జనగామ రూరల్, మార్చి 8: అమ్మవై, ఆలివై, లాలివై, పోరాట జ్వాలవై, ఆశయాల బాటవై, ఈసృష్టికి మూలమై, మానవుడి మనుగడకు ప్రాణమై, అన్నిట్ల సగభాగమై, ఆదేరువై, ఆధరణై, అనునిత్యం అండగా ఉంటున్న ఆడబిడ్డలందరికీ బీఆర్ఎస్ జనగామ (Jangaon ) మండల మహిళా విభాగం అధ్యక్షురాలు చిన్న బోయిన రేఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలన్నారు. ఆధిపత్యం, అణచివేతలు, ఆకలి, అవమానాలు, హత్యలు, అత్యాచారాలు, అసమానతలు, సామాజిక, లింగ వివక్షత లేని నూతన సమాజ నిర్మాణం కావాలని చెప్పారు. సమానత్వం, సమాన అవకాశాలు, సాధికారతను సాధించేలా మహిళలు ముందుకు నడవాలని ఆకాంక్షించారు.
మనకు జన్మనిచ్చిన తల్లులకు, మహిళా చైతన్యం, హక్కుల కోసం పోరాడిన చదువు మూలమైన తల్లి సావిత్రి బాయి పూలే, సేవకు నిలువెత్తు చిహ్నమైన మదర్ థెరిస్సా, పోరాటానికి ప్రతిరూపమైన చాకలి ఐల్లవ్వ, సామ్రాజ్యవాదంపై పోరాడిన మట్టిబిడ్డలు సమ్మక్క సారలమ్మకి ఇంకా వివిధ రంగాల్లో రాణించిన, రాణిస్తున్న, ప్రజా పోరాటాల్లో భాగమై శ్రమిస్తున్న ఎందరో, మరెందరో స్ఫూర్తికెరటాలైన వారందరికీ సెల్యూట్ చేస్తున్నాం. సమానత్వం కోసం సాగిన సమరమే ఈదినోత్సవం కాబట్టి ఆకాశంలో సగ భాగమైన మహిళలు అవకాశాల్లో, అన్నిరంగాల్లో ఉన్నతంగా ఎదగాలన్నారు. శ్రమలో పుట్టి, పెరుగుతున్న శ్రామిక నారీమనులందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.