Vasthu Shastra | మాకు దక్షిణం – ఉత్తరం రోడ్లు కలిగిన రెండు స్థలాలు ఉన్నాయి. పెట్రోలు బంకు దేనిలో పెట్టాలి? ఎలా కట్టాలి?
– కె. ముత్తిరెడ్డి, కొలనుపాక
పెట్రోలు బంకులు అంటేనే గోతులు (ట్యాంకులు) పెట్టి, కట్టాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా శాస్త్రపరమైన దోషాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు దక్షిణం రోడ్డు స్థలంకన్నా.. ఉత్తరం రోడ్డు స్థలాన్ని ఎంపిక చేసుకోండి. దానిలో ఉత్తరం వైపు – తూర్పు వైపు భూమిలో ట్యాంకులను నిర్మించుకోండి. స్థలానికి ఉచ్ఛమైన దక్షిణ – పశ్చిమ భాగంలో క్యానోపి (బంకు పందిరి) వేసుకోండి. దానికి దక్షిణ – నైరుతి భాగంలో కంపెనీ ఆఫీసు గదిని తూర్పు – పడమరలుగా వేసుకోండి. వరుసగా ఎన్ని గదులు వేసుకున్నా.. వాటికి ఉత్తర – ఈశాన్యంలో ద్వారాలు పెట్టుకోండి. ఎయిర్ బ్యాంక్ వాయవ్యంలో, టాయిలెట్లు ఆగ్నేయంలో కట్టండి. ఈ జాగ్రత్తలతో పెట్రోలు బంకు నిర్మిస్తే.. శుభదాయకంగా ఉంటుంది.
గేటుకు దగ్గరగా.. తూర్పులో షాపు వేసుకోవచ్చా? దాన్ని సొంతానికి వాడుకోవచ్చా?
– బి. పద్మ, కొంపల్లి
ఇంటి నుంచి తూర్పు కాంపౌండు దూరంగా ఉన్నప్పుడు కాంపౌండు పారులో ఇంటికి తగలకుండా షాపులు వేసుకోవచ్చు. ఇంటికి ఉండే గేటును వదిలిపెట్టి.. అంటే, ఈశాన్యంలో గేటును వదిలి మిగతా ఆగ్నేయం మూలవరకూ ఉన్న స్థలం వెడల్పు కొలిచి, అందులో ఎన్ని షాపులు వస్తాయో.. అన్నీ నిక్షేపంగా వేసుకోవచ్చు. కేవలం తూర్పు భాగంలో మాత్రమే షాపు వేసి, ఆగ్నేయం దిశను వదిలి వేయవద్దు. అప్పుడు తూర్పు భాగం తెగిపోయి యజమానికి దోషం కలుగుతుంది. అలాగే మీరు తూర్పు – ఈశాన్యం వదిలివేసి, షాపులకు బయటినుంచి.. అంటే తూర్పు వీధినుంచి షటర్లు పెట్టి బయటినుంచి మాత్రమే వాడుకోవాలి. మీకోసం వాడుకున్నా సరే.. లోపలినుంచి షాపులకు ఎంట్రీలు ఉండవద్దు.
మెట్ల కింద వాచ్మన్ గది కట్టవచ్చా? దీనివల్ల వాస్తుకు ఏమైనా భంగమా?
– కె. బిందుమాధవి, జిల్లెలగూడ
స్థలం ఉంది కదా అని దాన్ని ఏదో ఒక పనికి వినియోగించాలని చూడవద్దు. స్టాఫ్గదులు (వాచ్మన్) అంటే ఏదో తంతులాగా కట్టి వదిలేయడం తప్పు. పైగా మెట్ల కింద జీవనం మంచిదికాదు. మీరు రాసిన వివరాలలో మెట్లు విశాలంగా ఉన్నాయి. కింద స్థలం సరిపోతుంది కానీ, అక్కడ గది కట్టొచ్చా? అని అడిగారు. మెట్ల కింద గాలి, వెలుతురు ఉండవు. పైగా మీరు మెట్లు వాయవ్యంలో వేశారు. దానికింద మూత ఉండకూడదు. స్టాఫ్ గదులను ఆ వాయవ్యంలోనే మెట్లకింద కాకుండా, వాటి పక్కన కట్టండి. వాళ్లకు కూడా ఉండబుద్ధి కావాలి కదా! ఆ గదులు మంచి వెలుగుతో ఉండాలి. కిచెన్ అవసరం లేకపోయినా, సరైన స్థలంలో టాయిలెట్ కట్టి ఇవ్వడం మంచిది.పరిశుభ్రమైన వాతావరణం.. ఎవరికైనా ముఖ్యమే.
వాస్తు ఉంటే కోరుకున్న జీవితం లభిస్తుందా?
– కె. సిద్ధార్థ, హైదరాబాద్
ఈ ప్రశ్నలో ఎంత విజన్ ఉందో.. అంత అమాయకత్వం ఉంది. మనం కోరుకునేది నిజంగా మనం చేయదగిందేనా? అన్నది ఒకసారి తరచి చూసుకోవాలి. అలాగే, అందరి జీవితాల్లో కోరుకున్నది లభించిందా? అన్నది కూడా ఆలోచించాలి. ఈ నిమిషం.. అంటే వర్తమానంలో ఉండే ఇష్టం జీవితమంతా ఉంటుందా? అనేది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. చిత్రం ఏమిటంటే.. కాలం ప్రసాదించిన పరిమిత జీవితంలోనే చాలామంది మహోన్నతంగా రాణించారు. ఎంతశాతం మందికి కోరుకున్న జీవితం లభించింది? అనేకులు అందివచ్చిన జీవితాన్ని కోరుకున్నదిగా మార్చుకున్నవారే. వాస్తు ఉంటే.. కోరుకున్న జీవితం లభించకపోవచ్చు. కానీ, నువ్వు నిజంగా రాణించే, శాసించే జీవితం మాత్రం లభిస్తుంది. ప్రకృతి మనకు సాధ్యమయ్యే, మనం మాత్రమే చేయగలిగే, మనకోసమే నియోగించిన పనిని అందిస్తుంది. చిత్రం ఏమిటంటే.. మనకు ఏం కావాలో మనకే స్పష్టత ఉండదు. మనోవికాసం కలిగితేకానీ.. ఆ స్పష్టత రాదు. అందుకే ఎందరో రాజకీయ ప్రముఖులు ఏదో అవుదామని ఉన్న ఊరు మారి, ఇండ్లు మారి సమాజపు గతిని మార్చారు. ఆగితేకానీ.. అర్థంకాదు! అన్నట్టు, మన జీవితం దేనికోసం ఆవిర్భవించిందనే విషయం తేలేది.. సంపూర్ణంగా ప్రకృతి మద్దతు లభించినప్పుడే. చాలామంది ఎన్నో రంగాల్లో మునకలు వేసి వేసి, చివరికి ఏదో ఒకదాంట్లో స్థిరపడతారు. అదే మనం కోరుకున్నది అవుతుంది. బయటి మనసు వెయ్యి కోరుతుంది. కానీ, నువ్వు దాంట్లో ఉండవు. అంతర్మనసు వికసించినపుడు మనలోని నైపుణ్యశక్తికి తగిన జీవితం తప్పక లభిస్తుంది. ఇష్టపడటం వేరు.. మనం చేయదగింది ఇష్టపడటం వేరు. మనో మాయను తొలగించి, మంచి జీవితాన్ని అందించేదే మంచి గృహం. దీనిని అర్థం చేసుకోవడం కష్టం. కానీ, ఎవరికైనా.. కష్టం నుంచే ఇష్టమైన, స్పష్టమైన జీవితం లభిస్తుంది. ఇదో లోతైన విషయం.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | హాలులో సింహం లేదా పులి బొమ్మలు పెట్టుకోవచ్చా?
Vasthu Shastra | నిత్యం మంత్ర జపం వల్ల ఇంట్లో దోషాలు పోతాయా?