును పిచికారి చేయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, మంచినీటి సమస్య ఇలా ఏ ఒక్క పని కూడా సక్రమంగా కొనసాగడం లేదు. వాటితోపాటు చెత్త సేకరణ కూడా ఆగిపోవడంతో ట్రాక్టర్లు మూలన పడ్డాయి.
రాయపోల్ మండలంలోని ముంగీస్ పల్లి గ్రామ పంచాయతీకి చెందిన చెత్త ట్రాక్టర్‌ను చెట్లపొదల మధ్య నిరుపయోగంగా వదిలేశారు. ఆ ట్రాక్టర్ చుట్టూ పచ్చగడ్డి, పిచ్చి మొక్కలు, చెట్లు ఏపుగా పెరిగి ట్రాక్టర్ కనిపించకుండా పోయింది. గత ఎనిమిది నెలల నుంచి గ్రామంలో ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు స్పందించి గ్రామంలో చెత్త సేకరణ కోసం యధావిధిగా ట్రాక్టర్ నడపాలని ప్రజలు కోరుతున్నారు.