హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్’ అన్న పదమే సంచలనం. ఆయన మాటే చెరపలేని శాసనం. ఆయన ఇంటర్వ్యూ అంటే.. రికార్డుల మోతే. మంగళవారం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తన రికార్డును తానే బద్ధలు కొట్టారు. 2012లో నాన్‌స్టాప్‌గా టీవీ9 రజనీకాంత్‌కే 3.30 గంటలపాటు ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్.. పుష్కరకాలం తర్వాత మంగళవారం 4 గంటలపాటు ఏకధాటిగా అదే టీవీ9 రజనీకాంత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 4 గంటలపాటు సాగిన ఈ ఇంటర్వ్యూకు సుమారు 95 వేలకు పైగా నాన్‌స్టాప్ లైవ్ వ్యూస్ రావడం తెలుగు మీడియా రంగంలోనే రికార్డుగా నిపుణులు తేల్చి చెప్పారు. ఈవెంట్స్ మినహా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఈ స్థాయిలో భారీ లైవ్ వ్యూస్ రావడం రికార్డుగా అభివర్ణిస్తున్నారు.
గ్రామాలు మొదలు, పట్టణాలు, మెట్రో సిటీల వరకూ లక్షలాది మంది జనం టీవీలకు అతుక్కుపోయారు. ఐపీఎల్ మ్యాచ్‌ను బంద్ పెట్టి మరీ కేసీఆర్ డిబేట్‌నే ఆసక్తిగా తిలకించారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తమ నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ డిబేట్‌ను ఆసక్తిగా విన్నారు. ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్తున్న ఒక్కొక్క డైలాగ్‌కు ఆయన అభిమానులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. చిన్నారులు మొదలు వృద్ధుల వరకూ టీవీలకు, మొబైల్లో యూట్యూబ్‌కు అతుక్కుపోయారు. 95కే వ్యూస్‌కు తోడు వేలాది మంది లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు. మనదేశంలో మరే నాయకుడికి లేనంత క్రేజ్‌ను ఈ విధంగా కేసీఆర్ సొంతం చేసుకున్నారు. ఇరిగేషన్, విద్యుత్తు, ఆర్థిక, తాగునీటి తదితర రంగాలపై ఆయన చెప్పిన విశ్లేషణలను చెవులు రిక్కరించి మరీ విన్నారు.
కేసీఆర్ మారథాన్ ఇంటర్వ్యూను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మాస్టర్ క్లాస్’గా అభివర్ణించారు. ‘ఇది కేసీఆర్ మాస్టర్ క్లాస్. ఫాం తాత్కాలికం క్లాస్ శాశ్వతం అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.