Vasthu Shastra | ఇంటికి ఉత్తరంలో టాయిలెట్లు ఉండొద్దా? వాటిని తిప్పి కట్టొచ్చా?
– ఎం. కమలమ్మ, పటాన్చెరువు
అపార్ట్మెంట్లు నిర్మించేవారి పూర్తి నిర్లక్ష్యం వల్లనే టాయిలెట్లు ఉండరాని దిశల్లో ఉంటున్నాయి. ‘ప్లానింగ్ చేయరాదండీ.. ఉత్తరంలో తూర్పు టాయిలెట్లు రాక తప్పదండీ’.. అని దిక్కుమాలిన మాటలు చెబుతుంటారు. శాస్త్ర ప్రకారం ఎలాంటి అపార్ట్మెంట్నైనా అద్భుతంగా కట్టవచ్చు. కక్కుర్తి వదిలితే.. గొప్ప గృహ సముదాయాలను నిర్మించే అవకాశాలు ఉన్నా.. ఎవరికో ఓనమాలు రాని వాళ్లకు నిర్మాణాలు అప్పచెబితే అట్లాగే ఉంటాయి. బతుకులు పాడవుతాయి. అది ఫ్లాట్ అయినా విల్లా (ఇల్లు) అయినా తూర్పు దిశలో, ఉత్తరం – ఈశాన్యంలో ఎట్టి పరిస్థితిలోనూ టాయిలెట్లు పనికిరావు. అది పిల్లల ఆరోగ్యాల మీద, యజమాని ఆలోచనల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. ఆ దిశల్లో ఉన్న టాయి
లెట్లలో కుండీలు ఎటు తిప్పి కట్టినా.. దోషం పోదు. ఎత్తివేసి ఇంటి ఆగ్నేయం-వాయవ్యంలో వేసుకోవాలి.
మా స్థలం నడుమ బోరుబావి ఉంది. దానిని పూడ్చి ఇల్లు కట్టాలా? అలానే ఉంచుకోవాలా?
– ఎం. శోభ, కొత్తపల్లి
ఇంటి గర్భంలో గుంతలు – మిట్టలు ఉండటం శాస్త్ర విరుద్ధం. మీ స్థలంలో బోరు సరిగ్గా నడుమ ఉంటే.. అది ఇంటి నిర్మాణానికి అడ్డుగా.. ఇంటి లోపలి భాగంలో వస్తుందా? చూడండి. ఇంటి నిర్మాణానికి బయటికి వస్తే ఫరవాలేదు. లోపలికి వస్తే మాత్రం తొలగించాల్సిందే. ఇంట్లో గొయ్యి మంచిది కాదు. దానిని తియ్యాలి అంటే.. పూడ్చాల్సిందే. అలానే ఉంచే వీలు ఉండదు. ఆ బోరు ఇంటికి తూర్పు – ఉత్తరం వచ్చేలా.. దక్షిణం కానీ, పడమర కానీ ఖాళీ స్థలం ఇతరులది ఉంటే కొనే ప్రయత్నం చేయండి. ఇల్లు ఇంకా కట్టలేదు కాబట్టి స్థలాన్ని ఎటైనా కొనవచ్చు. ఫరవాలేదు. అవకాశం లేదు అనుకుంటే మరో బోరుబావిని ఇంటికి ఉచ్ఛమైన భాగంలో తవ్వి, ఉన్నదాన్ని పూడ్చి, దానిమీద పిల్లర్లు రాకుండా గృహం కట్టుకోండి.
మాకు తూర్పు- దక్షిణం రోడ్డు ఉంది. కమర్షియల్ నిర్మాణం చేయాలి. సెల్లార్ తీయాలి. ఏ వైపు ప్రవేశం ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– భాను ప్రకాశ్, కోదాడ
మీ స్థలాన్ని ఆగ్నేయం బ్లాకు అంటారు. దానికి సెల్లారు తీయాలంటే.. దక్షిణాభిముఖంగా మీ నిర్మాణాన్ని ప్లాన్ చేయాలి. అంటే.. ఆ స్థలంలో తూర్పు అంతగా శక్తిమంతంగా ఉండదు. దక్షిణమే సలక్షణంగా పనిచేస్తుంది. సెల్లారులోకి ప్రవేశాన్ని.. దక్షిణం రోడ్డు నుంచి దక్షిణ – ఆగ్నేయం నుంచి పెట్టాలి. రాకపోకల కోసం రెండు ఎంట్రీలు కావాలి. వేరువేరుగా అనుకున్నప్పుడు దక్షిణం మధ్యలో ఒకటి, దక్షిణం-ఆగ్నేయంలో ఒకటి పెట్టుకోవచ్చు. సెల్లారును స్థలంలో తూర్పు హద్దును ఇటు ఉత్తరం హద్దును తాకేలాగా తీయాలి. దక్షిణంలో-పడమరలో హద్దుల వరకు వెళ్లకుండా కనీసం ఐదు అడుగులు వదిలి తవ్వాలి. ద్వారాల (ఎంట్రీల) వద్ద ర్యాంపు చేసుకొని, లోపలికి వెళ్లవచ్చు. ఆగ్నేయం బ్లాకు దిశకు లేనప్పుడు సెల్లారుకు వెళ్లవద్దు.
మా స్థలం దిశకు లేదని అంటున్నారు. తిప్పి కట్టుకోవచ్చా?
– కె. రామస్వామి, పాటెమట్ల
ఇల్లు.. రోడ్డు దిశలకు అనుకూలంగా ఉన్నప్పుడే గృహం పంచభూతాలతో అనుసంధానం అవుతుంది. కనెక్టివిటీ అనేది దేనికైనా.. అవసరం. ప్రకృతిలో ఎటుచూసినా చెట్టు చేను ఇండ్లు.. గుండ్లు.. రోడ్లు కనిపించడం సాధారణం. కానీ, వీటి అంతర సంబంధం విభిన్నంగా ఉండవద్దు. మీరు ఇల్లు తిప్పి దిశకు కడితే.. ఊళ్లోకి చేర్చే మీ ఇంటి ముందు రోడ్డు దిశకు తిప్పలేరు కదా! ఉన్న వంద లేదా రెండు వందల గజాల స్థలాన్ని తిప్పడం వల్ల ఇంటి చుట్టూ కాంపౌండు కట్టినప్పుడు అన్ని మూలలూ పెరిగిపోతాయి. ఫలితంగా, చాలా వికృతమైన ఆవరణం ఏర్పడుతుంది. మీ స్థలం ఏ దిక్కుకు తిరిగిందో చూసుకొని, ఆ దిశకు అనుకూలంగా కేవలం వ్యాపార నిర్మాణం చేయండి. గృహానికి పనికిరాదనుకున్న స్థలంలో ఇల్లు తిప్పికట్టవద్దు. దీనివల్ల వాస్తుపరమైన దోషాలు కలుగుతాయి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | స్థలం కొనగానే ఇల్లు కట్టుకోవచ్చా? కొన్నాళ్లు ఆగితే మంచిదా?