టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు అధికంగా ఉన్నాయని, భవిష్యత్తులో సమీక్షించి హేతుబద్ధీకరించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉపాధ్యాయుల నియామకాలు, ఉద్యోగోన్నతులతోపాటు కాంట్రాక్ట్ విధానంలో నియామకాలపైనా ప్రతిపాదనలు చేసింది. ఇవి అమలు చేస్తే విద్యలో నాణ్యత మెరుగుపడుతుందని కమిషన్ పేర్కొన్నది. అయితే, ఉపాధ్యాయుల జీతాలు తగ్గించడం వల్ల విద్యలో నాణ్యత ఎలా పెరుగుతుందో ఆ కమిషన్‌కే తెలియాలి.
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయించే నిధులు పెంచకుండా విద్యార్థుల సంక్షేమం ఎలా సాధ్యం? ప్రతిపాదిత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో(టీపీఎస్) ప్రీ స్కూల్ టీచర్లకు నెలకు రూ.16 వేల వేతనం ఇవ్వాలని, స్పెషల్ టీచర్లకు నెలకు రూ.20 వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యా కమిషన్ సూచించింది. ఇదే స్కూళ్లల్లో పనిచేసే హెచ్ఆర్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ అసిస్టెంట్, స్టూడెంట్ రిలేషన్స్ అసిస్టెంట్, ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, నర్స్, హెడ్క్లర్క్లకు నెలకు రూ.20వేల వేతనం ఇవ్వాలని కమిషన్ సూచించింది. బోధనేతర సిబ్బందికి నెలకు రూ.20 వేలు, అత్యంత కీలకమైన పునాది వంటి పూర్వప్రాథమిక విద్యను బోధించే టీచర్లకు నెలకు రూ.16 వేల వేతనం ఇవ్వాలని కమిషన్ సూచించడం దేనికి సంకేతం? దీనివల్ల విద్యలో నాణ్యత మెరుగుపరచడానికి, విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించేందుకు అవకాశం ఏర్పడుతుందని కూడా కమిషన్ పేర్కొన్నది. 2015 వేతన స్కేళ్లలో డీఏ లేకుండా కనీస వేతనం రూ.19 వేలు ఉండగా, కమిషన్ సిఫారసుల్లో ఉపాధ్యాయుల వేతనాలు కనీస వేతనం కన్నా తక్కువ ఉండడం గమనార్హం!
ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాల నయా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో విద్య వాణిజ్యీకరణ, ప్రైవేటీకరణ పెరుగుతున్నది. ప్రభుత్వాలు విద్యకు కేటాయించే నిధులు తగ్గిపోతున్నాయి. విద్యారంగం పట్ల పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో యువత ఉపాధ్యాయ వృత్తి స్వీకరించడానికి ‘స్టేటస్ ఆఫ్ ద టీచర్స్’ పత్రంలో పేర్కొన్నట్టుగా ప్రభుత్వాలు ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది.
అంతర్జాతీయ సంస్థలు నిర్దేశించిన మార్గదర్శకాలు, కార్మిక సంస్థల సూచనలు, కొఠారి కమిషన్ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఉపాధ్యాయుల వేతనాలపై తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సూచనలు టీచర్ల గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయి. టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు అధికంగా ఉన్నాయని, భవిష్యత్తులో సమీక్షించి హేతుబద్ధీకరించాలని కమిషన్ సూచించడం విడ్డూరం. ఉపాధ్యాయుల నియామకాలు, ఉద్యోగోన్నతులతోపాటు కాంట్రాక్ట్ విధానంలో నియామకాలపై కూడా వింతయిన, విడ్డూరమైన ప్రతిపాదనలు చేసింది.
విద్యా కమిషన్ బాధ్యులైన వ్యక్తులు తమ నివేదికపై వివరణ ఇస్తూ భవిష్యత్తులో నియమించే ఉపాధ్యాయులకే తక్కువ వేతనాలు చెల్లించాలని, సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల గురించి సిఫారసు చేయలేదని చెప్పారు. ఈ వివరణ కూడా దారుణంగా, అమానవీయంగానే ఉన్నది. ఎందుకంటే, ఇప్పటికే విద్యావాలంటీర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ టీచర్లు, అవర్లీ బేస్డ్ టీచర్లు, పారా టీచర్లు, అకడమిక్ కన్సల్టెంట్ల పేరుతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వేలాది మంది చాలా తక్కువ జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నూతన సిఫారసులు అమల్లోకి వస్తే విద్యారంగంలో శ్రమదోపిడీ చట్టబద్ధం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న జాతీయ విద్యా విధానం-2020లో ఉపాధ్యాయుల, అధ్యాపకుల వేతనాల విషయం ప్రస్తావన లేదు. పైగా ఉపాధ్యాయులను ‘హైర్’ చేసుకోవాలని కొత్త పదబంధాన్ని వాడింది. ‘హైర్’ అంటే తాత్కాలికంగా వారి సర్వీసును తక్కువ వేతనాలకు వినియోగించుకొని, నిర్ణీత కాలం తర్వాత బయటకు పంపడమే తప్ప, వారి ఉద్యోగాలకు భద్రత ఉండదు. మరి ఇప్పుడు తెలంగాణ విద్యా కమిషన్ సూచనలు కూడా అదే మార్గదర్శకాల కోవలోకి వచ్చాయని భావించవచ్చు.
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారంతా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారే! వారి స్థితిగతుల గురించి కమిషన్ మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారి శ్రమదోపిడీతో లాభాలను ఆర్జించడాన్ని కమిషన్ పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉపాధ్యాయుల వేతనాలు మన దేశంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, నార్వే, డెన్మార్క్, ఇజ్రాయెల్, అమెరికా, క్యూబాలో ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారు.
ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించాలని, అప్రెంటిస్ విధానం అమలు చేయాలని, ఉద్యోగోన్నతుల్లో వింత నిబంధనలు పెట్టాలంటూ ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు చేయడం సమర్థనీయం కాదు. విద్య వాణిజ్యీకరణ అయిన తరుణంలో ఈ సూచనలు విద్యావ్యాపారులకు మరిన్ని లాభాలు తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ దెబ్బతీసేలా సిఫారసులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలు, వివిధ జాతీయ కమిషన్లు సూచించిన విధంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో అత్యధిక వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా నిలువాలి. అప్పుడే విద్యారంగంలో మార్పులు వచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందుతుంది. లేదంటే ప్రతిభావంతులైన యువకులు ఈ వృత్తిలోకి రావడానికి ఇష్టపడరు. ఫలితంగా సమాజంలో నాణ్యమైన మానవ వనరుల నిర్మాణం జరగదు.