హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం పరిధిలోని భూసేకరణ ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర అవకతవకలపై, అర్హులైన రైతులకు సరైన నష్టపరిహారం అందడం లేదన్న అంశంపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. గతంలో చేపట్టిన సర్వే అశాస్త్రీయంగా ఉన్నదని, అసలైన భూనిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని లోకాయుక్తలో దాఖలైన పిటిషన్‌తో అధికార యంత్రాంగం కదిలింది.
అసలైన రైతులను గుర్తిస్తూ క్షేత్రస్థాయిలో రీసర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సరికొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో సుమారు 1,000 మంది బాధిత రైతులకు భారీ ఊరట లభించినట్టయింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న అసలైన అన్నదాతలకు పరిహారం దకకుండా పకదారి పడుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, నాయకులు ఎస్ రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి లోకాయుక్తను ఆశ్రయించారు. బాధిత రైతుల పక్షాన నిలబడి వారి భూహకులను, న్యాయమైన నష్టపరిహారాన్ని కాపాడటమే ధ్యేయంగా వారు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు గురువారం లోకాయుక్త బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున సీనియర్ న్యాయవాది జకుల లక్ష్మణ్ బలమైన వాదనలు వినిపించారు.
బాధితుల తరఫున తాము లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేసి, ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీచేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జరిగిన తప్పిదాలను సవరిస్తూ, అసలైన భూ యజమానులను గుర్తించేందుకు రీసర్వే కోసం ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ ఇచ్చి క్షేత్రస్థాయిలో ప్రక్రియను ప్రారంభించిందని నివేదించారు. భూసేకరణ ప్రక్రియను తాము నిశితంగా పరిశీలిస్తామని, రీసర్వేలోనూ ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ రైతుల పక్షాన లోకాయుక్తను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు పునరుద్ఘాటించారు.
ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో గానీ, భూసేకరణ, పరిహారాల పంపిణీ ప్రక్రియలో గానీ ఏమైనా అవకతవకలు లేదా అన్యాయం జరిగినట్టు తేలితే.. బాధితులు ఎలాంటి సంకోచం లేకుండా మళ్లీ లోకాయుక్తను ఆశ్రయించవచ్చని లోకాయుక్త భరోసా ఇచ్చారు. పిటిషన్‌లోని ప్రాథమిక లక్ష్యం నెరవేరినందున ఉపసంహరణకు అనుమతించాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జకుల లక్ష్మణ్ బెంచ్‌ను కోరారు. రీసర్వే, అనంతర ప్రక్రియలో రైతుల హకులకు భంగం వాటిల్లకూడదని పేరొంటూ పిటిషన్ ఉపసంహరణకు లోకాయుక్త చైర్మన్ అనుమతి ఇచ్చారు.
లగచర్ల ఫార్మా రైతుల పోరాటం తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ బాధితుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ మరోసారి నిలబడి విజయం సాధించిందని జక్కుల లక్ష్మణ్ తెలిపారు. ఈ పిటిషన్ ద్వారా కొడంగల్ ప్రాజెక్టు పరిధిలోని సుమారు 1,000 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని వివరించారు. విచారణ ముగిసిన అనంతరం లోకాయుక్త కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ, న్యాయస్థానాలు, లోకాయుక్త ద్వారా ఒత్తిడి తీసుకురావడంతోనే వెనకి తగ్గి రీసర్వేకు ఆదేశించిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక రైతుకూ చట్టబద్ధమైన నష్టపరిహారం అందే వరకు తాము పోరాడుతామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు కిరణ్, అలీ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.