చనిపోయిన తల్లిదండ్రుల పేర్లు ఇంటి గేటుకు పెట్టుకోవచ్చా?
– ఎస్. చంద్రకళ, బైరాన్‌పల్లి
బతికి ఉన్న యజమాని పేరు పెట్టినా.. అతను చిరకాలం ఉంటాడనే భరోసా ఉందా? ఇంటి గేటుకు రెండు వైపులా కొందరు శ్రీనివాస నిలయం అనో, శాంతి నివాసం అనో పేరు పెట్టుకుంటారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్లు తల్లిదండ్రుల పేర్లు, దేవుళ్ల పేర్లు పెడుతారు. దానివల్ల వచ్చే లాభం లేదు. దోషమూ లేదు. అమ్మానాన్నలు చనిపోయినంత మాత్రాన మీ పేరులో, మీ జీవితంలో.. మీ శరీరంలోంచి లేకుండా పోతారా! కన్నవాళ్లు ఇచ్చిందే కదా.. మన బతుకంతా! స్మృతికి చావు లేదుకదా! మనం పోతే మన పిల్లలు మనల్ని గుర్తు చేసుకుంటారు. వాళ్ల ఇండ్లకు మన పేర్లు పెడతారు. ఇలాంటివన్నీ శాస్త్ర సూచనలు కావు. అలాగని నిషేధాలూ కావు. ఎవరి నివాసం వారి ఇష్టాలయం. ఎలాగైనా పెట్టవచ్చు. అంతిమ నిర్ణయం మీదే.
స్కూల్ బిల్డింగ్ కడితే.. తప్పకుండా ఏదో ఒక ఆలయం కూడా కట్టాలా?
– బిందు చంద్రిక, మరికల్
మనిషి ఎంత మహోన్నతుడు అయినా.. ఖగోళమంతా గాలిస్తూ ఉన్నా.. ప్రకృతి సహకారం లేకుండా ఏదీ సాధించలేడు. ఇది మన ప్రగతిలో అడుగడుగునా కనిపిస్తుంది. అవసరం అవుతుంది. అందుకే కొందరు ఎన్ని అత్యాధునిక యంత్రాలు పెట్టి ఆసుపత్రులు కట్టినా.. గొప్పగొప్ప ప్రొఫెసర్లతో విశ్వవిద్యాలయాలు కట్టినా.. భూమిపై మనిషి రాకకు ముందే అన్ని వనరులు సమకూర్చి పెట్టిన ఆది పురుషుడిని మరువరు. ఎక్కడ పాఠశాల భవనం కట్టినా కొందరు చదువుల తల్లి సరస్వతి ఆలయం కడుతారు. ఇది వారివారి వ్యక్తిగతం. శాస్త్ర నియమం కాదు. మీకు నచ్చిన మార్గం అవలంబించండి. ఇబ్బంది లేదు.
మా ఆఫీసు శ్మశానం గోడకు ఆనుకొని ఉంటుంది. అలా ఉండొచ్చా? అన్నట్టు, మాది ఉత్తర ముఖం.
– పి. శంకర్, అమరచింత
మనిషి నివాసాలు ఎక్కడ కట్టినా.. ఆ నిర్మాణాలను దేనికోసం వాడినా.. ఆ కట్టడం ఆరోగ్యకరమైన పరిసరాల మధ్య ఉండటం అత్యవసరం. స్థలం ఉందనో.. లేకుంటే తక్కువ ధరకు వచ్చిందనో.. ఎక్కడపడితే అక్కడ స్థలాలు ఎంపిక చేసుకొని వాడుకోవడం మంచిదికాదు. మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారు అంటేనే.. ఆ స్థానంలో మీరుఅసౌకర్యంగా ఉన్నారనే అర్థం. ఆ ఆఫీసును వెంటనే ఖాళీ చేయండి. ఒకవైపు శవ దహనాలు.. పొగ.. ఏడుపులు. దుఃఖ వాతావరణాన్ని చూసుకుంటూ ఎలా ఆఫీసు కార్యకలాపాలు చేస్తారు? పైగా ఆ శ్మశానం మీకు దక్షిణం వైపు ఉన్నది. కొన్ని ప్రాంతాలు ఆ క్షణానికి హాని చేయకపోయినా.. మానసికంగా పెనుభారంగా మారుతాయి. అందరం పోయేవాళ్లమే కానీ.. ఉన్నంత కాలం పోయే సన్నివేశాలు చూడొద్దు కదా! మనం వచ్చిన కార్యం నెరవేరాలి కదా!
మా స్థలానికి దిశలు క్రాస్‌గా ఉంటాయి. ఇల్లు కట్టాం. దాన్ని డూప్లెక్స్ చేయాలి. స్లాబ్‌ను ఎటు కట్ చేస్తే మంచిది?
– బి. శ్రీలక్ష్మి, కొంపల్లి
ఇల్లు కట్టడం సులభం. కానీ, అది యోగ్యమైన స్థలమా? కాదా? అనేది ఆలోచించాలి. అలాంటి స్థలాన్నే ఎంచుకోవాలి. మీరు ఇల్లు కట్టామని అంటున్నారు. విదిక్కులకు ఇల్లే లేదు. కడితేగిడితే వ్యాపారం కోసం కట్టుకోవచ్చు. పైగా మీరు డూప్లెక్స్ అంటున్నారు. హాలో ఎటు పెట్టాలి? అని అడుగుతున్నారు. ఈశాన్యం రోడ్డు ఉంటే అటుగా ముఖం చేసి మీరు నిర్మాణం చేసుంటే ఆ ఇల్లు ఎంతో కొంత యోగిస్తుంది. మీ ద్వారం దిశలు తెలుపలేదు. ఉన్న ఇల్లు బాగుందా? ఉన్న దిక్కులకు అనుకూలమా? కాదా? అన్నది తెలుసుకోండి. అంతేకానీ, పైన మరో ఇల్లు కట్టాలి, దానిని డూప్లెక్స్ చేయాలి.. అనే ప్రణాళిక వద్దు. చెడు ఇల్లు చెడు నిర్ణయాలకు పురికొల్పుతుంది. చూసి నిర్ణయం తీసుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Money Plant |మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనట