‘జీవితకాలం ఆర్టీసీకి సేవలు చేస్తే.. చివరికి రోడ్డున పడేస్తరా? ఇదెక్కడి న్యాయం? ఎందుకిలా క్షోభ పెడుతున్నరు?’ అంటూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆక్రోశం వెళ్లగక్కారు. రిటైర్మెంట్, ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది మంగళవారం హైదరాబాద్ బస్‌భవన్‌ను ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో : ‘మేము బతికుండగానే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. జీవితకాలం ఆర్టీసీకి సేవలు చేస్తే.. చివరికి రోడ్డున పడేస్తరా? ఇదెక్కడి న్యాయం? ఎందుకిలా మమ్మల్ని మానసిక క్షోభ పెడుతున్నారు?’ అంటూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆక్రోశం వెళ్లగక్కారు. తమకు రావాల్సిన రిటైర్మెంట్, ఇతర బెనిఫిట్స్ ఇప్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్ బస్‌భవన్‌కు తరలివచ్చారు. 2017, 2021 పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ.2 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన పోస్టర్లను బస్‌భవన్ ఎదుట ప్రదర్శించారు. రాష్ట్రంలోని అన్నిడిపోల నుంచి సుమారు 15వేల మంది తరలిరావడంతో బస్‌భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. వీరిని నిలువరించడానికి పోలీసులు భారీగా మోహరించారు.
రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డుగా వేశారు. వారిని రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డుగా వేశారు. జిల్లా డిపోల వారీగా తరలొచ్చిన కార్మికులు రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. 41,495 మందికి బెన్ఫిట్స్ అందలేదని వాపోయారు. ఈ సందర్భంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బెనిఫిట్స్ ఇవ్వకుండా, తమతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్టీసీ ఈడీ వెంకన్నకు అందజేశారు. అంతకు ముందు ధర్నానుద్దేశించి ‘టీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్’ అధ్యక్షుడు రాజయ్య, చైర్మన్ రెహమాన్ సూఫీ, వర్కింగ్ ప్రెసెడింట్ ఎస్ ఆనందం, రాష్ట్ర కార్యదర్శి బుచ్చిరెడ్డి మాట్లాడారు. 2013 పీఆర్సీ ఏరియర్స్‌పై యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తక్షణమే పీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు పంపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2017 పీఆర్సీ బకాయిలు నిలిచిపోయి 9 ఏండ్లు అవుతున్నా.. యాజమాన్యానికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. 2021 పీఆర్సీ అమలుచేసి, రావాల్సిన ఏరియర్స్‌ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రిటైర్డ్ ఉద్యోగులకు, వారి భాగస్వాములకు సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కూడా ఉచితంగా ప్రయాణ అనుమతి ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) తీసుకొన్న ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఇచ్చే దహన సంసారాల సహాయాన్ని రూ.30 వేలకు పెంచాలని కోరారు. అనారోగ్య కారణాల వల్ల ఎస్ఆర్బీఎస్ లైఫ్ సర్టిఫికెట్ ఏటా ఇవ్వకుండా మూడేండ్లు దాటిన వారికి ఈ నెల నుంచి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాల నుంచి తార్నాక దవాఖానకు చికిత్స నిమిత్తం హైదరాబాద్ వచ్చే విశ్రాంత ఉద్యోగులకు సీబీఎస్ లేదా జేబీఎస్‌లోని రెస్ట్ రూములలో కనీసం 4 బెడ్లు కేటాయించాలని కోరారు. గతంలో తార్నాక దవాఖాన మెంబర్షిప్ తీసుకోని రిటైర్డ్ ఉద్యోగులకు మరొకసారి మెంబర్షిప్ కోసం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నేత శ్రీనివాస్ మాట్లాడుతూ ఫుట్‌బాల్ ఆట కోసం సీఎం రేవంత్‌రెడ్డి వంద కోట్లు ఖర్చు చేశారని.. దాని వల్ల ఒనగూరిందేమిటో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.
తార్నాక దవాఖానలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి భాగస్వాములకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్టు రెండు నెలలకు సరిపడా మందులు ఇవ్వాలన్న ఆందోళనకారుల డిమాండ్‌కు ఆర్టీసీ యాజమాన్యం దిగొచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత.. ఆర్టీసీలో నిబంధనలు మారడం, ప్రస్తుతం ఒక నెలకే మందులు ఇస్తుండటం వల్ల జిల్లాల నుంచి వచ్చే రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అన్ని జిల్లాల దవాఖానల్లో అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాలని, అన్ని మందులూ రెండు నెలలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వేలాదిగా తరలివచ్చి చేసిన డిమాండ్‌తో యాజమాన్యం స్పందించింది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, వారి భాగస్వాములకు రెండు నెలలకు సరిపడా మందులివ్వాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని డిస్పెన్సరీల్లోనూ సరిపడా మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నది. అందుకు తగిన విధంగా సరఫరా ఉండాలని పేర్కొన్నది. దీంతో తమ ఆందోళనల్లో ఒక డిమాండ్ పరిష్కారమైందని రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి వేలాదిగా రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు యూనియన్లకు అతీతంగా వస్తున్నారనే ముందస్తు సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులను రంగంలోకి దించి పలుచోట్ల ముందస్తు అరెస్టు చేయిచింది. అయినా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున చేరుకోవడం విశేషం. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీఎల్ఎన్ రావు, రాష్ట్ర నాయకులు కేఎన్రెడ్డి, ఎండీ ఖదీర్, సిద్ధిఖీ, సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మేం చస్తున్నాం.. మా కష్టాన్ని దోచుకోవద్దు.. అని వేడుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడమే లేదు. కనీసం మానవీయత ప్రదర్శించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి మా సమస్యలను పరిష్కరించకుండా మొదటి నుంచీ మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికైనా ఆయన మౌనం వీడాలి. వయోభారంతో బాధపడుతున్న మాకు ఇంత దూరం ప్రయాణించాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఆర్టీసీ ఎండీకి అనేకసార్లు వినతిపత్రాలు అందించాం. ఏమాత్రం ఫలితం దక్కలేదు. ఇప్పటికే మాలో చాలా మంది చనిపోయారు. ఇప్పటికైనా మా బకాయిలు చెల్లించి మమ్మల్ని ఆదుకోండి. – నరసయ్య, రిటైర్డ్ ఉద్యోగి
ప్రభుత్వం బెన్ఫిట్స్ ఇస్తే ఇల్లు కట్టుకుందామని కలలుగన్నా. కానీ నేను బతికుండగా అది నెరవేరేలా లేదు. మాలాంటి ఉద్యోగుల బతుకులు ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు బస్‌భవన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నాం. సర్కార్‌కు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. 2023లో రిటైరయ్యాను. ఇప్పటివరకు బెన్ఫిట్స్ అందలేదు. 2017 నుంచి ఏరియర్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబం రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కొత్తలో ప్రభుత్వంపై మాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అది లేకుండా లేదు. అనేక అనారోగ్య సమస్యలతో మేమంతా బాధపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచో హైదరాబాద్‌కు చేరుకొని మా కష్టాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. బతికుండగానే మా కుటుంబాలకు జీవితాంతం చేసిన కష్టఫలం అందించాలని అందరం ఆశపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా బెనిఫిట్స్ అందజేయాలి.