నర్సింహులపేట : ఆకాల వర్షాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. గురువారం రాత్రి మండలం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడినవర్షం కురిసింది.
గాలివానకు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగిపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మిరుప కళ్లాల్లో వర్షపునీరు చేరడంతో మిరపకాయలను రైతులు ఆరబెడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసుకున్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గంగారంలో..
గంగారం మండల పరిధిలోని కోడిశాలమిట్ట గ్రామంలో రాత్రి కురిసిన వర్షాలకు తునికాకు కల్లంలోని ఆకుల కట్టలు చెల్లాచెదురు కాగా రోడ్డు పై చెట్లు కూలి అడ్డంగా పడ్డాయి. గాలి భీభత్సంతో గ్రామంలో కొన్ని ఇండ్ల పై రేకులు లేచిపోవడంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.