కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 4: ఆటో డ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మంగళవారం కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జిల్లాకేంద్రానికి తరలివచ్చారు. ఆటో కార్మిక సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి ర్యాలీగా వచ్చి, కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భిక్షాటన చేశారు.
ఆటో డ్రైవర్ల పొట్టగొడుతున్న రాపిడో, ఊబర్ వంటి కార్పొరేట్ కంపెనీల సేవలను నిలివేయాలని, ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకువస్తామనే ఆలోచనను విరమించుకోవాలని, సిటీ బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం రాకముందు ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.వెయ్యి కిరాయి దొరికేదని, ప్రస్తుతం రూ.400 కూడా రావడం లేదని వాపోయారు. ఆటో కిస్తీలు, ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు కట్టలేక ఈ రెండున్నరేండ్ల కాలంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఆత్యహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.12వేలు చెల్లించాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలని, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు వారి పిల్లల చదువుల ఖర్చును భరించాలని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉపాధి కల్పించాని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే కరీంనగర్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం, హైదరాబాద్‌లోని అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు శ్రీనివాస్, మహేశ్, రాజు, మధుబాబు, యూకుబ్, ఎల్లయ్య పాల్గొన్నారు.