Harish Rao | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ప్రకృతిపై, ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎండల వల్ల పంటలు ఎండిపోతుంటే కేసీఆర్, హరీశ్‌రావు సంతోషపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎండలు కొట్టాయని.. కానీ ఆనాడు పంటలు ఎందుకు ఎండలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ రోజే ఎందుకు ఎండిపోతున్నాయని నిలదీశారు. కేసీఆర్ పాలనలో మండుటెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువుల్లో నీళ్లు ఉండేవని.. ఒక్క ఎకరం కూడా ఎండకుండా పండిందని గుర్తుచేశారు. పాలన చేతగాక ప్రకృతిపై, ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని విమర్శించారు.
దేవాదుల ఓ అండ్ ఎం కాంట్రాక్టర్‌కు రూ.7వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులపాటు పంపుల మోటర్లు ఆన్ చేయలేదని హరీశ్‌రావు తెలిపారు. 33 రోజులు దేవాదుల పంపుల మోటార్లు ఆన్ చేసి ఉంటే రిజర్వాయర్లు నిండేవని.. పొలాలకు నీళ్లు వచ్చేవని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పును ప్రకృతి మీద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు ఇవ్వద్దని మోటార్లకు అడ్డంగా హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు నిల్చున్నారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
తాను 20-20 మ్యాచ్ ఆడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని హరీశ్‌రావు తెలిపారు. ఫైనాన్స్‌లో బిల్లులు ఇవ్వాలంటే 20 శాతం కమీషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20 శాతం కమిషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్లకు, గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ ఇవ్వాలంటే 20 శాతం కమీషన్ అని ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.
ఈసారి ప్రకృతి కనికరించిందని.. పోయినసారి కంటే సమృద్ధిగా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు.
వేలాది టీఎంసీల నీళ్లు గోదావరిలో కలిశాయని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుక్క చుక్కను ఒడిసిపట్టాడని.. రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వృథాగా వదిలిపెడుతున్నాడని విమర్శించారు. గోదావరిలో ప్రవాహం ప్రారంభమైందని తెలివగానే మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపి ఉండాల్సిందని హరీశ్‌రావు అన్నారు. సకాలంలో ఓ అండ్ ఎం పనులు పూర్తిచేసుకుని ఎండాకాలం కోసం నీళ్లు సిద్ధం చేసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.