మల్యాల, మార్చి 2 : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన పచ్చి అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి. ఒక్కో పంపుహౌస్ నుంచి దుంకుతూ ఇప్పటికే ఎగువకు చేరుకున్నాయి. గాయత్రీ పంప్‌హౌస్ నుంచి వరదకాలువ మీదుగా ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు వరదకాలువల మీదుగా జలాలు ఎదురెక్కుతున్నాయి.
ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా రాంపూర్ పంప్‌హౌస్ నుంచి మూడు రోజులుగా వరదకాలువ ఎగువకు పంపింగ్ చేస్తుండగా, ఇంతకాలం కాళేశ్వరమే దండుగ అని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సంబురాలు చేసుకుంటున్నారు. మల్యాల మండల నాయకులు ఏకంగా రాంపూర్ పంప్‌హౌస్ వద్ద చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
పంటలకు నీళ్లు తెస్తున్నామని, వరద కాలువ తూముల ద్వారా చెరువులను నింపేందుకు ఎమ్మెల్యే సత్యం చర్యలు తీసుకున్నారంటూ గొప్పలు చెప్పడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద మూడు పంప్‌హౌస్‌లను నిర్మించి, వరద కాలువను కాళేశ్వరం జలాలతో సజీవంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలను తాము సూటిగా ప్రశ్నిస్తున్నామని, ఇప్పుడు నంది, గాయత్రీ, రాంపూర్ పంప్‌హౌస్‌ల్లో ఎత్తిపోస్తున్న జలాలు ఎక్కడివో చెప్పాలని ప్రశ్నించారు.