కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 10: పేట్ బషీరాబాద్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఒక స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. క్షణాల్లోనే గోదాము నలుమూలలా అగ్నికీలలు విస్తరించాయి. దాంతో, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాల (ఫైర్ ఇంజిన్ల) సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడం, ప్రాణనష్టం జరగకపోడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
దూలపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఒక స్క్రాప్ గోదాములో గురువారం రాత్రి ఒక మూలన మంటలు మొదలయ్యాయి. అక్కడ పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన ప్లాస్టిక్, ఇనుము, ఇతర వ్యర్థ పదార్థాలకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాల (ఫైర్ ఇంజిన్ల) సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో గోదాములో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అనేవి తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.