చిట్యాల, మార్చి 06 : ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య(Young woman Commits suicide) చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు..గ్రామానికి చెందిన ఎర్రబెల్లి విజయ-దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఎర్రబెల్లి పల్లవి(19) ఉన్నారు. పల్లవి, పల్లవి తల్లి విజయ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతాయని, అందుకుగాను సరిపడా డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురయ్యేదని చెప్పారు.
ఈ క్రమంలో పల్లవి గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కాగా, మృతురాలి తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఈశ్వరయ్య వెల్లడించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తె కళ్లముందే కానరాని లోకానికి వెళ్లడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.