బేస్మెంట్కు స్లాబ్ వేసి, కింద మట్టి నింపకుండా ఇల్లు కట్టుకోవచ్చా?
వి. చంద్రం, కేపీహెచ్‌బీ కాలనీ
స్థలం ఎగుడు దిగుళ్లుగా రాళ్లతో నిండి ఉన్నప్పుడు.. కొందరు కింద కేవలం పిల్లర్లు లేపి, దానిమీద గ్రౌండ్ లెవెల్లో ఒక స్లాబ్ వేసి, ఇల్లు కడుతున్నారు. ఎక్కువగా ఫామ్ హౌజ్‌లను ఇలా నిర్మిస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు. స్థలం అంటేనే.. మట్టి. కానీ ఆ మట్టినే చులకనగా చూస్తారు. చాలామంది పిల్లలకు అమ్మ కూడా చులకనగా కనిపిస్తుంది. కానీ, ఆ తల్లి కడుపునే పుట్టామన్న విషయం మరిచిపోతారు. మనిషి కూడా ఈ మట్టి గర్భం నుంచే ఉద్భవించాడు. బేస్మెంట్ను మట్టితో నింపకుండా ఇల్లు కట్టుకొని, గొప్పగా ఉండాలనుకోవడం.. ఎద్దు నుంచి పాలు ఆశించినట్లే ఉంటుంది. మీ ఆలోచనలు తప్పు. ఇంటి ఫుటింగ్ మార్కులో సారవంతమైన మట్టిని నింపి, దానిమీద మనం నివసించేలా ఫ్లోరింగ్ నిర్మించుకోవాలి. అన్నీ సక్రమంగా తెలుసుకొని ఇల్లు కట్టుకోండి. మీరు బాగుండాలి కదా!
ఐలాండ్ కిచెన్‌కు వాష్ బేసిన్ (సింకు) ఎక్కడ పెట్టాలి? మధ్యలో పెట్టొచ్చా?
వి. అనుపమ, బైరామల్‌గూడ
వంటగదిలో తూర్పున, ఆగ్నేయంలో పొయ్యి కాకుండా.. గది మధ్యలో ప్లాట్‌ఫామ్ దీర్ఘచతురస్రంగా కట్టుకొని వంట చేస్తుంటారు. ఆ ప్లాట్‌ఫామ్ చుట్టూ తిరిగే అవకాశం తప్పక ఉండాలి. ఆ విధంగా కిచెన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు తూర్పు గోడకు ఎప్పటిలాగా ప్లాట్‌ఫామ్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే.. దానికి ఈశాన్యంలోనే వాష్ బేసిన్ పెట్టాలి. లేదూ.. గది విశాలంగా, ఖాళీగా ఉండాలని అనుకుంటే, వంటగదిలోని ఆగ్నేయ భాగంలో కూడా కేవలం వాష్ బేసిన్ ఏర్పాటు చేసుకోవచ్చు.. గట్టు లేకుండా. ఐలాండ్ కిచెన్‌కు సింక్ పెట్టవద్దు. పైగా అది స్టవ్ పెట్టుకునేంత మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు స్థలం ఎక్కువగా ఉండి, ఐలాండ్ ప్లాట్‌ఫామ్ పెద్దగా చేసుకుందామని అనుకున్నా.. దానికి సింకు నిషేధం.
స్టడీ రూమ్‌ను ఈశాన్యంలో పెట్టి, తూర్పు మొత్తం బెడ్ రూమ్‌గా మార్చవచ్చా?
సీహెచ్. కిరణ్, కొంపల్లి
సందు వస్తుందనీ, స్థలం మిగులుతుందనీ.. ఒక గోడకు టేబుల్, బెంచీ వేసి ‘స్టడీ రూమ్’ అని పేరు పెట్టవద్దు. దానికంటూ ప్రత్యేకంగా ఓ స్థలం ఏర్పాటు చేసుకోవాలి. మీ ప్లాను చూశాను. ఈశాన్యంలో పొడుగ్గా స్టడీ రూమ్ కడుతున్నారు. అది సరికాదు. ఒక నలుచదరంగా.. ఈశాన్యంలో గదికి స్థలం కేటాయించి, దాని పక్కన ఆగ్నేయ భాగంలో మరో బెడ్ రూమ్ కుదుర్చుకోండి. పైగా ఈశాన్యం గదికి కూడా.. తూర్పు బాల్కనీలోకి వెళ్లేలా తప్పక ద్వారం ఉండాలి. ఆ గదిని చదువుల గది అనడం సరైనది. పిల్లలు, పెద్దలు ఎవరైనా.. చదువుకునే స్థానాన్ని ఒక తంతులా కాకుండా, ఆహ్లాదంగా నిర్మించాలి.
దక్షిణం బాల్కనీ ఉంది. అది ఇంటి ఫ్లోరింగ్ కంటే కిందికి ఉంది. దానిని ఎన్ని అంగుళాల మేర నింపాలి?
కె. రాజశేఖర్, బుద్వేల్
దక్షిణం ఎత్తు – ఈశాన్యం పల్లం.. ఇది జనంలో బాగా నాటుకుపోయింది. ఇది నిజమే అయినా.. అన్నిచోట్లా వర్తించదు. ఇంటికి దక్షిణం పశ్చిమం బాల్కనీలు వచ్చినప్పుడు అవి ఇంటి ఫ్లోరింగ్ కన్నా తక్కువ ఎత్తుగా అంటే.. పల్లంగానే ఉండాలి. దక్షిణం కదా.. పడమర కదా.. అని ఎత్తు చేసుకోవద్దు. అదే విధంగా తూర్పు – ఉత్తరం బాల్కనీలు కూడా డౌన్గానే ఉండాలి. దక్షిణం బాల్కనీ ఇంటి పొడవుతో సమానంగా ఉన్నప్పుడు ఇంటి ఫ్లోరింగ్‌ను పట్టించుకోకుండా.. దక్షిణ నైరుతి నుంచి తూర్పు (ఆగ్నేయం) వరకూ కేవలం ఆ బాల్కనీ మాత్రమే తక్కువ వాలుతో ఉంటే సరిపోతుంది. అలానే పడమర బాల్కనీ కూడా పశ్చిమ నైరుతి నుంచి ఉత్తరం వరకు వాలుగా చేసుకోవాలి. మీరు మీ దక్షిణం బాల్కనీ నింపడం మానుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?