KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్నిసందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న మహిళా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.
‘అప్పుడు యూరియా బస్తాల కోసం ఏడ్చినం.. ఇప్పుడు మక్కజొన్న కోసం గోస పడుతున్నం సార్ అని రైతులు గోడు వెళ్లబోసుకున్నరు. చిన్న చిన్న పిల్లలను పట్టుకుని లైన్లో చెప్పులు పెట్టుకొని యూరియా బస్తాల కోసం చచ్చిపోయినం. వర్షం పడితే మక్కజొన్నల పరిస్థితి ఏందని అడిగితే.. పండనప్పుడు ఏడ్చుడే.. పండినప్పుడు ఏడ్చుడే అని’ తమ బాధ చెప్పుకున్నారు.
ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో కొట్టాడైనా ఇక్కడున్న ధాన్యం కొనేందుకు.. మమ్మల్ని కేసీఆర్ పంపించిండు. పైసలేసుడు ఒక రోజు ఆలస్యమైనా సరే కానీ వెంటనే మీ ధాన్యం కొనాలే. వీళ్లకు తెలివి లేకపోతే కనీసం ధాన్యం కొంటే మన ప్రభుత్వం వచ్చినంకైనా పైసలిస్తం. ముందైతే కొనాలి కదా… కొనేటట్టు కూడా లేరు. లారీలు వస్తుంటే జనగామలో ఆపారు.. సార్ దించేందుకు ఎవరూ లేరని వాళ్లు చెప్తున్నరు. కొనేందుకు ఎవరు లేరు. కొనేందుకు లేరు. కొంటే పైసలిచ్చేటోళ్లు లేరు. ఇది ప్రభుత్వం పరిస్థితి. కాంటా అవలేదు.. ఎప్పుడంటే రేపు మాపు అని చెప్తున్నరు. బస్తాలియ్యలేదు.. మేం కొనుక్కొని వచ్చినం. ధారాలు కూడా మేమే కొనుక్చొచ్చున్నమంటూ వాపోయారు.
మొదట కొనిపించాలే.. ఇక్కడి నుంచి మొత్తం ఎత్లిపించాలి అంతే కదా.. వాడు డబ్బులు ఇచ్చేటట్టు లేడు. మొత్తం ఎత్తుకొని పోయేటట్టు ఉన్నడని కేటీఆర్ రైతులతో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు.