రఘునాథపల్లి, మార్చి 21: నియోజకవర్గ అభివృద్ధే తన ద్యేయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నా రు. వర్షాకాలంలోగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిశీలించి త్వరితగతిన దరఖాస్తుదారులకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు నేరుగా ఆర్ధిక సహాయం చేరే విధంగా అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ వాస్త వానికి దగ్గరగా ఉందని తెలిపారు. 3.04 లక్షల కోట్ల బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుకు రూ.56 వేల కోట్లు, సాగు నీటి రంగానికి పెద్ద పీట వేస్తూ రూ.23 వేల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇండ్లతోపాటు అదనంగా సీఎం రేవంత్ రెడ్డి మరో 1500 ఇండ్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య 5 వేలకు చేరిందని తెలిపారు. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నిజమైన లబ్దిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఏడాదిలోగా దేవాదుల పెండింగ్ పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.