న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను మావోయిస్టు మనస్తత్వం గల వ్యక్తులుగా పేర్కొనలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత పీ చిదంబరం తదితరుల విమర్శలకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘ఎక్స్’ వేదికగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక పోస్టులో ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాలు మావోయిస్టులకు మద్దతు ఇచ్చి రాజ్యాంగాన్ని తిరస్కరించే వారికి, వేర్పాటువాదుల వెంట నిలబడి ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చేవారికి మాత్రమే వర్తిస్తాయని చెప్పారు. భారతదేశ ఈశాన్య ప్రాంతాలను మిగతా దేశం నుంచి వేరు చేయడానికి ‘చికెన్స్ నెక్’ను కత్తిరించాలని పిలుపునిచ్చే వ్యక్తులను ఇది సూచిస్తుందని రిజిజు తెలిపారు. ప్రధాని మోదీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ దేశం ముందుకు సాగకుండా చేసే దిమాగి నక్సల్స్ కూడాఉన్నారని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మాటలను వ్యక్తిగతంగా తీసుకుంటూ, తాను ‘దిమాగీ నక్సల్ కావడం గర్వంగా ఉంది’ అని అన్నారు.
ముందు థెరపీ చేయించుకోండి: అనురాగ్ కశ్యప్ కౌంటర్
ప్రధాని మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ, రాజకీయ బ్రాండింగ్ కంటే విద్య, విమర్శనాత్మక ఆలోచన, థెరపీ ద్వారా యువతను చేరుకోవాలని సూచించారు. అలాంటి ‘లేబుళ్ల’ వినియోగాన్ని ఆయన తప్పుపట్టారు.