మహదేవపూర్, జూన్ 17: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులకు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అన్నిటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే విద్యారంగానికి బడ్జెట్లో 17 శాతం నిధులు ఇస్తామని చెప్పి అరకొర నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తున్న సందర్భంగా ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామన్నారు.