బెంగళూరు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై ఆదివారం నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, అసమ్మతిని తెలిపే వారిని లక్ష్యంగా చేసుకునే ఈ పదాన్ని ప్రధాని ఉపయోగించారని ఆయన ఆరోపించారు. తాను విడుదల చేసిన ఒక వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ నిన్నటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశంలో రెండు రకాల మనుషులు పనిచేయడం మనం చూశామని, ఒకరు (మోదీని సూచిస్తూ) ‘సుప్రీం లీడర్’ కాగా, మరొకరు ప్రభుత్వం దృష్టిలో బొద్దింకలు లేదా దీమాగీ నక్సలైట్లు అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేవారిని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవారిని నక్సలైట్లుగా ప్రధాని మోదీ చివరకు అంగీకరించారని ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. పాఠశాలల దుస్థితిని బయటపెడుతూ వాటి బాగు కోసం కృషి చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వలంటీర్ల సేవలను ఆయన ప్రశంసించారు.