Vasthu Shastra | వాస్తుతోపాటు ఇంట్లో పూజలు, శాంతులు చేయించుకోవాలా? ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండటం లేదు. ఏం చేయాలి?
– పి. ఆదిలక్ష్మి, భువనగిరి
ఇంటిని సరిదిద్దుకోవడంతోపాటు మనసును కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు ముందు మనం ఎలా ఉండబోతున్నాం అనేది.. నేడు మనం దేనికి ఎక్కువగా సమయం కేటాయిస్తున్నాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. నిన్నటి ఆలోచన నేటి ఫలితం అవుతుంది. నేటి చర్య రేపటి ప్రతిఫలంగా మన ముందుకు వస్తుంది. అందుకే.. మనం ఎవరితో ఎక్కువ ఆత్మీయంగా ఉంటున్నాం అనేది ముఖ్యం. మనిషికి శాంతి అనేది రెండు రకాలుగా అవసరం అవుతుంది.. శరీర పరమైనది, మానసిక పరమైనది. చాలామంది మంచిగా, బలంగా ఉంటూ మంచి బట్టలు వేసుకొన్నప్పటికీ.. మానసికంగా ఎంతో కుంగుబాటుతో ఉంటారు. కేవలం పై అలంకారాన్ని బట్టి.. మనసులో కూడా అంతే శుభ్రంగా ఉన్నారని, ఉంటారని చెప్పలేం. కనిపించని చెత్త మనసులో ఎక్కువగా ఉంటుంది. శరీరపరంగా ఉండే ఇబ్బంది.. మంచి ఇంటిలో త్వరగా పోతుంది. మానసిక శాంతి అనేది మన ప్రయత్నంతో పోతుంది. ఆ ప్రయత్న ఫలితానికి మంచి ఇల్లు సహకరిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో శాంతి పూజలు చేయించడం తప్పుకాదు కానీ.. శాంతి కారకమైన ఆలోచనలతో ఉండటం అత్యవసరం. ఎదుటివారికి బాధ కలిగించే తీవ్ర విమర్శలు చేయవద్దు. అలా చేసే వ్యక్తులతో స్నేహం వద్దు. అలాగే మనసులో ఇష్టాయిష్టాల విషయంలో సమబుద్ధి కలిగి ఉండాలి. మరో ముఖ్యమైన అంశం.. మనం తినే వాటిమీద, అనే వాటిమీద, వినే వాటిమీద.. చూసే వాటిమీద నిఘా వేసి ఉండాలి. ఇవే మనపై అంతర్గతంగా ప్రభావం కలుగజేసే అంశాలు. వీటిపట్ల నియంత్రణ అవసరం. శాంతి మనలోంచే ప్రభవిస్తుంది. బయట ఎక్కడా లేదు. మీకున్న మంచి ఇంట్లో మంచి ఆలోచన, అలవాట్లతో.. భక్తిపూరిత దినచర్యతో, ధ్యానంతో మీరు తప్పకుండా మానసిక శాంతిని పొందవచ్చు. అదే ఇంటి లక్ష్యం కదా!
మాకు ఉత్తరం ఇల్లు కట్ ఉంది. పైన బీము కలపాలా? అదికూడా అవసరం లేదా?
– బి. మంజుల, షాద్‌నగర్
ఉత్తర భాగం ఇల్లు తెగి ఉండొద్దు. అది ఇంట్లో ఆడవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే.. ఆర్థిక పరమైన ఇబ్బందులూ ఏర్పడుతాయి. ఇల్లు పూర్ణంగా ఉండాలి. లేదంటే.. తగిన స్థలం ఉన్నప్పుడు ఇంటిని విశాలంగా పూర్తి త్రిశాలగా కట్టాలి. ఆ కట్‌ను కలపడానికి కేవలం ఒక అడ్డ బీము వేసి కలిపాం.. అనుకుంటే సరిపోదు. మీరు ఆ ఖాళీని కలుపుతూ తప్పకుండా స్లాబ్ వేయాలి. ఆ స్థలాన్ని ఇంట్లో భాగంగా చేసుకొని వాడాలి. అప్పుడు దక్షిణం నుంచి ఉత్తరం వరకు మధ్య హాలు వస్తుంది. ఇల్లు నిలబడుతుంది. హాలు పూర్తిగా లేక.. అటు దక్షిణం, ఇటు ఉత్తరం కట్ చేసి ఉండకూడదు. మీ ఇల్లు డూప్లెక్స్ కాదు. మెట్లు బయట పెట్టారు. ఒకవేళ దానిని డూప్లెక్స్గా మార్చుకుంటే.. దక్షిణంలో ఇంటి లోపల మెట్లు పెట్టుకొని, ఆ ఉత్తరం కట్‌ను ఉత్తరం సీత్రూగా ఉంచుకోవచ్చు.
గెస్ట్ బెడ్రూమ్గా ఇంట్లో ఏ గదిని ఇవ్వాలి? కింద నైరుతి గదిని ఇవ్వొచ్చా?
– ఎస్. జగన్, ములుగు
కింది పోర్షన్లో గెస్ట్ బెడ్రూమ్ కోసం నైరుతి గదిని పెట్టుకోవడం మంచిదికాదు. ‘మా ఇంట్లో గెస్ట్ రూముగా మాకు ఇష్టం వచ్చిన గదిని ఇవ్వకూడదా? దీనికీ వాస్తు అవసరమా?’ అనుకోవచ్చు. మీరు గెస్ట్ అంటున్నారు. గెస్ట్ అంటే రోజూ మనతో ఉండడు. అప్పుడప్పుడూ వచ్చే అతిథి మాత్రమే! గెస్ట్ రూముగా ఇంట్లో ఈశాన్యం గదిని లేదా పైభాగంలో ఆగ్నేయం లేదా వాయవ్యం గదిని ఇవ్వడం మంచిది. ఉంటే.. ఉత్తరం – తూర్పు గది కూడా ఇవ్వొచ్చు. కిందిభాగంలో కూడా నైరుతి గది కాకుండా.. వాయవ్యం లేదా ఉత్తరం – దక్షిణం గదులను కేటాయించవచ్చు. గెస్టులు ఎప్పుడూ ఉండరు కాబట్టి, ఆ గది ఎక్కువ రోజులు ఖాళీగా ఉంటుంది. అది మంచిది కాదు. కాబట్టి, కింద ఇచ్చినా.. పైన ఇచ్చినా.. ‘నైరుతి స్థానం’ మంచిది కాదు. ఆ గదిని కుటుంబసభ్యులే వాడుకోవాలి.
నదులు, వాగుల దగ్గర ఇండ్లు కట్టుకోవద్దా? కట్టుకుంటే దోషమా?
– ఎస్. శంకర్, మెదక్
ఇంటిని ప్రకృతిపరమైన శక్తుల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కదా! నదులకు, చెరువులకు, సాగరాలకు ఆనుకొని ఉంటే.. తుఫాన్ల వంటి బీభత్సాల సమయంలో ఆ నీటి వెల్లువకు నివాసాలు తట్టుకోవు. అందులోనూ వర్షకాలం నదులు, వాగులు పొంగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన దూరంలో, తగిన ఎత్తులో, మంచి జాగ్రత్తలతో.. వాగుల వద్ద ఇల్లు కట్టుకోవడం దోషంకాదు. అయితే ఆ వాగులు, వంకలు, నదులు, కాలువలు మనం కట్టే ఇండ్లకు తూర్పు లేదా ఉత్తరంవైపు ఉంటే మంచిది. అందంతోపాటు రక్షణ కలిగిన ఇండ్లు మనకు అవసరం.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అవన్నీ చూడాలా?