భూపాలపల్లి : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించి ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్వోఎఫ్ఆర్ చట్టం 2006 ప్రకారం పోడు వ్యవసాయం చేసుకుంటూ అర్హత ఉన్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇందులో భాగంగా నవంబర్ 8వ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా పోడు వ్యవసాయం చేసుకుంటున్న సంబంధిత గ్రామాల గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇందు కోసం అధికారులతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో నోడల్ కమిటీలను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ స్థాయిలో ఎఫ్ఆర్సీలను ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 8897622100 కు పోడు రైతులు ఫోన్ చేసి దరఖాస్తు విధానం, తదితర సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా అటవీశాఖ అధికారి లావణ్య, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవికుమార్, సెక్షన్ అసిస్టెంట్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.