Assembly Session | రాష్ట్ర శాసనసభ సభ్యుల్లో ఆవేదన పూర్వక చర్చ జరుగుతున్నది. ‘సభ జీరో అవర్‌తో మొదలుపెడ్తారు.. సభలో ఏం చర్చిస్తారో సభ ప్రారంభమయ్యేదాకా తెలియదు.. సభ్యులకు ఇవ్వాల్సిన ఎజెండా కాపీ అర్ధరాత్రి తర్వాతో, లేదా సభ ప్రారంభమయ్యాకో ఇస్తారు. రెండున్నరేండ్లయినా సభలో వెల్ఫేర్ కమిటీలు వేయరు. డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోరు. బ్రేక్ ఇచ్చినప్పుడల్లా.. తిరిగి ఎప్పుడు సభ ప్రారంభమయ్యేదీ తెలియదు’.. ఇదీ రాష్ట్ర శాసనసభ నడుస్తున్న తీరుపై పలువురు సభ్యుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. తెలంగాణ శాసనసభ వ్యవహారాలను గందరగోళంగా మారుస్తున్న అధికారపక్షం తీరుపై మీడియా వర్గాలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. దానికితోడు ప్రతిపక్ష సభ్యుల మైక్‌ను కట్ చేయడం, మీడియాపైనా ఆంక్షలు.. ఇలా ఒకటేమిటీ.. అనేక అంశాలపై సభ్యుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితుల మీద శాసనసభ వ్యవహారాల మంత్రి గానీ.. ఇటు సభాపతి కార్యాలయం గానీ ఇంకా దృష్టి పెట్టలేదని, దాంతో వ్యవహారం అస్తవ్యస్తంగా మారిందని సభ్యులు అభిప్రాయ పడుతున్నారు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభలో జరుగుతున్న కొన్ని పరిణామాలు విస్తుగొల్పుతున్నాయి. సభకు కొన్ని సంప్రదాయాలుంటాయి. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా శాసనసభ పాటించే సంప్రదాయాలు, నియమ నిబంధనలు ఆదర్శవంతంగా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో శాసనసభలో ఈ సంప్రదాయాలను తప్పక పాటించేవారు. అయితే, ఇటీవలి కాలంలో సభ నడుస్తున్న తీరు పలుమార్లు వివాదాస్పదమవుతున్నది. ‘ఏ రోజు సభలో ఏ అంశంపై చర్చిస్తారన్నదీ సభ్యులకు తెలువడం లేదు. గతం నుంచీ ఉన్న సంప్రదాయాలనుబట్టి సభ జరగడానికి ఒకరోజు ముందు ఎజెండా కాపీలను సభ్యులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో ఎజెండాను పెట్టడంతోపాటు శాసనసభాపక్ష కార్యాలయాలకు, శాసనసభ కార్యాలయాల్లోని కార్యదర్శులకు ఆ ఎజెండా కాపీలను పంపించాలి. వీలైతే ఎమ్మెల్యే క్వార్టర్లలో, మంత్రుల క్వార్టర్లలో నివసించే వారికి ఫిజికల్ కాపీలను కూడా పంపాల్సి ఉంటుంది.
కానీ, రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత.. ఎజెండాను అర్ధరాత్రి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం లేదా సభ జరగడానికి కొన్ని గంటల ముందు ఆన్లైన్లో పెట్టడం, ఒక్కోసారి సభ ప్రారంభమైన తర్వాత ఎజెండా కాపీలను పంపిణీ చేయడం చేస్తున్నారు. దీనిపై సభ్యుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అప్పటికప్పుడు ఎజెండాను తమ ముందుపెడితే తామెప్పుడు ప్రిపేర్ కావాలి..? ఎలా మాట్లాడాలి? అంటూ వారు రుసరుసలాడుతున్నారు. విపక్ష బీఆర్ఎస్ సభ్యులే కాదు.. అధికార పక్షంతో స్నేహపూర్వకంగా ఉండే ఎంఐఎం సభ్యులూ పలు సందర్భాల్లో ఎజెండాను ఇవ్వడంలో తీవ్ర ఆలస్యం చేస్తున్నారని, అంతా గందరగోళంగా ఉన్నదని నిరసన కూడా తెలిపారు. అధికారపక్షం తీరుతో శాసనసభలో సంప్రదాయాలు, నియమనిబంధనలను పాటించని పరిస్థితులు ఏర్పడుతున్నాయని సభావ్యవహారాలను సుదీర్ఘంగా గమనిస్తున్న సీనియర్ సభ్యులు, నిపుణులు చెప్తున్నారు.
శాసనసభ జరిగే సమయంలో ఏ రోజు ఏ చర్చ జరుగుతుందన్న దానిపై సమావేశాల ప్రారంభం రోజే నిర్ణయం జరగాలి. దీని కోసమే శాసనసభ సలహామండలి (బీఏసీ) ఉంటుంది. బీఏసీలో ప్రధానంగా సభ మొత్తం ఎన్ని రోజులు జరుగుతుంది? ఏ రోజు దేనిపై చర్చ జరుగుతుంది? స్వల్పకాలిక చర్చలా.. ప్రత్యేక చర్చలా? ప్రభుత్వం ఇచ్చే స్టేట్‌మెంట్‌లా? తీర్మానాలా? ప్రశ్నోత్తరాలను ఎంతసేపు నిర్వహించాలి? వాయిదా తీర్మానాలు ఇస్తే దాన్ని ఏ రూపంలో చర్చకు అనుమతించాలి? సభలో బిల్లులు ఎప్పుడు పెట్టాలి? ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి? అన్నదానిపై చర్చ జరుగుతుంది. అయితే, గడిచిన రెండున్నరేండ్లుగా బీఏసీలో ప్రతిపక్ష పార్టీలకు చుక్కెదురవుతున్నది. ట్రెజరీ బెంచీలదే పైచేయిగా ఉందనే భావన విపక్ష సభ్యుల్లో వ్యక్తమవుతున్నది. బీఏసీ సమావేశంలోని నిర్ణయాలను బులెటిన్ రూపంలో విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, బీఏసీ సమావేశ నిర్ణయాలపై బులెటిన్లు సకాలంలో రావడంలేదని పలువురు శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మాత్రమే ఆమోదించేలా ఉంటే తమను పిలువడమెందుకని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సభ జరుగుతున్న తీరుపై బీఆర్ఎస్, ఎంఐఎం వంటి పార్టీలు బీఏసీలోనే అనేకసార్లు ఆందోళన వ్యక్తంచేసినప్పటికీ.. అసంతృప్తే మిగులుతున్నదని వారు అంటున్నారు.
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవలికాలంలో జీరోఅవర్తో శాసనసభ సమావేశాలను మొదలవుతున్నాయి. సహజంగా, గతంలో ఉన్న నిబంధనలు, సభాసంప్రదాయాల ప్రకారం ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు మొదలు కావాలి. ఏదైనా అనూహ్య సందర్భంలో, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రశ్నోతరాలను రద్దు చేసి స్వల్పకాలిక చర్చను మొదలుపెడ్తారు. కానీ, ఇప్పటివరకు తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కూడా జీరోఅవర్తో మొదలుకాలేదంటే అతిశయోక్తి కాదు. జీరోఅవర్ అంటే ప్రశ్నోత్తరాల సందర్భంగా రాని, ఏదైనా ఆ రోజు ఉన్న ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించే అవకాశాన్ని సభ్యులకు ఇవ్వడం. ఇది కూడా గతంలో అరగంట నుంచి గంటలోపే ఉండేది. అతి ముఖ్యమైన అంశాల ప్రస్తావన జరిగేది.
కానీ, ఇప్పుడు సమావేశాల ప్రారంభమే జీరో అవర్‌తో మొదలవుతున్నాయి. ‘ఇది శాసనసభ చరిత్రలో కొత్త సంప్రదాయం. ఇటీవల జీరోఅవర్‌ను గంటో, అరగంటో కాకుండా గంటల తరబడి నడిపారు. దానిపై ఆరాతీస్తే.. అసలు ఎజెండా ఏమిటో అప్పటికింకా తేలలేదని తెలిసింది. అంటే ఎంతో విలువైన శాసనసభ సమావేశాలను అధికారపక్షం ఎజెండా ఏమిటో తేల్చకుండానే మొదలుపెడుతున్నదన్నమాట’ అని సీనియర్ సభ్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇక జీరోఅవర్పైనా సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతున్నది. ‘జీరోఅవర్‌లో ప్రస్తావించే అంశాలను మంత్రులు నోట్ చేసుకొని, వాటికి సంబంధించిన సమాధానాలను ప్రశ్నలు అడిగిన ఎమ్మెల్యేలకు పంపించాల్సి ఉంటుంది. కానీ, ఇటీవల జీరోఅవర్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ప్రభుత్వవర్గాల నుంచి రావడంలేదు’ అని పలువురు ఎమ్మెల్యేలే చెప్తున్నారు.
ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీ. చైర్మన్‌ను ప్రతిపక్ష నేత సిఫారసు చేస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. కానీ, నామినేషన్ కూడా వేయని ఓ ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్‌గా చేయడంపై అప్పట్లో ఇంటాబయటా విపరీతమైన చర్చ జరిగింది. స్పీకర్ కార్యాలయం దానిపై స్పందించలేదు. వాస్తవానికి ఎన్ని నామినేషన్లు వేశారు.. ఎవరెవరు వేశారన్నది ప్రకటించాలి. కానీ, అలాంటిదేమీ జరగలేదు.
ఈసారి శాసనసభలో రెండున్నరేండ్లు గడిచిపోయినా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీ ఇంకా జరగలేదు. డిప్యూటీ స్పీకర్ పిటిషన్ కమిటీ చైర్మన్‌గా కూడా ఉంటారు. అనేక సమావేశాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంటుంది. కానీ, రెండున్నరేండ్లయినా డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ చేయలేదు. చీఫ్ విప్ పదవి కూడా ఇంకా ఖాళీగానే ఉన్నది.
శాసనసభలో మీడియాపై ఆంక్షలు పెట్టనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. లాబీల్లోకి మీడియా ప్రతినిధులను అనుమతించడం తరతరాలుగా వస్తున్నది. ఈ సారి కొంత కట్టడి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. శాసనమండలి హాలును కూడా అసెంబ్లీ హాలు వైపునకు తరలించడంతో ఇప్పుడు అక్కడ స్థలాభావంతో ఇలా చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ, మీడియా ప్రతినిధులను రాకుండా చేయాలన్న వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారనేది మీడియా ఆరోపణ.
తెలంగాణ శాసనసభలో మరో అంశం కూడా చర్చకు దారితీస్తున్నది. సభ జరుగుతున్నపుడు మధ్య మధ్యన టీ బ్రేక్ ఇస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఉదయం టీబ్రేక్ ఇచ్చి, సాయంత్రం మళ్లీ సభను మొదలుపెట్టిన సందర్భాలను పలువురు సభ్యులు గుర్తుచేస్తున్నారు. ఎజెండా నిర్ణయం కాకపోవడమే దీనికి కారణమై ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ఎజెండా లేకనే సభను వాయిదా వేస్తున్నారని బీఆర్ఎస్ సభ్యులు ఇటీవలికాలంలో పలుమార్లు ఆరోపించారు. బ్రేక్ ఇచ్చినా.. మళ్లీ ఎప్పుడు సభ మొదలవుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఉందని శాసనసభ లాబీల్లో ఎమ్మెల్యేలు చెప్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు రెండున్నరేండ్లవుతున్నది. ఇప్పటివరకు శాసనసభలో ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన మూడు కమిటీలను మాత్రమే ఏర్పాటుచేశారు. మరో 18 కమిటీల వరకు ఏర్పాటు చేయాల్సి ఉంది. అత్యంత ముఖ్యమైన వెల్ఫేర్ కమిటీలను కూడా అధికారపక్షం ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళ, మైనార్టీ తదితర కమిటీలూ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అనేకసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించినా.. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. కమిటీలను వేస్తే ఆయా సంక్షేమ శాఖలపై సమీక్ష చేసే అవకాశం ఉంటుంది. ఇక సభ్యుల కోసం పిటిషన్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స్ కమిటీ, లైబ్రరీ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ, ఫుడ్ కమిటీ, వైల్డ్‌లైఫ్ కమిటీ, కల్చరల్ కమిటీ.. ఇలా అనేక కమిటీలు ఉండాలి. కమిటీలుంటే సభ్యులకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఇప్పటివరకు ఈ కమిటీలు లేకుండా రెండున్నరేండ్లు గడిచాయి.