సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Feb 17, 2021 , 02:22:59

దీనబాంధవుడు

దీనబాంధవుడు

 • అనేక సంక్షేమ పథకాలతో ఆపన్నులకు అండ
 • అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడు
 • అడుగకున్నా వరాలిచ్చే దేవుడు
 • జనం గుండెల్లో నిలిచిన కేసీఆర్‌ 
 • నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు
 • ఆయన మేలు 
 • ఎన్నటికీ మరువమంటున్న లబ్ధిదారులు

వృద్ధులకు ఆయన ‘ఆసరా’ అయిండు.. దివ్యాంగులకు ఊతమైండు.. పేదింటి యువతులకు మేనమామైండు.ఒంటరి ఆడబిడ్డలకు అండగా ఉన్నడు. మసక జీవితాలకు ‘వెలుగులు’ పంచిండు. మనిషిని పోగొట్టుకున్నోళ్లకు ఇంటి పెద్దదిక్కయిండు. అడుగకుండానే వరాలిచ్చే దేవుడైండు.. అనేక సంక్షేమ పథకాలతో ఎంతో మంది బతుకులకు భరోసా కల్పిస్తున్నడు.  నేడు జననేత.. దీన బాంధవుడు.. ప్రజా పాలకుడు.. రైతు పక్షపాతి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఆయన వల్ల మేలు పొందిన అనేకులు కృతజ్ఞతలు తెలుపుతున్నరు.  

 • నా బిడ్డల పెండ్లి చేసింది కేసీఆరే..
 • చినమడూరుకు 
 • చెందిన మేడ చిన 
 • లక్ష్మి-అంజయ్య దంపతులు

దేవరుప్పుల, ఫిబ్రవరి 16 : మాది జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరు. మాకు భూమి లేదు ఇల్లు జాగలేదు. ఓ గుడిసెలనే ఉంటున్నం. ముగ్గురు ఆడపిల్లలే. వారి పెండ్లి చేసుడు మాకు తలకు మించిన భారమే. ఇగ కాన్పులు, పెట్టుపోతలు మానుంచి కాని పని. మా అదృష్టం కొద్దీ కేసీఆర్‌ పెద్ద దిక్కు లెక్క దొరికిండు. ఇద్దరు బిడ్డలు కల్పన, అశ్విని పెండ్లిండ్లు కల్యాణలక్ష్మి పథకంతోనే చేసినం. కడుపుతోటి ఉన్న బిడ్డలను పరీక్షల కోసం సర్కారు ఆంబులెన్స్‌లనే ఉచితంగ జనగామ దవాఖానకు తీసుకుపోయిండ్రు. బిడ్డల మొదటి కాన్పు అక్కడి మాతాశిశు దవాఖానల ఫ్రీగా చేసిండ్రు. అక్కడ్నే కేసీఆర్‌ కిట్లు, పైసలు చేతులవెట్టిన్రు. కేసీఆర్‌ మాకు చేసిన సాయాన్ని ఈ జన్మల మరువం. ఇంకో బిడ్డ పెండ్లి కున్నది. కల్యాణలక్ష్మితోనే చేస్తం.

 • అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడు.. అడుగకున్నా వరాలిచ్చే దేవుడు
 • జనం గుండెల్లో నిలిచిన కేసీఆర్‌ 
 • నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు
 • ఆయన మేలు ఎన్నటికీ మరువమంటున్న లబ్ధిదారులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజావసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తూ ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అమలు చేస్తున్నారు. కొన్నింటిని ప్రజలు అడుగకున్నా తనకు తానుగా గుర్తించి సరికొత్త పథకాలు రూపొందించి ఆచరణలో పెడుతున్నారు. ఎంతో మంది అభాగ్యులకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తూ జనం గుండెల్లో నిలిచిపోతున్నారు. పేదింటి తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కావద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, వృద్ధులు తమ పిల్లలపై  ఆధారపడకుండా ఆసరా పింఛన్లు, చూపు సమస్యలు తొలగించేందుకు కంటి వెలుగు, అన్నదాతలు, వారి కుటుంబాల కోసం రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో అనేక మందికి వెన్నుదన్నుగా నిలిచారు. వాటి ద్వారా లబ్ధిపొందిన వారు సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్‌ చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నరు. 

కూలీ నుంచి రైతునయ్యా..

గొడిశాల ఎల్లమ్మ, దంతాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లా

మహబూబాబాద్‌, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : మాది మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రం. నేను ఒకప్పుడు కూలీ పనులు చేసేది. నాకు ఇద్దరు బిడ్డలు స్వరూప, గీత, ఒక కొడుకు కృష్ణయ్య. మా ఆయన పేరు వెంకటయ్య, సరింగ నడువరాదు.. ఇంటికాన్నే ఉంటడు. కూలీ పని చేసుకుంటేనే పూట గడిచేది. ఇగ ఎట్ల బతుకుడని అనుకున్నం. ఇంతలన్నే కేసీఆర్‌ సర్కార్‌ దళితులకు మూడెరాల భూమి ఇత్తాందని తెల్సింది. ఓసారి కలెక్టర్‌ మేడమ్‌ ప్రీతిమీనా దంతాలపల్లికి వచ్చిందని నేను, నా కొడుకు పోయి కలిశినం. అక్కడ మా ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ కూడా ఉన్నడు. మా పరిస్థితి కలెక్టర్‌కు చెప్పుకున్నంక కొద్దిరోజుల్లనే జాగ వచ్చింది. అప్పటికే నాకిచ్చిన భూ మిల 50 మామిడి చెట్లు ఉన్నయ్‌. 2017, 2018ల రెండేళ్లు బాగా కాశినయ్‌. వాటికి రూ.లక్షన్నర వచ్చినయ్‌. పొలం, సగం చెలక పెట్టు ట్ల యాసంగి, వానకాలంల ఆరు పుట్ల వడ్లు పండినయ్‌. నాడు భూమిలేక కూలీ పనికి పోయేదాన్ని.. కేసీఆర్‌ భూమి ఇచ్చుట్ల నా పొలంల నేనే రైతు ను. ప్రభుత్వం భూమి ఇయ్యకముందే పెద్ద బిడ్డ పెళ్లి చేశిన. భూమి ఇచ్చినంక పంటకు వచ్చిన లాభంతోటి చిన్న బిడ్డ, కొడుకు పెళ్లిళ్లు చేశిన. ఇప్పుడు మా ఆయనకు వికలాంగుల పింఛన్‌ కూడా వత్తాంది. ఎన్ని జన్మలెత్తినా సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేను.

ఎల్లయ్యకు క(ఇ)కంటివెలుగు

వరంగల్‌ రూరల్‌, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ఆయన పేరు ఉండ్రాతి ఎల్లయ్య, ఊరు వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రం. వృత్తి గంపలు అల్లడం. వయసు ఎనభై పైనే. జీవిత భాగస్వామి 30 ఏండ్ల క్రితం కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు ఆరేండ్ల క్రితం అర్ధాయుష్షుతో కాలం చేశాడు. పుట్టి పెరిగిన ఊళ్లో గుంట భూమి కూడా లేని ఎల్లయ్య కుల వృత్తినే నమ్ముకున్నాడు. చాటలు, గంపలు, గుల్లలు అల్లి వాటిని అమ్ముకుంటున్నాడు. కుటుంబ భారం ఎల్లయ్యతో పాటు కోడలు ఎల్లమ్మపై ప డింది. ఈ క్రమంలో ఆరుగురు ఆడబిడ్డల చదువులు, వివాహాల కోసం ఎల్లమ్మ హన్మకొండలోని తన పుట్టింటి వద్ద ఉండి కూలి పనిచేస్తుంది. ఎనభై ఏండ్ల వయస్సులో ఉన్న ఎల్లయ్య ఒక్కడే రా యపర్తిలో ఉంటున్నాడు. అతనికి ఇక్కడ ఆస్తిపాస్తులేమీ లేవు. గ తంలో ఊరి చివరన చిన్న గుడిసె వేసుకుని కులవృత్తి చేసుకుం టూ అర్ధాకలిలో బతికేవాడు. సరిగ్గా ఏడేండ్ల క్రితం కొలువుదీరిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అతని కండ్లలో వెలుగునింపింది. ఎల్లయ్య కు రేషన్‌కార్డు వచ్చింది. ఆసరా పథకంతో నెలనెలా రూ.2,016 పింఛన్‌ వస్తోంది. ఊళ్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లిచ్చింది. కండ్లు సరిగా కనపడక అతను బాధపడుతున్న సమయంలో ఊళ్లో కంటివెలుగు ద్వారా శిబిరం నిర్వహించింది. వైద్యులు ఎల్లయ్యకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. అద్దాలు పెట్టుకుని ఇంటి పని, కుల వృత్తి జోర్దార్‌గా చేసుకుంటున్నడు. కేసీఆర్‌ సారు ఎక్కడున్నడో గాని మా సక్కని సారు. ఒంటరినైన తా ను కాటికి కాలు జాపిన వయస్సులో ‘కన్న కొడుకోలె నన్ను ఆదరిస్తున్నడు. బొందిల పాణమున్నంత వరకు కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటా’నంటున్నడు.  

కేసీఆర్‌ మా ఇంటి దేవుడు 

మాది రాయపర్తి మండలం మైలారంలోని ఎస్సీకాలనీ. నాకు భార్య సోమలక్ష్మి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నరు. ఊళ్లో నాకు గుంట భూమి, ఇల్లు జాగ కూడా లేదు. పదహారేండ్ల నుంచి ఆటో నడుపుకుంట కుటుంబాన్ని పోషించుకుంటున్న. నా పెద్ద కొడుకు నాగరాజు చెవిటి, మూగ, అవిటి వాడు. ఇంట్ల శాన ఇబ్బందులుండె. కేసీఆర్‌ సారు ముఖ్యమంత్రి అయినంక నా పెద్ద కొడుక్కు రూ.3వేల దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేసిండు. కిరాయి ఇండ్లల్ల ఉన్న మాకు ఊర్లెనే ఉచితంగ డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టిచ్చిండు. కంటి వెలుగుల ఫ్రీగా మందులు, అద్దాలు ఇచ్చిండ్లు. ఇప్పుడు రంది లేకుంట బతుకుతున్న.

- లింగాల కొమురయ్య, ఆటోడ్రైవర్‌, మైలారం

నెరవేరిన శ్రీకాంతాచారి కలలు

దేవరుప్పుల, ఫిబ్రవరి 16 : తెలంగాణ మలి ఉద్యమంలో ఆత్మార్పణం చేసుకున్న జనగామ జిల్లా గొల్లపల్లికి చెందిన కాసోజు శ్రీకాంతాచారి కలలను ప్రత్యేక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజం చేసి చూపారు. అతడి కుటుంబానికి అండగా నిలిచి భరోరా ఇచ్చారు. తెలంగాణ వస్తేనే నీళ్లు, నిధులు, వనరులు, నియామకాలు వస్తాయని కలలుగని అవి కళ్లారా చూడకుండానే అమరుడైన శ్రీకాంతాచారి కలలు ఒక్కటొక్కటిగా సాకారమయ్యాయి. దేవరుప్పుల మండలంలో వట్టి పోయిన వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణంతో జీవ నదిని తలపిస్తున్నది. దేవాదుల నీటితో చెరువులన్నీ నిండినయ్‌. నీరు లేక బీళ్లుగా మారిన భూములు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నయ్‌. శ్రీకాంతాచారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 10లక్షల ఆర్థిక సాయం చేసి ఊరట కలిగించింది. అతడి తమ్ముడు రవీంద్రాచారికి రెవెన్యూ శాఖలో ఉద్యోగం కలిపించింది. స్వగ్రామం గొల్లపల్లిలో శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటు చేసింది. గ్రామంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూంలకు శ్రీకాంతాచారి పేరు పెట్టింది.  

కేసీఆర్‌ చేయూత మరువలేనిది

అన్న మరణం మా కుటుంబానికి తీరని లోటైనా కేసీఆర్‌ అన్న రూపంలో ఆదుకున్నరు. ఆర్థికసాయం అందించి నాకు ఉద్యోగం ఇప్పిం చడంతో మా కుటుంబం నిలదొక్కుకున్నది. నేను మోత్కూరు తహసీల్దార్‌ కార్యాలయంలో జూని యర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న.  

- కాసోజు రవీంద్రాచారి

ఆయన దయవల్లే కొలువొచ్చింది..

పాలకుర్తి రూరల్‌, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ సల్లంగ బతకాలె.. ఆయన దయతోటే మాలాంటి అమరవీరుల కుటుంబాలు ఇయ్యాల ధైర్యంగ బతుకుతున్నయ్‌. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ దీక్షను భగ్నం చేసిన్రని నా భర్త ఆంజనేయులు 2009, డిసెంబర్‌ 5న  కరెంట్‌ షాక్‌ వెట్టుకొని బలిదానమైండు. నన్ను ఆగం చేసిపోయిండు. ఇగ నాకు బతుకెట్ల అని బాధపడ్డ. తెలంగాణ కోసం పానం ఇచ్చినోళ్లను ఆదుకుంటనని కేసీఆర్‌ మాటిచ్చిండు. మాట ప్రకారం నా అసొంటోళ్లకు కొలువులిచ్చిండు. నాకు 2016 జూన్‌ 9న జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటెండర్‌ ఉద్యోగం వచ్చింది. కొలువు వచ్చినంక నేను మా పిల్లలు సంతోషంగ బతుకుతున్నం. సీఎం కేసీఆర్‌కు మా అమరవీరుల కుటుంబాల దీవెనలు ఎప్పటికీ ఉంటయ్‌.

33వ జిల్లాగా ములుగు  జన్మదిన కానుకగా ఇచ్చిన సీఎం కేసీఆర్‌ 

ములుగు, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన తెలంగాణ వలె జిల్లాలు ఏర్పడకముందు వెనుకబడిన ములుగు ఏజెన్సీ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ ఇక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకొని తన జన్మదిన కానుకగా రాష్ట్రంలో 33వ జిల్లాగా ఏర్పాటు  చేశారు. ములుగు జిల్లా ఆవిర్భవించి నేటితో రెండేళ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్‌ జిల్లాకు దారిచూపిన బాటసారిగా చరిత్రలో నిలిచిపోయిన రోజు ఫిబ్రవరి 17. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2వసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2018 ప్రజా ఆశీర్వాద సభ సాక్షిగా ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చెప్పి 2019 ఫిబ్రవరి 17న 9మండలాలతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే కలెక్టర్‌, ఎస్పీలను నియమించి తాత్కాలిక కార్యాలయాలను నెలకొల్పారు. రెండేళ్లుగా ములుగు జిల్లా పలు రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ వస్తున్నది. 

సమ్మయ్యా.. బాగున్నవా..!

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 16 : ‘సమ్మయ్యా.. బాగున్నవా’ అంటూ కేసీఆర్‌ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఓ కార్యకర్తను ఆప్యాయంగా పలకరిస్తారు. భూపాలపల్లి పట్టణంలోని జంగేడుకు చెందిన జోగుల సమ్మయ్య టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఈక్రమంలో జోగుల సమ్మయ్యతో కేసీఆర్‌కు చాలా సాన్నిహిత్యం ఉంది. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ పెట్టే ప్రతి సభలో జోగుల పాల్గొనేవారు. ముఖ్యంగా భూపాలపల్లిలో విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు డిమాండ్‌తో భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు సభ ఏర్పాటు చేయాలని తలచి ముందురోజే సమ్మయ్యకు ఫోన్‌ చేసి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేవారు. భూపాలపల్లిలో సమస్యలు, సింగరేణి సమస్యలను ముందు రోజే ఆయనను అడిగి తెలుసుకునేవారు. సమ్మయ్యతో ఉన్న పరిచయంతోనే 2001లో కేసీఆర్‌ సమ్మయ్య సతీమణి సరోజనకు జడ్పీటీసీ టిక్కెట్‌ ఇవ్వగా భారీ మెజార్టీతో గెలిచారు. జడ్పీటీసీ గా కొనసాగినప్పుడు కేసీఆర్‌ రెండు సార్లు భూపాలపల్లిలో పర్యటించారు.

అలా పిలవడం నా అదృష్టం.. సమ్మయ్య

టీఆర్‌ఎస్‌ స్థాపన నుంచి రాష్ట్ర సాధన కోసం పార్టీలో కార్యకర్తగా ఉన్న. భూపాలపల్లికి వచ్చిన ప్రతిసారీ సమ్మయ్యా అని పేరు పెట్టి కేసీఆర్‌ ఆప్యాయంగా పిలిచేవారు. హైదరాబాద్‌కు పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడేవారు. ఒకసారి అసెంబ్లీకి వెళ్లినప్పుడు కూడా కేసీఆర్‌ నన్ను దూరం నుంచి చూసి సమ్మయ్యా బాగున్నవా అని పలకరించారు. అది ఎప్పటికీ మర్చిపోలేను.


VIDEOS

logo