Vasthu Shastra | హోమాలు ఇంట్లో చేయవచ్చా? అది ఇంటి యజమాని చేయాలా? పూజారి చేయాలా?
– ఎన్. చంద్రకాంత్, యాదాద్రి
ఇంట్లో హోమం (యజ్ఞం) చేయడం అద్భుత వైదిక కర్మ. అది మానవ జీవితాలకు ఒక అంతర్గత శక్తిని అందజేస్తుంది. నేటికీ నిత్యం సూర్యోదయవేళ హోమాలు చేసేవారు చాలామంది ఉన్నారు. మనం ఇంకా ఇంట్లో చేయవచ్చా? బయట చేయవచ్చా? అనే సందిగ్ధంలోనే ఉంటే ఎలా..? అంతటి గొప్ప హోమాన్ని తమ ఇంట్లోనే కాక దేవాలయాలలో, పూజారుల ఇళ్లలో ఎంతోమంది చేయిస్తున్నారు. కానీ, గృహస్తు తన గృహంలోనే.. హాలు మధ్యలో చేయతలపెట్టిన చండీ లేదా రుద్ర, శాంతి హోమాలను చాలా నిష్ఠతో చేయాలి. శాస్త్ర ప్రకారం హోమగుండాన్ని ఏర్పాటు చేసి దంపతులు తూర్పుముఖంగా కూర్చొని రుత్విక్కుల (పూజారుల) చేత హోమాన్ని జరిపించాలి. మన ఇంట్లో నవగ్రహ హోమం చేసినా, నవచండీ యాగం చేసినా.. కార్యమంతా రుత్విక్కుల ద్వారానే జరిపించాలి. అందులో యజమానులు (దంపతులు) భాగస్వామ్యం కావాలి. అంటే.. సంబారాలు (ఆహుతులు) వేయడం, పూర్ణాహుతి తదితర హోమ కార్యాలు మన చేతి స్పర్శతో సాగాలి కానీ, యజమానిని కదా అని పూర్ణాహుతి లాంటివి మనం చేయకూడదు. గుడిలో హారతి మనం వెళ్లినందుకే ప్రత్యేకంగా చేసినా.. ఆ హారతిని గర్భగుడిలో పూజారి మాత్రమే చేసినట్టు. దానిని మనం చేతులతో కళ్లకు హత్తుకున్నట్టుగా మన పాత్ర ఉండాలి.. అంతే! అయితే ఆ ఫలం తప్పక ఆ గృహస్తులకే చెందుతుంది. సంకల్పం వాళ్లదే కదా! చాలామంది అల్ప మనస్కులు హోమాల కోసం ఎంతో ద్రవ్యాన్ని వృథా చేస్తున్నారని భావిస్తుంటారు. వాళ్లు పెద్ద హోదాల్లో ఉన్నవారైనా, సాధారణ వ్యక్తులైనా.. అలాంటి వారు ఇంకా జీవితపు అజ్ఞానంలోనే ఉన్నారని భావించక తప్పదు. ఇది కలియుగం కదా! మీరు చక్కగా, శాస్ర్తోక్తంగా మీ ఇంట్లోనే హోమాన్ని జరిపించుకోండి. శుభమస్తు.
మేము ఓ పెద్ద సైట్లో అపార్ట్మెంట్లు కడుతున్నాం. క్రషర్ మెషీన్ ఎక్కడ పెట్టాలి?
– పి. సంధ్య, నార్కట్‌పల్లి
ముందుగా స్థలానికి చుట్టూ కాంపౌండ్ కట్టుకుని, అంటే.. షీట్లతో హద్దు స్థిరపరచుకోవాలి. అప్పుడే, ఆ వెంచర్‌కు దిశలు ఏర్పడుతాయి. వెంచర్‌కు ఉత్తరంలో కానీ, తూర్పులో కానీ స్థలం ఖాళీగా పెట్టుకోవాలి. ఆ స్థలంలో జరిగే నిర్మాణానికి, క్రషర్‌ను ఆగ్నేయంలో లేదా వాయవ్యంలో పెట్టుకోవాలి. దానికి వచ్చే ‘సైలో’ స్టాండెడ్గా చేయాల్సి ఉంటుంది. అది ఎత్తుగా ఉంటుంది. అలాగే కంపార్ట్మెంట్ బ్యాచర్, మెటీరియల్ ఫీడింగ్ అంతా కలిపి దాదాపు అరవై మీటర్ల పొడవుతో ఏర్పాటు అవుతుంది. కాబట్టి దానికి తగిన స్థలంతోపాటు దాని చుట్టూ దక్షిణ – పడమరలో మెటీరియల్ వేయడానికి స్థలం ఉండాలి. అలాగే వాహనాలు దాని చుట్టూ తిరిగివెళ్లేలా డ్రై ఏరియా వదిలిపెట్టాలి. ఇదంతా వెంచర్‌కు దక్షిణం, పడమరలో కూడా పెట్టుకోవచ్చు.
పడమర వైపు రెండు సింహద్వారాలు పెట్టవచ్చా?
– కె. సంధ్య, కొత్తూరు
మీది ఏ వీధి కలిగిన ఇల్లో చెప్పలేదు. రోడ్డు ఎటువైపు ఉంటే.. అటువైపు ప్రధాన ద్వారాలు వస్తాయి. రావాలి కూడా! మీది పశ్చిమ ముఖం ఇల్లు అయితే.. తప్పకుండా పడమర సింహద్వారం పెట్టి కట్టాలి. ఆ ఇంటికి తూర్పు – ఉత్తర ద్వారాలు ఉన్నా.. అవి సింహద్వారాలుగా పరిగణనలోకి రావు. ఇక రెండు ద్వారాలు పడమరే పెట్టాల్సిన అవసరం ఉంటే.. పెట్టుకోవచ్చు. ఆ రెండిటిలో ఒకటి పశ్చిమ వాయవ్యంలో, మరోటి పశ్చిమం మధ్యలో పెట్టవచ్చు. రెండూ మీరు అనుకున్న కొలతలో (వాస్తుపరంగా) నిలబెట్టండి. అయితే, పడమర రెండు ద్వారాలు పెట్టాం కదా.. తూర్పు అక్కరలేదు అనుకోవద్దు. వరుస ద్వారాలు పెడితే, తూర్పు కూడా రెండు ద్వారాలు పెట్టండి. అన్నీ సరిసంఖ్యలో ఉండేలా చూడండి.
మధ్యలో కాకుండా చుట్టూ సెల్లార్ తీసి అపార్ట్మెంట్ కట్టొచ్చా?
– ఎం. చంద్రశేఖర్, కురవి
ఈమధ్య చాలా పెద్దపెద్ద స్థలాల్లో కేవలం టవర్స్‌ను నలభై, యాభై అంతస్తులతో కడుతున్నారు. ఎంత ఎత్తు కట్టినా ఎందరు మనుషులు ఉంటారో అన్ని కార్లకూ చోటు ఏర్పాటు చేయాల్సి రావడంతో సెల్లార్లు తీస్తున్నారు. శాస్త్ర ప్రకారం.. దక్షిణం, పడమర టవర్స్ కట్టాల్సి వస్తుంది. అయితే, కేవలం వాటి కింద మాత్రమే సెల్లార్లు తీసి, మిగతా స్థలం.. అంటే, ఉత్తరం, తూర్పు భాగాలు వదిలేస్తున్నారు. ఫలితంగా అవి వాస్తు దోషంతో ఉంటున్నాయి. కింది భాగంలో మొత్తం స్థలం సెల్లార్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. కేవలం టవర్స్ కిందనే సెల్లార్ సరైంది కాదు. అలా అయితే, స్థలాన్ని వేరుచేసి కాంపౌండ్లు కట్టి.. ఆ టవర్స్‌కు వేరుగా ప్రవేశాలు పెట్టి వాడుకోవాలి. మధ్యలో లేకుండా చుట్టూ సెల్లార్ తీయవద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంట్లో మొదటిసారి పుట్టిన బాబుకు సూర్యదర్శనం, చంద్రదర్శనం చేయించాలని అంటారు. ఎందుకు?