న్యూఢిల్లీ, మార్చి 13 : రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పాలస్తీనా పౌరులకు మద్దతు తెలియచేస్తూ, ఇజ్రాయెల్ అంతాన్ని కోరుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఖుద్స్ వార్షికోత్సవం కోసం వేలాదిమంది ఇరానీయులు శుక్రవారం హాజరైన ప్రదేశం వద్ద బాంబులు వేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ వెంటనే వివరాలు తెలియరాలేదు. అయితే ఇజ్రాయెల్ బాంబు దాడి హెచ్చరికలు, ఏదేమైనా తమ ప్రజా నిరసనలు కొనసాగించాలన్న ఇరాన్ నిర్ణయం ఇరు పక్షాల దృఢ సంకల్పాన్ని వెల్లడిస్తున్నాయి. టెహ్రాన్ సెంట్రల్‌లోని ఫిర్దోసీ చౌక్ వద్ద అమెరికా, ఇజ్రాయెల్‌కు మరణశిక్ష విధించాలని నినదిస్తూ వేలాదిమంది ఇరాన్ పౌరులు ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఇరాన్ న్యాయశాఖ అధిపతి గులాంహుస్సేన్ మొహసేని ఇజీ ఒక స్థానిక టెలివిజన్ విలేకరితో మాట్లాడుతూ ఈ క్షిపణుల వానకు ఇరాన్ భయపడదని చెప్పడం కనిపించింది. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడి దాని నిస్పృహను తెలియచేస్తుందని సీనియర్ భద్రతా అధికారి అలీ లారీజానీ ప్రకటించారు.
ఇరాక్‌లో గురువారం కూలిపోయిన అమెరికన్ కేసీ-135 రీఫ్యూయెలింగ్ విమానంలోని ఆరుగురు సిబ్బంది మరణించారని అమెరికన్ సైన్యం ప్రకటించింది. ఇది ఫ్రెండ్లీ లేక శత్రువులు జరిపిన దాడి వల్ల జరిగిన ప్రమాదం కాదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. రెండు విమానాలు రీఫ్యూయెలింగ్కి వెళ్లగా అందులో ఒకటి సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ఇరాన్‌పై సైనిక ఆపరేషన్లలో భాగంగా కూలిపోయినట్లు అమెరికా బహిరంగంగా ప్రకటించిన కేసీ-135 విమానాలలో ఇది నాలుగవది. గతవారం కువైట్ జరిపిన ఫ్రెండ్లీ కాల్పుల్లో మూడు అమెరికన్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. కాగా, గడిచిన 24 గంటల్లో తమ వైమానిక దళం ఇరాన్‌లోని 200కు పైగా లక్ష్యాలను కొట్టిందని, అందులో క్షిపణి లాంఛర్లు, రక్షణ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలు ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో ఇజ్రాయెల్ తెలిపింది.
గల్ఫ్ ప్రాంతంలోని చమురు, ఇతర మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. 50 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఒమన్‌లోని సొహర్ ప్రాంతంలో గల ఓ పారిశ్రామిక వాడలో రెండు డ్రోన్లు కూలిపోయి ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఒమన్ వార్తాసంస్థ తెలిపింది. రానున్న దాడులను హెచ్చరిస్తూ బహ్రెయిన్‌లో సైరన్లు మార్మోగాయి. దుబాయ్‌లోని పర్యాటక, వాణిజ్య కేంద్రం వద్ద భారీ మంటలు చెలరేగాయి. అయితే కూల్చివేసిన క్షిపణి శకలాల నుంచి వచ్చిన మంటలని అధికారులు చెప్పారు. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ భవనాన్ని ఢీకొనడానికి వచ్చిన క్షిపణిని అడ్డుకోవడంతో దాని శకలాలు తగిలి భవనం కొద్దిగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.
ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆచూకీని తెలియజేస్తే 10 మిలియన్ డాలర్లు (రూ. 92,47,48,000) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ న్యాయ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్( ఐఆర్జీసీ) ప్రపంచమంతా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నదని యూఎస్ ఆరోపించింది.
అమెరికా విమాన వాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) గురువారం ప్రకటించింది. తమ దాడుల్లో భారీగా దెబ్బతిన్న అణుశక్తి సామర్థ్యం గల అబ్రహం లింకన్ ప్రాంతీయ జలాల నుంచి నిష్క్రమిస్తున్నదని ఐఆర్జీసీ తెలిపింది. ఒమన్ సముద్ర తీరం సమీపం నుంచి నిర్వహిస్తున్న నౌక నుంచి అబ్రహం లింకన్ లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ వెల్లడించినట్లు ఇరానియన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ పేర్కొన్నది.
ఇరాన్ లొంగిపోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 దేశాలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రకటించారు. మనందరినీ బెదిరిస్తున్న క్యాన్సర్‌ని తాను వదిలించినట్లు ట్రంప్ అమెరికన్ సైన్యం గురించి గొప్పగా ఈ సమావేశంలో తన మిత్ర దేశాలకు వెల్లడించినట్లు జీ7 దేశాలకు చెందిన ముగ్గురు అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తాసంస్థ పేర్కొన్నది. ఇరాన్ కొత్త నాయకుడు ఎవరో ఎవరికీ తెలియదని, లొంగుబాటు గురించి ప్రకటించడానికి కూడా ఎవరూ లేరని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఆక్సియోస్ తెలిపింది. ఇరాన్ నాయకత్వాన్ని మతిభ్రమించిన నీచులుగా అభివర్ణిస్తూ వారిని చంపడం తమకు గొప్ప గౌరవమని ట్రంప్ పేర్కొన్నట్లు వార్తాసంస్థ చెప్పింది.
ఒమన్ రాజధాని మస్కట్‌పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరో 11 మంది గాయపడగా, ఇందులో 10 మంది భారతీయులే ఉన్నారని తెలిపింది. ‘అల్-అవామీ ఇండస్ట్రియల్ ఏరియా’పై ఇరాన్ డ్రోన్ దాడులు చేసిందని ‘అల్ జజీరా’ వార్తా కథనం తెలిపింది. దీనిపై విదేశాంగ శాఖ ఉన్నతాధికారి మహాజన్ మాట్లాడుతూ, ‘మస్కట్‌కు సమీపంలోని సోహర్ సిటీపై ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భారతీయుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడ్డ 10 మంది భారతీయుల్లో ఐదుగురు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు’ అని చెప్పారు.