Army Weapons Missing case : సికింద్రాబాద్లో ఆగస్టు 30న మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నారంటూ పత్రికల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను భారత ఆర్మీ ఖండించింది. అధికారుల అరెస్ట్ వార్తలు నమ్మొద్దని, విచారణ కొనసాగుతోందని గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది సైన్యం.
మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు అర్మీ అధికారుల అరెస్ట్ వార్తలు పూర్తిగా అవాస్తవం అని భారత సైన్యం తెలిపింది. ‘ఆయుధాల చోరీకి సంబంధించి విచారణ జరుగుతోంది. కానీ, ముగ్గురు అదికారులను అరెస్ట్ చేశారనేది నిజం కాదు. ఇది పూర్తిగా ధ్రువీకరించని విషయం. ప్రస్తుతం ఈ కేసుపై సంబంధిత అధికారులు సంయుక్త విచారణ చేస్తున్నారు. అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించిన వార్తలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. బాధ్యతాయుతమైన, సత్యపూరిత వార్తలను ప్రచురిచడంలో మీడియా పాత్రను మేము గౌరవిస్తాం. ఈ కేసు విషయంలో మీ సహకారంతో పాటు వాస్తవాలను వక్రీకరించకుండా రాయాలని కోరుతున్నాం’ అని భారత సైన్యం విజ్ఞప్తి చేసింది.