Vasthu Shastra | ఏ గదికి ఆ గది వాస్తు చూడాలా? మొత్తం స్థలంతో కలిపి చూడాలా?
ఎం. సత్తయ్య, మోర్తాడ్
ఇంట్లో అన్ని దిశలూ, అన్ని మూలలూ ప్రధానమే. ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు మొత్తంగా స్థలం పరిశీలించి, దాని గుణగణాలు లెక్కించాలి. స్థలం చాలా ముఖ్యమైనది. దాని స్వభావాన్ని తెలుపుతుంది. తద్వారా ఆ స్థలం ఇల్లు కట్టడానికి అనువైనదా? కాదా? అన్నది ముందుగా నిర్ధారించాలి. ఇక్కడే ‘గెలుపు బీజం’ పడుతుంది. ‘పతనం పునాది’ అయినా పడవచ్చు. ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకోవద్దు. తినే ఆహారం ఎంత ప్రధానమైందో.. ఉండే స్థలం కూడా అంతే ముఖ్యమని మీరు గుర్తించాలి. ఇంటి ప్లానులో మన అవసరాల మేరకు మెట్లు, లిఫ్ట్, గదులు.. ముందుగావిభజించుకోవాలి. తరువాత పడకగది, వంటగది మొదలైన ప్రధాన గదులను దేనికదిగా చూసి.. టాయిలెట్, దానిలో కుండీ ఫేసింగ్, పడక అమరిక, గదుల వెంటిలేషన్, ఉష్ణోగ్రత, షెల్ఫ్‌లు, బట్టల గదులు మొదలైన అన్నిటినీ చాలా జాగ్రత్తగా వాస్తు గమనంలో పెట్టుకొని, సరిచేసుకోవాలి. దేనినీ తేలికగా కొట్టిపారేయవద్దు. బంగారంలో ప్రతి సన్నని ముక్కకూ విలువ ఉన్నట్టే.. శాస్త్రంలో ప్రతి అంశం ముఖ్యమే.
దక్షిణం ఇల్లు కొని, దక్షిణంలో స్విమ్మింగ్ పూల్ కట్టాం. ఫలితాలు ఎలా ఉంటాయి?
వి. అలివేణి, కొండగట్టు
మనిషి జన్మతః ఎన్నో స్వభావాలతో పుడతాడు. అవి ఎలాంటివి? ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? వాటిని అదుపులో ఎలా పెట్టాలి? తదితర ప్రశ్నలకు సమాధానంగానే శాస్ర్తాలు వచ్చాయి. మీరు మీ ఇష్టానుసారం కట్టి, వాటి ఫలితాలు ఏమిటని అడుగుతున్నారు. ఈ ఉద్దేశం కట్టకముందే ఉంటే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు! దక్షిణంలోని ఇల్లు కొనడం వల్ల.. దాన్ని ప్రధాన గృహంగా వాడకపోతే యజమానికి కీడు. దక్షిణంలో ఖాళీ ఏర్పడటం వల్ల ఆర్థిక నష్టాలు, తగాదాలు, స్త్రీలకు అనారోగ్యాలు తప్పవు. పైగా దక్షిణంలో స్విమ్మింగ్ పూల్. దక్షిణం పల్లం. వక్రపు ఆలోచనలు పురుషుల జీవితాన్ని తారుమారు చేస్తాయి. ముందు మీరు ఆ గృహాన్ని అమ్మేయండి. ముందున్న ఇల్లు ఎలా ఉందో చూపించుకొని దానిలో వక్రతలను సరిచేసుకోండి. ఆ ఇంటిపట్ల ఎంత ప్రేమ ఉన్నా.. అది మీ పతనానికి కారణం అవుతుందనే విషయం మరువకండి.
గొప్ప వాస్తు ఉన్న ఇల్లు ఇచ్చేది ఏమిటి? అయినా, మనిషి సాధించలేనిది ఏముంది? కొత్తగా.. సైన్స్ కన్నా!
భ్రమరాంబ, కొత్తూరు
భారతదేశంలో ఎన్ని రకాల శాస్ర్తాలు ఉన్నాయో.. అవన్నీ వ్యక్తిని తన జన్మ లక్ష్యానికి చేర్చే రహదారులే. రాబోయే తరాల్ని మోసపుచ్చడానికి ఎవరో పన్నిన కుట్రలో, కుయుక్తులో కానేకాదు. శాస్త్రం అంటేనే మనిషిని జ్ఞాన గమ్యానికి చేర్చేది. మనిషి సాధించలేనిది ఏమీలేదు. అలాగే.. సాధించింది కూడా ఏమీలేదు. భార్య కడుపులో ఉన్నది ఆడబిడ్డో, మగబిడ్డో తెలియదు. నెత్తిమీద వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియదు. పడుకుంటే.. ఎన్ని నిమిషాల తర్వాత నిద్ర పడుతుందో తెలియదు. భూమి ఎందుకు తిరుగుతున్నదో తెలియదు. రంగురంగుల ఆహారం తింటున్నా.. రక్తం ఎందుకు ఎర్రగా ఉన్నదో తెలియదు. మనకు తెలిసింది ఏమిటి? కృషి ఒక్కటే కాదు.. మనిషికి ప్రకృతి కృప కూడా ఉండాలి. ఇందుకే శాస్ర్తాలు పుట్టాయి. అదే భగవత్ కృప, దేవుడి దయ, పరమాత్మ అనుగ్రహం. అన్నీ తెలిసినట్టే సైన్స్ చెబుతున్నా.. తెలియనిది ఎంతో ఆ సైన్స్‌కు ఎందుకు అందడం లేదు? యుగయుగాల నుంచి జరిగిన, జరుగుతున్న అనేక సంఘటనలు, సూక్ష్మ ఆకాశంలో నిక్షిప్తమై ఉంటాయి. మనిషి బుద్ధి వక్రతవల్ల, చెడుకార్యాల వల్ల, శాస్త్ర విరుద్ధ నిర్మాణాల వల్ల అవి జీవన సమతౌల్యాన్ని, ఆనందాన్ని, శాంతిని తలకిందులు చేస్తాయి. రోగాలు, భూ ప్రకంపనలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు.. అలాంటి విపత్తులే. ఈ విషయం మనిషికి తెలియడం లేదు. ‘రోగం.. ప్రమాదం’ అనేది ఒక శిక్ష కాదు. కాకతాళీయం కూడా కాదు. మనిషి పూర్వజన్మలో చేసిన పనికి నేడు అందిన ప్రతిఫలం. మనుషుల సమష్టి కార్యాల ప్రభావం భూమిమీద పడుతుందనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆకాశం గుడ్డిదేం కాదు. అన్నీ పదిల పరుస్తుంది. మనం చేసే పనిలో సాధించేది ఏమిటి? వాస్తు విజయమా? మంత్రాల సృష్టా? యాంత్రికంగా మనం ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా.. అంతే ఎత్తులో మన జ్ఞానం వృద్ధి చెందడం లేదన్నది తెలుసుకోవాలి. జ్ఞానం వేరు – సైన్స్ విజ్ఞానం వేరు – వ్యక్తిగత నాలెడ్జ్ వేరు. ప్రకృతి ధర్మం, మనిషి ధర్మం, విశ్వ (భగవత్) ధర్మం ఒకటిగా చేసి, వ్యక్తిని మహోన్నతుడిగా ఏది నిలుపుతుందో, ఏది పొందితే ఇక పొందాల్సినది ఏదీ ఉండదో.. మనల్ని ఆ గట్టు చేర్చడానికే శాస్ర్తాలు ఉన్నాయి. అందుకు మనకున్న సైన్స్ సరిపోదు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | బేస్మెంట్కు స్లాబ్ వేసి, కింద మట్టి నింపకుండా ఇల్లు కట్టుకోవచ్చా?
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?