హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గతంలో రైతుబంధు, రైతుభరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించేవారు. సీసీఎల్ఏ జాబితా ఆధారంగా ఒక కటాఫ్ తేదీని నిర్ణయించి ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి రైతుభరోసాలో అవకాశం కల్పించేవారు. దీంతో భూములను అమ్ముకున్న పాత రైతులు పోగా ప్రతి సీజన్లో దాదాపు 3 లక్షల మంది కొత్త రైతులు రైతుభరోసా పథకానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. కానీ, ఈసారి యాసంగి సీజన్లో రైతుభరోసా పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే తేదీని ప్రకటించినప్పటికీ కొత్త రైతుల రిజిస్ట్రేషన్‌పై డీఏవోలు, ఏఈవోలకు ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.
దీంతో ఈసారి కొత్త రైతుల రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో లక్షల మంది కొత్త రైతులు పంట పెట్టుబడి సాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది. ఇప్పటికే భూమిని అమ్మేసుకున్న పాత రైతును రైతుభరోసా జాబితా నుంచి తొలగిస్తారు. దీంతో ఆ రైతుకు పంట పెట్టుబడి సాయం లభించదు. ఆ రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన కొత్త రైతుకు రైతుభరోసాలో పేరు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇవ్వకపోతే ఆయనకూ సాయం అందదు. ఇలా పాత రైతులను జాబితా నుంచి తొలగించడం, కొత్త రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇవ్వకపోవడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.