ఖిలా వరంగల్, మే 22: ‘రైల్వే శాఖను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను నూతన హంగులతో పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మొదటి విడతలో మూడు రైల్వే స్టేషన్లను చారిత్రక నేపథ్యంతో పాటు విమానాశ్రయాలను తలపించేలా ప్రయాణికులకు అన్ని మౌలిక వసతులు కల్పించాం’ అని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు.
అమృత్ భారత్ స్టేషన్ పథ కంలో వరంగల్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం ద్వారా సామాన్యులందరికీ అన్ని సదుపాయాలు కల్పించేలా రైల్వే స్టేషన్ పునరుద్ధరించామన్నారు. భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి సాక్షిగా నేడు వరంగల్ రైల్వే స్టేషన్ నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడం సంతోషంగా ఉందని, ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.
అభివృద్ధి ఎవరు చేసినా పార్టీ, రాజకీయాలకతీతంగా స్వాగతించాలన్నారు. వరంగల్ ప్రజలకు మరోసారి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, దక్షిణ మధ్య రైల్వే ఏడీజీఎం నీరజ్, ఏడీఎం గోపాల్, ఏసీఎం ఐఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.