East fort | ఖిలా వరంగల్, జనవరి 22 : తూర్పు కోట పరిధిలోని ముదిరాజ్ వాడ, యాదవ వాడల్లో గత సంవత్సరం జూన్లో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నిధులు మంజూరు అయినప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంసిపిఐయూ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు 37వ డివిజన్ తూర్పు కోటలో పర్యటించి, పెండింగ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ముదిరాజ్ వాడలోని ముదిరాజ్ కమ్యూనిటీ భవన్ (సంగరాబోయిన ఇంద్రాసేన స్మారక భవన్), సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మంచినీటి పైప్లైన్ పనులు, అలాగే యాదవ వాడలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, నగర మేయర్, కాంగ్రెస్ నాయకులు అర్భాటంగా శంకుస్థాపనలు చేసి పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు. నిధులు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులను చేపట్టకపోవడం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి 37వ డివిజన్ తూర్పు కోటలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందిమల్ల మహేష్, ఖిలా వరంగల్ మండలం ఉపాధ్యక్షుడు నాండ్రె అమర్, బీఆర్ఎస్ 37వ డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, సంగరబోయిన ఉమేష్, వనపర్తి ధర్మరాజు, బేర వేణు, శిరబోయిన వాసుదేవ్, ఎంసిపిఐయూ నాయకులు సుంచు జగదీశ్వర్, రాయినేని ఐలయ్య, బీజేపీ నాయకులు బిల్లా కిషోర్, పెసరు కుమారస్వామి, ముడిదే రఘునాథ్, బొలుగొడ్డు అమృత్ తదితరులు పాల్గొన్నారు.