మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి? కొంతమంది తీసేయమని చెబుతున్నారు.
– సీహెచ్. కృష్ణప్రసాద్, షాద్నగర్
రైతు కుటుంబాలవారు దాదాపుగా వ్యవసాయ క్షేత్రంలోనే జీవితం గడుపుతూ ఉంటారు. ఇలాంటి గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవడం ఎంతో తెలివైన పని.
ఎంతోకొంత పొదుపు కూడా. ఇన్నిన్ని వేలు పెట్టి గ్యాస్ సిలిండర్లు కొనేకంటే.. ఎటూ పశువుల పెంపకం ఉంటుంది కాబట్టి, గోబర్ గ్యాస్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. రోజూ పేడ పుష్కలంగా వస్తూ ఉంటుంది కదా! మీరు పొలంలో ఇంటిని నిర్మించుకొని దానికి కాంపౌండ్ కట్టుకోవాలి. ఆ ప్రహరీ లోపలి ఆవరణలో తూర్పు భాగంలో అటు ఆగ్నేయం, ఇటు ఈశాన్యం వదిలివేసి మధ్యలో ప్లాంటు వేసుకోవచ్చు. అలాగే ఉత్తరం దిశలో కూడా మధ్య భాగంలో గొయ్యి తీసి, గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ గోతులు ఇంటి తూర్పు ద్వారంలో కానీ, ఉత్తర ద్వారంలో కానీ రాకుండా అటూ, ఇటూ జరుపుకొని నిర్మాణం చేసుకోవాలి.
గదికి ఒక ద్వారం పెట్టొచ్చా? లేదా రెండు ద్వారాలు, రెండు కిటికీలు తప్పకుండా ఉండాలా?
– ఎస్. దేవమ్మ, ఉప్పల్
చిన్న గదులకు, స్టాఫ్ రూములకు ఎక్కువ ద్వారాలు అవసరం పడవు. అలాంటప్పుడు ఒక్క ద్వారం పెట్టడం దోషమేమీ కాదు. ఒకటికంటే.. రెండు ద్వారాలు బలమనో, సంఖ్యాశాస్త్రం కోసమో పెట్టాల్సిన అవసరం లేదు. ద్వారం పెట్టడం వేరు.. కిటికీలు పెట్టడం వేరు. ఆ గది ఎవరిదైనా కావచ్చు. దాన్ని ఎందుకు వాడినా.. రోజంతా గాలి, వెలుతురు అవసరం. అందుకు ఒకటి మాత్రమే, రెండు మాత్రమే.. కిటికీలు ఉండాలనే నియమం లేదు. అవసరమైనంత మేర వెలుతురు రావడానికి రెండు, నాలుగు .. ఎన్ని కిటికీలు అయినా పెట్టుకోవచ్చు. ఒక కిటికీ సరిపోతుందని అనుకుంటే.. ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు. ఒంటి సంఖ్య కీడు చేస్తుందనే భావన వద్దు. లేనిపోని అను మానాలతో గదిని చీకటిమయం చేసుకోవద్దు.
కింది పోర్షన్కు వీధిపోటు ఉన్నప్పుడు పై పోర్షన్కు మారితే మంచిదేనా? అక్కడా వీధిపోటు వర్తిస్తుందా?
– వి. సంజయ్, చింతల్
వీధిపోటు పడుతుంది అంటేనే.. ఆ ఇల్లు ఒంటరిది, నడవలేనిది, నిర్భాగ్యమైనది అని చెప్పుకోవాలి. పల్లెటూళ్లలో వీటి ప్రభావాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. దక్షిణం, నైరుతి, పడమర వీధిపోట్లు ఉన్న ఇంటి గేట్లు మూసేసి, ఇండ్లు పాతబడిపోయి ఉంటాయి. వీధిపోటు ఉన్న ఇల్లు వీధిలో పడే నీళ్లలాగా వృథాగా మిగిలిపోతుంది. పిడుగు పడిన మర్రిచెట్టు కొన్నాళ్లు నిలబడ్డట్లు కనిపించినా.. అది ఎప్పుడు కూలిపోతుందో ఎవరికీ తెలియదు. అలానే, వీధిపోటు పడే ఇంటిలో కింద ఉన్నా, పైన ఉన్నా దాని ప్రత్యక్ష ప్రభావం కొంతమేర తగ్గినా.. ప్రమాదం నుంచి మాత్రం పూర్తిగా రక్షణ మాత్రం పొందలేం. మీరు ఇల్లు మారండి.
కార్ల రాకపోకల కోసం కాంపౌండ్ కట్టకుండా ఒకవైపు ఓపెన్ పెట్టుకోవచ్చా?
– మధుసూదన్ రావు, కొంపల్లి
అపార్ట్మెంట్కైనా, ఇంటికైనా కాంపౌండు రక్షణాంశం. దానిని కట్టకపోవడం అనేది ఆ ఇంటికి వాస్తు దోషమే అవుతుంది. కార్లు ఎక్కడినుంచి అయినా తీయడానికి రోడ్డు దిక్కు కాంపౌండ్ కట్టకుండా వదులుతుంటారు. మీది ఏ దిక్కో రాయలేదు. దక్షిణం, పడమర దిశలకు కాంపౌండు కట్టడం చాలా అవసరం. అటు దిక్కు రోడ్డు ఉన్నా కూడా.. సరే. కాంపౌండు ఉండాల్సిందే. అవసరమైతే రెండు గేట్లు పెట్టుకోవాలి. అంటే.. దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణం ఆగ్నేయంలో, అలాగే దక్షిణం మధ్య భాగంలో రెండు గేట్లు పెట్టుకొని వాడాలి. దక్షిణ – పశ్చిమ, వాయవ్య – ఆగ్నేయ భాగాల్లో రాకపోకలు లేని ప్రహరీ నిర్మాణం.. ఆ నిర్మాణవాసులకు ఎంతో మేలు చేస్తుంది.