Vasthu Shastra | ఇంటి శంకుస్థాపన కోడలితో చేయించాలా, కూతురితో చేయించాలా?
– బి. ధర్మారావు, మియాపూర్
ఇంటి నిర్మాణం కోసం పురోహితులు ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దానికి ముందే.. ఎవరి పేరుమీద కట్టాలి అనే ప్రశ్న వస్తుంది. ఇంటి యజమాని – యజమానురాలు ఈ ఇద్దరి పేరుమీద పంచాంగం చూసి,ముహూర్తకాలాన్ని నిర్ణయిస్తారు. ఆయా వ్యక్తులు, వారి పేర్లమీద ముహూర్త బలం లేనప్పుడు.. మిగతా కుటుంబ సభ్యుల పేరు మీద ముహూర్తం నిర్ణయమవుతుంది. ఇంటి కోడలు కూడా కుటుంబ సభ్యురాలే, యజమానురాలే. కాబట్టి, కొడుకు పేరు మీద కుదరకపోతే.. ఆమె పేరు మీదే తప్పక చేయించండి. కోడలి పేరుతో చేయకూడదు అనే నియమం ఎక్కడా లేదు. కాకపోతే, బిడ్డతో మాత్రం చేయించరు. ఎందుకంటే, ఆమె మరొక ఇంటి మహాలక్ష్మి. కోడలితో చేయిస్తే ఎలాంటి దోషం లేదు. ఎవరు చేసినా, పూజలో మాత్రం అందరూ పాల్గొనాలి.
స్థలం ఆకారానికి – వాస్తుకు సంబంధం ఉన్నదా?
– జి. అమృత, బుద్వేల్
ఎంతో పెద్ద సంబంధం ఉన్నది. చాలామందికి అర్థం కానిది ఇదే! స్థలం రూపం – దాని బౌండరీల విధానం (హద్దులు), మూలలు పెరిగి ఉండటం, త్రికోణం, చేట, మద్దెల, విసన కర్ర.. ఇలా అనేక ఆకారాలతో స్థలాలు ఉంటాయి. ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొన్ని స్థలాలు సరిచేస్తే సరిగ్గా అవుతాయి. సరిచేయడానికి వీలు కానివి కూడా ఉంటాయి. ఇల్లు కట్టుకోగలిగినంత స్థలం వచ్చేలా, సరైన దిశకు సింహద్వారం పెట్టగలిగే అవకాశం ఉంటే.. అందుకు తగిన విధంగా శాస్త్రం తెలిసిన వారిచేత స్థలాన్ని సరిచేసుకోవాలి. అంటే.. దీర్ఘచతురస్రం లేదా చతురస్రంగా స్థలాన్ని సరిచేసి, అందులో గృహాన్ని నిర్మించుకోవాలి. ఇవ్వాళ చాలా ఇండ్లు కొత్తకొత్త పోకడలతో కడుతున్నారు. స్థలాలు బాగుండటం లేదు. వాళ్ల జీవితాలూ అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
గృహ ముహూర్తం నిర్ణయించినప్పుడు.. ఆ సమయం ఎంత ఉంటుంది? అప్పుడు పూజ చేయాలా? ఇంటి లోపలికి వెళ్లాలా?
– ఆనందమూర్తి, కొలనుపాక
పెద్దలు ముహూర్తం నిర్ణయించారంటే.. అది రెండు ఘడియల కాలం. అంటే.. నలభై ఎనిమిది నిమిషాల వరకూ ఉంటుంది. రాత్రిని బట్టి, దినం – కాలాన్ని బట్టి కొంత తేడా ఉండవచ్చు. అయినా దాదాపుగా సమయం అంతే ఉంటుంది.. కొన్ని నిమిషాల వ్యత్యాసంతో. ఈ ముహూరాన్ని బట్టి ఆ సమయంలో ఇష్టదైవం ప్రతిమ (ఫొటో)తో గృహంలోకి వెళ్లడం ముఖ్యం. ఆ సమయం మించిపోయాక అడుగుపెట్టడం మంచిది కాదు. సరిగ్గా ఆ వేళకు ఇంట్లోకి ప్రదేశించి, మిగతా సమయం పూజా కార్యక్రమం జరుపుకోవచ్చు. సమయమే మనిషి మనుగడను నిర్ణయిస్తుంది. కాలంతో పుట్టి.. కాలంతో కదిలిపోయే జీవితాలు మనవి. కాబట్టి ముహూర్తాన్ని తప్పక పాటించాలి. అప్పుడే కాలం మహోన్నత ఉపకారం చేస్తుంది మనకు.
3 Doves
ఇంట్లో పావురాలు, ఇతర పక్షులను పెంచు కోవచ్చా? శాస్త్రం ఏం చెబుతున్నది?
– కృష్ణకుమారి, సైదాబాద్
నేడు మనిషి అనేక అవస్థలు పడుతున్నాడు. పెంపుడు జంతువుల వల్ల కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ తదనంతర పరిణామాలు
అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పావురాల వల్ల కూడా కొన్నిరకాల రోగాలు వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కానీ, ఒక విషయాన్ని మనం తప్పక ఒప్పుకోవాలి. మనిషి కారణంగానే మానవజాతి మనుగడకు పెద్దముప్పు వస్తున్నది. వాతావరణంలో వస్తున్న పెను ప్రమాదకర మార్పులకు మానవుడి చర్యలు, అత్యాశలే కారణం. శాస్త్ర ప్రకారం ఆలోచిస్తే..
ఏ జీవినైనా తనదైన జీవన విధానం ఉంటుంది. వాటి మనుగడకు తగిన వ్యవస్థ ప్రకృతిలో ఉంది. పక్షులను ఎలా పెంచినా.. ఆ పెంపకం నిర్బంధమే అవుతుంది. వాటి స్వేచ్ఛకు భంగమే అవుతుంది. అవి రెక్కలు గల జీవులు. ఇంట్లో పెంచాల్సిన అవసరం లేదు కదా!
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | మాకు ఒక్కతే అమ్మాయి. మగ పిల్లలు లేరు. దీనికి కారణం మా ఇంటికి వాస్తు దోషం ఉండటమేనా?
Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?