New Delhi : ఢిల్లీలో దారుణం జరిగింది. మొబైల్ ఫోన్ చోరీ చేసిన దొంగను పట్టుకునేందుకు పట్టాలపై పరుగెడుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని షహదరా రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. మృతుడిని రోహిత్ కుమార్ (22)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్పట్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ అనే యువకుడు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో షహదరా రైల్వే స్టేషన్, ప్లాట్‌ఫాం నెం.3లో నిలబడ్డాడు.
అతడి సెల్‌ఫోన్‌ను ఒక దొంగ కొట్టేసి, పారిపోయాడు. ఇది గమనించిన రోహిత్ దొంగను గుర్తించి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగ వెంట పరుగెడుతూ వెళ్లిపోయాడు. అలా దొంగ వెంట పడుతూ రోహిత్ పట్టాలపైకి చేరుకున్నాడు. ఇదే సమయంలో పట్టాలపైకి ఢిల్లీ- కింగ్డమ్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. అయితే, దొంగను పట్టుకోవడంపైనే దృష్టిపెట్టిన రోహిత్ వేగంగా వస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలు రోహిత్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రోహిత్ అక్కడికక్కడే రైలు కింద పడి మరణించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం, లీగల్ ఫార్మాలిటీస్ కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ ప్రమాదానికి కారణమైన మొబైల్ ఫోన్ దొంగను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.