వరంగల్ : అందాల భామల మోజులో పడి చిరు వ్యాపారస్తుల పై కొరడా దులిపించిన గ్రేటర్ అధికారుల చర్యలను నిరసిస్తూ చిరు వ్యాపారస్తులకు అండగా బీఆర్ఎస్ మహా ధర్నా చేపట్టింది. బుధవారం గ్రేటర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ సుందరీమణుల నగర పర్యటన బూచిగా చూపి రోడ్డుపక్క వ్యాపారం చేసుకొని పొట్ట పోసుకుంటున్న పేదల బతుకులను చిదిమేడంపై మండిపడ్డారు. 48 గంటల్లో తొలగించిన చిరు వ్యాపారుల షాపులను పునరిద్ధరించాలని లేదంటే దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చిరు వ్యాపారస్తుల కోసం వెండింగ్ జోన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. 17 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. రైతు, ఉద్యోగ, విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ ధర్నాలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, సిద్ధం రాజు, ఇండ్ల నాగేశ్వరరావు, చెన్నం మధు, చిరు వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.