Bhu Bharathi | ధరణిలో సమస్యలుంటే, దాన్ని సంస్కరించాల్సిన ప్రభుత్వం.. మొత్తం స్వరూప స్వభావాన్నే ఎందుకు మార్చేసింది! ధరణిలోని పకడ్బందీ నిబంధనల చట్రపు మేకుల్ని ఒక్కటొక్కటిగా ఊడబీకి.. భూభారతి పోర్టల్‌ను కాగితపు పులిగా ఎలా తయారుచేసింది? జిల్లా కలెక్టర్ల చేతిలోని పట్టా మార్పిడి అధికారాన్ని పలుచన చేసి, తహసీల్ ఆఫీసుల దాకా తెచ్చి పెట్టిందెందుకు? రైతులకు అవస్థలవుతున్నాయని తప్పుడు ప్రచారం చేసి, పలుకుబడి ఉన్న ఎవరైనా ఏ భూమినైనా మార్చుకునేలా మార్చేసిందెవరు? కుళ్లిపోయిన వీఆర్వో వ్యవస్థను మళ్లీ తెచ్చి, గ్రామ కమతాల పెత్తనం అప్పగించింది ఎందుకు? రైతులకు అవస్థలవుతున్నాయని తప్పుడు ప్రచారం చేసి, కొంచెం పలుకుబడి ఉన్న ఎవరైనా ఏ భూమినైనా మార్చుకునేలా మార్చేసిందెందుకు? మొన్న రావెల్కోల్!.. నిన్న బొంరాస్‌పేట! నేడు దుద్యాల!.. ఒక్కటొక్కటిగా పేలుతున్న ‘ల్యాండ్’మైన్లు భూభారతి బండారాన్ని బయటపెడుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): భూ భారతి పోర్టల్.. భూ దోపిడీ పోర్టల్‌గా మారిందా? భూ భారతి చాటుగా భారీ భూ కుంభకోణం జరుగుతున్నదా? విలువైన భూములను కొల్లగొట్టేందుకు సర్కార్ పెద్దలు కాచుకు కూర్చున్నారా? ఇందుకు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మాస్టర్‌ప్లాన్ తయారుచేసి పెట్టారా? వీరి దోపిడీ కోసమే భూభారతిలో అధికారుల అధికారాలను వికేంద్రీకరించారా? ‘బంటు’లను అధికారులుగా పెట్టుకొని భూములు మింగేసే కుట్రకు తెరలేపారా? రైతుల సమస్యలను పక్కనపెట్టి… ‘పెద్దల’ అక్రమ సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నారా? 22-ఏ నిషేధిత జాబితా ఈ కుట్రలో భాగమేనా? రైతులను కలెక్టరేట్ల చుట్టూ తిప్పుతూ.. తెరవెనుక భూములు కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారా? నిషేధిత జాబితాలోని భూములను క్లియర్ చేసే ముసుగులో అసలైన సర్కార్ భూములను సైతం చెరబట్టేందుకు పక్కా ప్లాన్ వేశారా? ఇవీ భూ భారతిపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.. ఈ ప్రశ్నలకు ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి అటు పార్టీ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానాలే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ‘భూ భారతి’ పోర్టల్ భూ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్‌లోని ముఖ్యనేతలు భూ భారతిని అడ్డుపెట్టుకొని భారీ భూ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా బయటపడుతున్న భూ కుంభకోణాలన్నీ ఈ కోవలోనివేననే ఆరోపణలున్నాయి. బొంరాస్‌పేట, రావెల్కోల్తోపాటు మరిన్ని విలువైన భూములపై కన్నేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా 22-ఏ నిషేధిత జాబితాతో మరో కొత్త భూ దోపిడీ కుట్రకు తెరలేపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
తహసీల్దార్లు, ఆర్డీవోలదే పెత్తనం !
వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరికున్నా ఇబ్బందిలేదనే నానుడిని కాంగ్రెస్ సర్కార్ బాగా ఒంటపట్టించుకున్నట్టుంది. ధరణితో తమ ఆటలు సాగడంలేదని భావించిన కాంగ్రెస్ పెద్దలు భూ భారతిలో కీలక మార్పులు చేశారు. సమస్యలను పరిష్కరించే అధికారులను వికేంద్రీకరించారు. ధరణిలో సమస్యల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు, ఆపై అధికారులకు మాత్రమే ఉండేది. కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించి అక్రమాలకు తావులేకుండా నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ ఆ నిర్ణయం తీసుకున్నది. ఇది మింగుడుపడని కాంగ్రెస్ పెద్దలు ఈ నిబంధనను మార్చేశారు. భూ భారతిలో సమస్యల పరిష్కార బాధ్యతలను కలెక్టర్లకే కాకుండా తహసీల్దార్, ఆర్డీవోలకు కట్టబెట్టారు. ఈవిధంగా అవినీతి, అక్రమాలు, భారీ భూ దోపిడీకి గేట్లు ఓపెన్ చేశారనే విమర్శలున్నాయి. కలెక్టర్లు అన్ని సందర్భాల్లో మాట వినరని, వారి చేతిలో అధికారం ఉంటే తమ పప్పులు ఉడకవని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఏకంగా కలెక్టర్ల అధికారాలకు కోత పెట్టారనే విమర్శలున్నాయి. దీంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారంలో ఆర్డీవోలు, తహసీల్దార్లదే పెత్తనం. వీళ్లు ఎంత చెబితే అంత అనేలా సాగుతున్నట్టు తెలిసింది. నచ్చితే నజరానా, నచ్చకపోతే జరిమానా అనేవిధంగా నివేదికలు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
విలువైన భూములను కొల్లగొట్టేందుకు పెద్దలు పలు రకాల మార్గాలను ఎంచుకొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో 22-ఏ నిషేధిత జాబితా కూడా ఒక మార్గమనే ఆరోపణలున్నాయి. హైకోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ పెద్దల కన్ను పడిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారనే ఆరోపణలున్నాయి. కేవలం తమకు కావాల్సిన భూములను మాత్రమే చేర్చితే తమ లక్ష్యం నెరవేరదనే ఉద్దేశంతో ఇందులో భూ యజమానులను సైతం భాగస్వాములను చేశారు. పట్టా భూములు, ఎలాంటి వివాదాలు లేని భూములు, 30 ఏండ్ల క్రితం ఇండ్లు నిర్మించుకున్న భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. ఇలా కోటి ఎకరాలను నిషేధిత జాబితాలోకి ఎక్కించారు. ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా బాధితులను భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఎలాంటి వివాదాలు లేని భూములతోపాటు పెద్దలు కన్నేసిన భూములను సైతం నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు తెరవెనుక భారీ కుట్ర జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నిషేధితం’ మాటున విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే 22-ఏ నిషేధిత సమస్యను సృష్టించారనే విమర్శలు కూడా ఉన్నాయి. సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని మరల్చి భూములు కొల్లగొట్టే ప్లాన్ వేశారనే విమర్శలున్నాయి. ఇలా 22-ఏ నిషేధిత జాబితాతో సర్కార్ పెద్దలకు రెండు రకాలుగా లబ్ధి చేకూరుతుందనే ఆరోపణలున్నాయి. ఒకవైపు, తమ కన్నుపడిన భూములను కొల్లగొట్టడం, మరోవైపు నిషేధిత భూములను తొలగించే పేరుతో కమీషన్లు సైతం వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా సర్కార్ పెద్దలు రెండు చేతులా సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
భూ భారతితో రైతులు, భూ యజమానుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు సైతం రైతుల సమస్యలను పట్టించుకోకుండా పెద్దల అక్రమాలకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి. గతంలో ధరణితో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, భూ భారతితో వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. రెవెన్యూ సదస్సులో 9.15 లక్షల దరఖాస్తులు వస్తే ఇందులో పరిష్కారమైనవి 5 శాతమే కావడం గమనార్హం. సాదాబైనామాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇలా రైతులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య, దరఖాస్తును భూ భారతి ద్వారా పరిష్కరించిందిలేదు. అయితే, రైతుల సమస్యలను పక్కనపెట్టిన అధికారులు ప్రభుత్వ పెద్దల సేవలో తరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెద్దల ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వారికి సంబంధించిన భూ సమస్యలను క్ల్లియర్ చేస్తూ అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నది. ఇప్పటివరకు భూ భారతితో రైతుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
భూ సమస్యల పరిష్కార అధికారాలను కలెక్టర్ల నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లకు బదలాయింపు చేయడం ద్వారా కాంగ్రెస్ సర్కార్ భూ దోపిడీకి రాచమార్గం వేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్లాన్ ఇప్పుడు వేసింది కాదని, దీని వెనుక సుదీర్ఘ ప్రణాళిక ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఈ మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధంచేశారని, ఇప్పుడు పక్కాగా దీన్ని అమలు చేస్తున్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కొల్లగొట్టాల్సిన భూముల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పని పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే వారు స్కెచ్ వేసిన చోట వారికి తొత్తులుగా మారిన బంటులను తహసీల్దార్లుగా, ఆర్డీవోలుగా నియమించి దోపిడీని పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కీసర ఆర్డీవో పరిధిలోని బొంరాస్‌పేట రైతుల భూముల వివాదాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. రైతుల భూములను ఏకపక్షంగా పెద్దలకు ఫలహారంలా పంచి పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా తహసీల్దార్లు, ఆర్డీవోలతో అనుకూల నివేదికలు ఇప్పించుకుంటూ భూ దోపీడిని పూర్తి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.