Vasthu Shastra | హాలులో సింహం లేదా పులి బొమ్మలు పెట్టుకోవచ్చా?
– బి. ఝాన్సీ, కొంపెల్లి
ఇంటిలో అందం కోసం, అతిథులను ఆకర్షించడం కోసం చిత్ర విచిత్రమైన డెకరేషన్లు చేస్తున్నారు. ఇవ్వాళ ఇంటీరియర్ పేరుతో చేసే ఖర్చు.. సామాన్యుడి ఇల్లు ఖర్చు ఒకటే అనడం అతిశయోక్తి కాదు. మన గృహంలో మనసు మీద మంచి ప్రభావాన్ని కలుగచేసే దృశ్యాలు ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ల తెల్లని మనసు మీద చిన్నప్పటి ముద్రలు జీవితమంతా చెదిరిపోవు. కాబట్టి ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని అందించే చిత్ర పటాలు.. ప్రపంచ పటం, ప్రకృతి చిత్రాలు, మహోన్నతుల చిత్రాలు, రుషులు, శాస్త్రవేత్తలు, త్యాగధనులు, అమ్మానాన్నల చిత్రాలను సంక్షిప్త సమాచారంతో పాటుగా ఇంట్లో అలంకరిస్తే మంచిది. అవన్నీ మన కుటుంబసభ్యులకు ఎన్నో గొప్ప అనుభూతులను అందిస్తాయి. కాబట్టి సింహాలు, పులులవే కాకుండా స్ఫూర్తిదాయకమైన ధీరోదాత్త దృశ్యాలు కూడా పెట్టడం అవసరం. గృహాలంకరణ.. శాస్త్రంలో ఒక భాగం. దాన్ని నిర్లక్ష్యం చేయకండి.
నిచ్చెన, వంతెనల కిందుగా వెళ్లడం మంచిది కాదని అంటారు. నిజమా?
– వై. కృష్ణస్వామి
కొన్ని నమ్మకాలు ఏదో ఓ కాలంలో పుడతాయి. కానీ, అవి కలకాలం కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా రైల్వే వంతెన కిందినుంచి జనం చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా రైలు వెళ్తుంటే.. అది వెళ్లే వరకూ ఆగి, ముందుకు పోతుంటారు. ఇందులో జాగ్రత్త ఉంది. పాత వంతెన ఏమవుతుందో అని, అలాగే రైలులోంచి వ్యర్థాలు పడతాయని జాగ్రత్త పడటం వేరు. నిచ్చెన కిందినుంచి కూడా అంటే.. ఎవరైనా దిగుతారేమో అనే జాగ్రత్త మాత్రమే. నేడు ఎన్నో వంతెనలు,ఫ్లై ఓవర్లు దాటిపోతేనే కానీ, ముందుకు సాగలేం. వేటి కిందినుంచి అయినా జాగ్రత్తగా దాటడం అవసరం కానీ, దాటిపోవడం దోషం మాత్రం కాదు. పూర్వకాలంలో మట్టి, చెక్కలతో మిద్దెలు వేసేవారు. రాళ్లతో, కర్రలతో వంతెనలు కట్టేవారు. వాటి నాణ్యతపట్ల అపనమ్మకం ఉండేది. ఆ మనోభావాల పరంపర నేటికీ మనల్ని వెంటాడుతున్నది. అంతేకానీ, అవన్నీ శాస్ర్తాలు కావు.
మాది పశ్చిమం రోడ్డు స్థలం. మాకు ఉత్తరం ద్వారం కావాలి. సింహద్వారం ఎటుపెట్టాలి?
– జి. శాంతకుమారి, చింతల్
మీకు సెంటిమెంట్‌గా ఉత్తరం కావాలని అనుకుంటే ఉత్తరం రోడ్డు ఉన్న ప్లాటే తీసుకోవాల్సింది. అయినా మీకు ఇబ్బంది లేదు. దిశలు బాగుంటే అందరికీ అన్ని వీధులూ శుభాలనే ఇస్తాయి. మీరు కట్టే ఇంటికి ఉత్తరం, పడమర, తూర్పు సింహద్వారాలు పెట్టి కట్టండి. అంటే మూడింటిలో ప్రధాన ద్వారం పశ్చిమమే అవుతుంది. ఇల్లును కూడా పశ్చిమం – వాయవ్యంలో డ్రాయింగ్ రూమ్ వచ్చేలానే కట్టండి. ఉత్తర ద్వారాన్ని కూడా మీరు యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఆ దిశలో ఫ్యామిలీ లాంజ్ ఏర్పాటు చేసుకోండి. ప్రకృతికి అనుకూలంగా మనం వెళ్లాలి. కారణం.. మన అంతర్ మనస్సు దానినే అనుసరిస్తుంది. కాబట్టి పశ్చిమం వీధిని అనుసరించక తప్పదు.
బెడ్ రూమ్‌లలో మెజనైన్ (డబుల్ రూఫ్) వేయొచ్చా? అదీ ఈశాన్యం పిల్లల గదిలో?
– ఆర్. రాముడు
కొందరు పిల్లల ఇష్టం కోసం లేదా స్థల ప్రభావం వల్ల పడక గదుల్లో డబుల్ స్లాబులు లేదా ఆఫ్ స్లాబ్ (మెజనైన్) వేస్తారు. పైన స్టడీ ఏరియా లేదా బెడ్ వేసి వాడుతున్నారు. రెండు పడకల ఇండ్ల నిర్మాణంలో ఈశాన్యం గదిలో ఇలాంటి మెజనైన్ నిర్మాణాలు పనికిరావు. అసలు ఈశాన్యం దిశ బెడ్ రూమే వద్దు అంటే.. అందులో ఈ తరహా నిర్మాణాలు మరీ దోషం. ఇంట్లో వాయవ్యం గదిలో లేదా పై మేడలోని ఆగ్నేయం గదిలో డబుల్ బెడ్ (బంకర్ బెడ్స్) నిర్మాణం జరుపుకోవచ్చు. ఆ బెడ్లు ఆ గదిలో పడమర గోడకు గానీ, దక్షిణం గోడకు గానీ తాకిస్తూ నిర్మించుకోవాలి. దీనికి మెట్లు కూడా సవ్యదిశలో వేయాలి. తూర్పు – ఉత్తరం గోడలవైపు వేయవద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | నిత్యం మంత్ర జపం వల్ల ఇంట్లో దోషాలు పోతాయా?