Cremations | జనగామ జిల్లా లింగాల గణపురంలో జరిగిన సంఘటనలో లింగాల గణపురం, బండ్లగూడ గ్రామాల ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బండ గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తండ్రి కొడుకులు ఇద్దరు గుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బండ్లగూడెం కారోబార్ మహేందర్ కు పోలీసులు జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పగించారు. వారికి ఎవరూ లేకపోవడంతో రెండు గ్రామాల ప్రజలే ముందుకు వచ్చి బంధువులుగా మారి చేయి చేయి కలిపి, చితి పేర్చి ఇద్దరికీ శనివారం దహన సంస్కారాలు చేశారు.
మృతులు వలయూరు లక్ష్మీనరసింహచార్యులు, అతని కుమారుడు పవన్ కుమార్ ఆచార్యు మృతదేహాలను ట్రాక్టర్ ద్వారా లింగాల గణపురంలోని స్మశాన వాటికకు తీసుకొచ్చారు. వారి కులమత ఆచారం ప్రకారం మృతదేహాలకు మొదట పూజలు చేయాల్సి ఉండగా.. లింగాల గణపురం ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ పాలకుర్తి నుండి పూజా పూజారిని రప్పించి పూజలు జరిపించారు. అనంతరం రెండు గ్రామాల ప్రజలు ఆ రెండు చితిలపై చేర్చి దహన సంస్కారాలు జరిపించారు.
ఆ కార్యక్రమంలో దేశ్ముఖ లింగాల సింధు దీపక్ రెడ్డి, లింగాల గణపవరం సర్పంచ్ ఎడ్ల లావణ్య రాజు, బండ్లగూడెం మాజీ సర్పంచ్ కాటన్ విజయ కుమారస్వామి, నాయకులు వంచ మహేశ్వర్ రెడ్డి, రామ్ రెడ్డి, బిట్ల నాగభూషణం, బోయిని జంపి, కడకంచ రవి, లింగాల గణపురం ఉపసర్పంచ్ గట్టగల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.