Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?
– బి. సురేశ్, బర్కత్‌పుర
వర్తమాన సమాజం కృష్ణుడిని, రాముడిని అర్థం చేసుకోలేకపోతున్నది. చాలామంది కేవలం తమ కళ్లద్దాలలోంచే ఆ మహాపురుషులను బేరీజు వేస్తున్నారు. చూసే కళ్లుంటే చాలదు.. చూడగలిగే స్థాయి కూడా ఉండాలి. ‘ఈ భూమండలం మీద పడకొండు వేల సంవత్సరాలు ఉంటాను. ఒక మనిషిగా ఎలా జీవించాలో నేర్పుతాను’ అన్నాడు శ్రీరాముడు. చాలామంది రాముడిని దేవుడి అవతారంగా భావిస్తారు. కాదు. ఆయన ఒక నరుడిగా, మనలాంటి మనిషిగా వచ్చాడు. మనకు బతుకు చూపించాడు. ఒక సాధారణ మనిషి తన జీవితంలో సమస్యలు వస్తే ఎలా బాధపడ్డాడో.. ఆయనా అలాగే బాధపడ్డాడు. రాముడు – సీత బలమైనఅనుబంధంతో జీవించారు. భార్యాభర్తలు మౌనంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలగాలి. అర్థం చేసుకో గలగాలి. ఎక్కడికి వెళ్లినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. రాముడిని సీతమ్మ నిందించలేదు. ఆయన స్థానాన్ని అర్థం చేసుకున్నది. ఆ గొప్ప దాంపత్యం లోకంలో అరుదు. వాళ్ల ఫొటోలు పెట్టొద్దు అనుకోవడం దురదృష్టం. అది వాళ్ల ఖర్మ. సీతమ్మను అడవిలో వదిలాడనే తెలివిలేని వాదన సరైంది కాదు. ఆ లోతు, ఆ దీక్ష అందరికీ అర్థం కాదు. సీతారాముల ఫొటో ఇంట్లో పెట్టుకోండి. అదే మీకు రక్ష.
మేమున్న అద్దె ఇంటికి డోర్లు వంకరగా పెట్టారు. ఇలాంటి ఇంట్లో ఉండొచ్చా?
– ఓ పాఠకుడు
అందరికీ సొంతిల్లు ఉండాలని లేదు. ఉన్నంతకాలం సొంత ఇల్లు అనే భావించి.. ఉన్నంతలో మంచి గృహాన్ని ఎంచుకోవాలి. ‘అద్దె కొంప ఎట్ల ఉంటే ఏంది?’ అనేది పలాయనవాదం. మీరున్న ఇంటికి వంకర డోర్లు ఉన్నాయంటే.. ఆ ద్వారాలు వాయవ్యం కానీ, ఆగ్నేయం కానీ చూపిస్తున్నట్లు. డోర్లు సవ్యంగా లేనప్పుడు.. గోడల నిర్మాణం కూడా వక్రంగానే ఉంటుంది. తద్వారా ఇంట్లో అగ్ని ప్రమాదాలు (షార్ట్ సర్క్యూట్స్) జరిగే ఆస్కారం ఉన్నది. అంతేకాదు.. ప్రాణాంతకమైన రోగాలు కూడా అంటుకుంటాయి. ఎటూ అద్దె ఇల్లు కాబట్టి వెంటనే మారండి. మరొకటి కూడా, బాగుంటేనే వెళ్లండి. సర్దుబాటు, రాజీధోరణి కావద్దు.
చెరువుల వద్ద ఇండ్లు కడుతున్నారు. స్థలాలు అమ్ముతున్నారు. వాటిని కొనవచ్చా?
– కె. శిరీష, జీడికల్
పంచభూతాలు సమపాళ్లలో ఉన్నచోటే గృహ నిర్మాణం మంచిది. అంటే.. భౌతికంగా నీళ్లు అధికంగా ఉన్న పరిసరాల్లో నివాసం రక్షణగా ఉండదు. చెరువులు, కుంటలు, సముద్ర తీరాలు ఇంటికి ఆనుకొని ఉండటం మంచిదికాదు. ఇండ్లు కట్టేవాళ్లు వ్యాపారదృష్టితోనే కడుతారు. అలాగని, తప్పనిసరిగా కొనాలని లేదుగా! కొన్ని పల్లెలకు నైరుతిలో చెరువు ఉంటుంది. దక్షిణంలో నదులు ప్రవహిస్తుంటాయి. దీంతో అభివృద్ధికి నోచుకోవు. మరో విశేషం ఏమిటంటే.. చాలామంది తూర్పు దిశనే కదా అని చెరువుకు అతి దగ్గరలో గృహాలు కడుతారు. అవి విహార విడిదిగానే నిలబడుతాయి. స్థిర శుభ గృహాలుగా పనికిరావు. కుంటుంబాలు అభివృద్ధి చెందవు.
ఈశాన్యంలో గొయ్యి ఉండటం మంచిదంటూ.. మా అపార్ట్మెంటుకు ఈశాన్యంలో లిఫ్ట్ బోను పెట్టారు. కానీ, మా ఫ్లాట్‌కు ఆ మూల లేదు. మంచిదేనా?
– వి. శారద, తిరుమలగిరి
లిఫ్ట్ పెట్టే బోను ఇంటి ఆయువుపట్టును దెబ్బతీసేదిగా ఉండకూడదు. మీరు ఈశాన్యంలో పెట్టారు అంటున్నారు. అది అపార్ట్మెంట్ మొత్తానికి ఈశాన్యం కావచ్చు. మంచిదే! కానీ, అది మీ ఫ్లాట్ విషయానికి వచ్చినప్పుడు కూడా మంచి స్థానమే కావాలి. అంటే, ఆ లిఫ్ట్ స్థానం మీ ఫ్లాట్ కోణాన్ని కట్ చేయకూడదు. అలా చేశారు అంటే.. ఆ దిశలో ఆ వైపు ఉన్న అన్ని ఫ్లాట్లకూ.. కిందినుంచి పైకి అందరి ఫ్లాట్లూ ఈశాన్యం తెగిపోయి ఉంటాయి. తద్వారా అందరికీ ఆ మూల దోషాలు వర్తిస్తాయి. మీరు ఎలాగూ ఆ మూలల భాగాన్ని మీ ఫ్లాట్‌లోకి తీసుకోలేరు. కాబట్టి తక్షణం ఆ ఫ్లాట్‌ను వదిలి, మరో ఇంట్లోకి చేరండి. ఈశాన్యం తెంపు.. సంతానానికి, సంపత్తికి ముంపు అని నానుడి. కాబట్టి, వెంటనే మారిపోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | టెర్రస్ మీద కిచెన్ కట్టుకోవచ్చా? కడితే.. ఎటువైపు కట్టాలి?
Vasthu Shastra | పెద్ద ద్వారం ఇంటికి మధ్యలో ఉండాలా, చివర్లో ఉండాలా? ఏది మంచిది?
Vasthu Shastra | ఇంట్లో హోమాలు యజమాని చేయాలా? పూజారి చేయాలా?