Vasthu Shastra | సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అవన్నీ చూడాలా?
– సీహెచ్. మధు, బోడుప్పల్
ఇంటిని బిల్డర్ వద్ద కొనేటప్పుడు ఆ ఫ్లాట్ ఏరియా (విస్తీర్ణం)ను కొలిచే పద్ధతులు ఇవన్నీ! ఇంటిని కేవలం ఎలివేషన్ చూసి కొనకూడదు. మనం తీసుకునే ఇల్లు.. మన అవసరాలకు సరిపడేదేనా? ఆ ప్రాంతం జీవనం సాగించడానికి అనువైనదేనా? శాస్త్రబద్ధంగా కట్టిందేనా? నాణ్యత, చట్టబద్ధత ఉన్నాయా?.. ఇవన్నీ తప్పకుండా చూసి ఇల్లు (ఫ్లాట్) ఫైనల్ చేయాలి. ఒక అపార్ట్మెంట్లో మనం ఉండే గృహంతోపాటు మెట్లు, లిఫ్ట్, కారిడార్లు, కొన్నిచోట్ల క్లబ్‌హౌజ్, జిమ్ మొదలైనవీ ఉంటాయి. అవన్నీ ఉమ్మడిగా వాడుతుంటారు. ఆ ఇంటి విస్తీర్ణంతోపాటు వీటన్నిటి ఏరియాను కలిపి మనకు అమ్ముతారు. అదే.. సూపర్ బిల్డప్ ఏరియా. సేలబుల్ ఏరియా అని కూడా అంటారు. కార్పెట్ ఏరియా అనేది మనం ఇంటిలో వాడే స్థలం. గోడలు కాకుండా, గదుల లోపలి విస్తీర్ణం. పూజగది, కిచెన్, హాల్, బెడ్రూమ్స్.. అన్నీ దీని కిందికి వస్తాయి. ఇవికాకుండా, బాల్కనీలు, బయటి గోడలు కలిపి బిల్డప్ ఏరియా అనికూడా లెక్కిస్తారు. అన్నీ చూశాకే మనం అంగీకరించాలి.
కిచెన్‌కు, ఇంటి ఈశాన్యం ద్వారానికి మధ్య మెట్లు ఉన్నాయి. అలా ఉండొచ్చా?
– టి. కృష్ణారెడ్డి, తుక్కుగూడ
అంటే.. తూర్పులో మెట్లు కట్టారు. చాలామంది మెట్లు గొయ్యి కిందికి వస్తాయనో లేదా అవి దిగేవే కదా అనో.. ఈశాన్యం, తూర్పు భాగం మెట్లు వేస్తారు. అది తప్పు. తూర్పులో ఇంటి ఆవరణ ఉండాలి. అది ఖాళీగా ఉన్నప్పుడే తూర్పుభాగం ఇంటి గర్భంతో కలిసి వైభవోపేతం అవుతుంది. ఇంటి శరీరంలో తూర్పు-ఉత్తరం, రెండు ఈశాన్య భాగాలు చాలా అపురూపం. అవి సున్నిత స్థానాలు కూడా. వాటిని నిర్మాణంతో నింపవద్దు. అలాగే, పైన మేడకు తూర్పు బరువు అవుతుంది. కాబట్టి వాటిని తొలగించండి. మీరు తూర్పులో మెట్లు వేశారు అంటే.. మీది డూప్లెక్స్ ఇల్లు. కాబట్టి, వెంటనే ఆ మెట్లను పడమరకు లేదా దక్షిణానికి మార్చండి. దానికి అభిముఖంగా సీత్రూ ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మీ ఇల్లు గొప్పగా ఉంటుంది.
మా ఇంటి ముందు స్థలం ఉంది. ఇంటి కింద కూడా కొంత స్థలం ఉంది. రెండు సంపులు కావాలని అనుకుంటున్నాం. వాటిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి?
– కావేరి లీల, సాగర్
సెల్లార్ (స్టిల్ట్) వదిలి మీరు ఫస్ట్‌ఫ్లోర్‌లో ఇల్లు కట్టారు. ఇంటి నిర్మాణం కింద స్థలం ఉన్నా కూడా అందులో పిల్లర్లు వచ్చి ఉంటాయి. లేదా కారు పార్కింగ్ కోసం దాన్ని వాడుతూ ఉంటారు. కాబట్టి, నీటి సంపును ఇంటి నిర్మాణ భాగం వదిలేసి.. బయటి ఏరియాలో కట్టడమే మంచిది. ఇంటి ముందు స్థలం అంటే.. ముఖద్వారం అనేది కాకుండా, ఇంటికి తూర్పు-ఉత్తర భాగాలను గుర్తించాలి. దక్షిణం-పశ్చిమం కూడా ముఖద్వారాలు ఉంటాయి కదా! ఎక్కడ నీళ్ల సంపు కట్టినా ఇంటి ద్వారం దానిలోకి పడకుండా కట్టాలి. ఇల్లు మీద కట్టినా కూడా.. రాబోయే రోజుల్లో కిందిభాగంలో ఇల్లు కడతామన్న భావనలో సింహద్వారంలో పడకుండా.. తూర్పు – ఈశాన్యం లేదా తూర్పులో, ఉత్తర – ఈశాన్యం లేదా ఉత్తరంలో మంచినీళ్ల సంపును కట్టుకోవాలి.
దక్షిణం గేటు ఇంటి సింహద్వారం కన్నా ఎత్తుగా పెట్టాలి కదా? బేస్మెంట్ ఎంత పెంచాలి?
– బి. బృంద, ధర్మపురి
లేదు.. దక్షిణం దిశ ఎత్తుగా ఉంటే మంచిదని, పడమర – నైరుతి ఎత్తు శ్రేష్ఠం అని సొంత వైద్యం చేసుకోవద్దు. దాని లెక్కలు దానికి ఉంటాయి. దక్షిణం గేటు అంటున్నారు అంటే.. మీది దక్షిణం ఇల్లు. అప్పుడే ఇంటికి దక్షిణం-ఆగ్నేయంలో ప్రధాన ద్వారం వస్తుంది. ఇంటి బేస్మెంట్ రోడ్డుకన్నా కనీసం మూడు అడుగులు ఉండాలి. అంటే, రోడ్డు కన్నా లోపలి ఆవరణ ఒకటిన్నర అడుగు ఎత్తుగా, ఇంటి ఫ్లోరింగ్ దానికన్నా మరో ఒకటిన్నర అడుగు ఎత్తు తప్పక ఉండాలి. ఈ లెక్కలో గేటు.. అది దక్షిణం అయినా, పడమర అయినా రోడ్డుకన్నా ఎత్తుగా ఉండేలా ర్యాంప్ వేసుకొని వాహనాలకు అనుకూలంగా గేటు నిర్మాణం చేయాలి. ఇదీ విధానం. రోడ్లు ఎటువైపు ఉన్నా.. ఇంటి బేస్మెంట్ (పీఠం) ఎత్తుగానే ఉండాలనేది ప్రధాన అంశం. అన్నీ తెలుసుకొని కట్టుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | బేస్మెంట్కు స్లాబ్ వేసి, కింద మట్టి నింపకుండా ఇల్లు కట్టుకోవచ్చా?
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?