పెద్దగేటులో మరో రెండు గేట్లు పెట్టుకోవచ్చా? మాకు తూర్పు – దక్షిణం రోడ్లు ఉన్నాయి. ఈ విషయంలో వాస్తు ఏం చెబుతుంది?
– వి. హిమబిందు, కొండగట్టు
ఇంటికి ప్రధానమైన గేటు.. అది తొమ్మిది లేదా పన్నెండు అడుగులు ఉండాలి. అవసరాన్ని బట్టి ఈశాన్యం లేదా దక్షిణ-ఆగ్నేయం, ఉత్తరం- ఈశాన్యం ఇలా ఉచ్ఛమైన స్థానాల్లో గేట్లు పెట్టుకొని, దానిలో ఒక చిన్నగేటు (వికెట్ గేటు) పెట్టుకోవచ్చు. కార్లు, ట్రాక్టర్లు వచ్చినప్పుడు మొత్తం గేటు వాడుకోవచ్చు. మిగతా సమయాల్లో చిన్నగేటుతో రాకపోకలు సాగించవచ్చు. ఇవి రెండు కాకుండా.. చిన్నగేటు ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. దానిని అధికంగా వాడుతూ ఉంటారు కాబట్టి, తూర్పు గేటులో ఈశాన్యం రెక్కలో చిన్నగేటును ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణం వైపు పెట్టే పెద్దగేటులో చిన్నగేటు దక్షిణ-ఆగ్నేయం రెక్కలో పెట్టుకొని వాడుకోవాలి. ఇలా చిన్నగేట్ల వాడకం మంచిదే. అయితే ఒక పెద్దగేటు, రెండు చిన్నగేట్లు పెట్టకూడదు.
మా ఇంటి స్థలం దక్షిణం రోడ్డుమీదికి చొచ్చుకొని వచ్చింది. అందులో ఇల్లు కట్టొచ్చా? కానీ, కొంతమంది అలా కట్టడం వాస్తు విరుద్ధమని అంటున్నారు.
– బి. శ్రీలత, మేడిపల్లి
స్థలాలు – ఇండ్లు రోడ్లమీదికి చొచ్చుకు రావడం సరైన విధానం కాదు. వాస్తవానికి ఇండ్ల పారును సరిచేస్తూ రోడ్ల పంపకం జరిగితే ఇలాంటి పరిస్థితి రాదు. ఏ ఇల్లు అయినా, ఏ దిశకైనా రోడ్లు పారు పాటించడం అవసరం. మీకున్న రోడ్డును బట్టి మీ స్థలం దక్షిణం వీధిలోకి రావడం మంచిది కాదు. ఎలాగూ ఇల్లు కట్టలేదు కాబట్టి, రోడ్డుమీదికి ఎన్ని అడుగులు వచ్చిందో చూసుకొని, సరిగ్గా రోడ్డుపారుకు మీ దక్షిణం స్థలాన్ని రోడ్డులోకి వదిలేసి (కట్ చేసి), మిగతా స్థలానికి కాంపౌండ్ కట్టండి. దానిలో దక్షిణం ప్రహరీని అంటకుండా ప్రదక్షిణ స్థలం వదిలి, మీ ఇంటిని వాస్తుకు కట్టుకోండి. స్థలం పోతుందని కట్ చేయకుండా ఇల్లు కట్టవద్దు. కడితే వీధిపోటు వస్తుంది.
ప్రపంచంలోని డబ్బంతా స్విస్ బ్యాంక్‌లో ఉంటుందని అంటారు కదా! ఆ దేశానికి అంత వాస్తు బలం ఉందా?
– జి. శ్రీలక్ష్మి, సత్తుపల్లి
ఈ ఆలోచన నాకు కూడా చాలా ఏండ్ల క్రితమే వచ్చింది. భౌతికంగా నేను చూడలేను కానీ, దేశాల ఎల్లలు, వాటి టోపోగ్రఫీ పరిశీలించినప్పుడు స్విట్జర్లాండ్ విషయంలో ఎన్నో కీలక అంశాలు బయటపడ్డాయి. సహజంగా పీఠభూములు, ఎత్తయిన శిఖరాలు, సముద్రాలు, నదులు.. తప్పకుండా ఆయా దేశాల ఆర్థిక, మానసిక వికాసాల మీద ప్రభావం చూపుతాయి. జూరా పర్వతశ్రేణి స్విట్జర్లాండ్ దేశానికి పడమర – వాయవ్యం నుంచి నైరుతి దాకా ఉంది. అలాగే దక్షిణం అంతా ఆల్ఫ్స్ పర్వతాలు అమరి ఉన్నాయి. ఒక విధంగా ఈదేశం ఉచ్ఛమైన పర్వత శ్రేణుల మధ్య ఉంది. అలాగే రైన్ నది దక్షిణం పర్వత శిఖరాల్లో పుట్టి, ఉత్తరంవైపు సముద్రంలో కలవడం వల్ల ఉత్తర దిశ పల్లమైంది. తద్వారా సహజసిద్ధంగా ఆ దేశానికి వాయవ్యం లోపం ఉండినా తూర్పు – ఈశాన్యాలు పల్లమై ఐశ్వర్య స్థానంగా వర్ధిల్లి, కీర్తిని తెచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే దేశంలోని నగరాలు శాస్ర్తానికి కుదిరి ఉండటం కూడా విశేషమే. ఒక దేశం అభ్యున్నతికి, అథోగతికి దేశ సరిహద్దులు, దేశంలోని కేంద్ర ప్రభుత్వ పాలన, మందిరాలు, పాలకుల సౌధాలు తప్పక దోహదపడతాయనేది నిర్వివాదాంశం. అలా సహజసిద్ధ వాస్తుసిరి.. స్విట్జర్లాండ్‌కు ఉన్నదనే చెప్పాలి.
ఇంటి ఆవరణలో గూళ్లు కట్టి, పక్షులకు ఆశ్రయం ఇవ్వొచ్చా? అలా చేస్తే పాపమా? పుణ్యమా?
– కె. సత్యారావు, షాపూర్‌నగర్
మనిషి ఇష్టమైన పనులన్నీ చేస్తూ పోతుంటాడు. దానివల్ల ఆనందం కలుగుతుందని అనుకుంటాడు. కొన్నాళ్లు ఆ పని చేసి, మరో పనిమీద పడతాడు. ఏది చేసినా, దాని పూర్వాపరాలు ఆలోచించాలి. ప్రకృతి అన్ని జీవులకూ వాటివాటి జీవన పరిమితులకు అనుగుణమైన వనరులు సమకూర్చి పెట్టింది. భూమిమీద ఎన్నో జీవరాశులు తమ జీవితాన్ని సొంతంగా సాగిస్తున్నాయి. వాటిని ‘మనిషి మాత్రమే చేరదీయాలి. పెంచి పెద్ద చేయాలి’ అనే బాధ్యత ఎక్కడా నిర్దేశించలేదు. వాటిని ఎవరూ పోషించాల్సిన అవసరమే లేదు. కానీ, హింసించకుంటే చాలు. మీరు పక్షుల గూళ్లు తయారు చేయించి పెట్టాలనుకుంటే.. ఇంటి ఆవరణలో దక్షిణం పారు చూసుకొని తూర్పు – ఆగ్నేయంలో లేదా ఉత్తర – వాయవ్యంలో పడమర ఇంటి పారున అవసరమైన ఎత్తులో గూళ్లు కట్టండి. ఆ గూళ్లు అటు ఇంటిని కానీ, ఇటు ప్రహరీని కానీ తాకకుండా నిర్మించి, మీకు నచ్చిన పక్షులను పెంచుకోండి. ఇక పాపం – పుణ్యం అనేది.. పెంచినా పెంచకపోయినా వచ్చేదీ లేదు, పోయేదీ లేదు. అది మీ మనోగతం.
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678