భక్తుల పుణ్యస్నానాలతో కాళేశ్వరం కోలాహలంగా మారింది. ప్రాణహిత పుష్కరాలు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తజనం తరలివచ్చి నదీస్నానాలు ఆచరిస్తోంది. 10వ రోజైన శుక్రవారం 60వేల మంది రాగా, ఎటుచూసినా సందడే కనిపించింది. తెలంగాణ నుంచే గాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి భక్తులు పుష్కరాలు వచ్చి నదీమాతకు పూజలు చేసి తరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పూజలు, లడ్డూ, పులిహోర ద్వారా ఆలయానికి రూ.4.25 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో మహేశ్ తెలిపారు. అలాగే సిరోంచ పుష్కర ఘాట్ వరకు తెలంగాణ ఆర్టీసీ ఉచితంగా మినీ బస్సులు సమకూర్చడంతో కాళేశ్వరం వచ్చిన భక్తులు అవతలి వైపు వెళ్లి ప్రాణహిత నదిలో పుష్కర స్నానాలు చేస్తున్నారు.
కొందరు భక్తులు మంచిర్యాల జిల్లా అర్జునగుట్టకు కూడా వెళ్లివస్తుండడంతో ఆ దారులన్నీ రద్దీగా మారాయి. ఇలా పది రోజుల నుంచి లక్షలాదిగా వచ్చి వెళ్లే భక్తులతో కాళేశ్వరం మహాజాతరను తలపిస్తున్నది. మరో 48 గంటల్లో పుష్కరాలు ముగియనుండడంతో ఇంకా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సాయంకాలం అర్చకులు ప్రాణహిత నదికి ద్విహారతులు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన హిందూ మక్కాల్కచ్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్, హరిద్వార్‌కు చెందిన సద్గురు చైతన్యానందస్వామి ప్రత్యేక పూజలు చేశారు.
– కాళేశ్వరం, ఏప్రిల్ 22