హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గర్లోనే ఉన్నది.. ఖబడ్దార్!’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేడిగడ్డ బరాజ్‌పై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బరాజ్‌ను కూల్చే కుతంత్రాలకు తెరతీశారా? అని నిలదీశారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బరాజ్ కిందే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బరాజ్ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్‌ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నారం బరాజ్ కింద భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తవ్వుతున్న ఫొటోను ఎక్స్‌వేదికగా సోమవారం పోస్టుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.
ఏకంగా బరాజ్‌ను బలహీనపరిచి బీఆర్ఎస్పై బురదజల్లేందుకు చేస్తున్న పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించబోరని హెచ్చరించారు. నిబంధనలు తుంగలో తొకి అన్నారం బరాజ్ పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బరాజ్‌ను రేవంత్ సరార్ ప్రమాదంలోకి నెడుతున్నదని మండిపడ్డారు. ఇది కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే అని విమర్శించారు.
పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బరాజ్‌ను నుంచి కాంగ్రెస్ నాయకుల మాఫియా ఇసుకను తోడేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతున్నదో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. కాళేశ్వరం బరాజ్‌లకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన సూత్రాలు’ అని తూర్పారబట్టారు.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్ వేదికగా సోమవారం వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ పోస్టు ప్రాధాన్యం సంతరించుకున్నది. ‘హలో రాహుల్‌గాంధీ.. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి ఏటీఎంగా మారిన తెలంగాణకు స్వాగతం)’ అంటూ వెల్కమ్ చెప్పారు. ‘మీరిప్పుడు సీఎం దగ్గర రూ.1,000 కోట్లు వసూలు చేసుకోవడానికి వచ్చారా?’ అని ఎద్దేవాచేశారు. ‘పనిలోపనిగా మీరు 100 రోజుల్లో అమలుచేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలు, 420 ఇతర హామీల పురోగతిని సమీక్షించడంపై కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి’ అని హితవుపలికారు.