Vasthu Shastra | రాజులు తమ కోటలను వాస్తు ప్రకారం కట్టేవారు కదా? కానీ, ఏ రాజుల గాథలైనా యుద్ధాలే ! ఇలా ఎందుకు? పాలకుల శాస్త్రం వేరుగా ఉండేదా?
– కె. సిద్ధార్థ, గజ్వేల్
రాజులైనా.. మంత్రులైనా.. మనుషులే కదా! వాళ్లకు ఉండే భయాలు, ద్వేషాలను బట్టి, వాళ్ల జీవితాలు ఉండేవి. కోటల నిర్మాణంలో రాజులు వాస్తు పాటిస్తూనే.. శత్రురాజులు లోనికి చొరబడకుండా అదనంగా అనేక నిర్మాణాలు చేపట్టేవారు. వాళ్ల నిర్మాణంలో భద్రత ప్రధాన అంశం. కోట నిర్మాణానికి ఎత్తయిన ప్రదేశాలను ఎంచుకోవడం; ఎక్కడ పడితే అక్కడ రాతి గోడలు కట్టుకోవడం; ఈత కొలనులు, భూగర్భ గృహాలు నిర్మించడం; కోట చుట్టూ కందకాలు తవ్వుకోవడం; కొండల మధ్య రాణివాసాలను ఏర్పాటుచేయడం.. ఇలాంటి దోషాలు అనేకం కనిపిస్తాయి. కొన్ని రాజ్యాలు గొప్పగా వెలిగినా, కొన్నేళ్లకు అవి పతనం కావడంలో వాస్తు వక్రతలు ఎంతో ప్రభావం చూపాయన్న మాట వాస్తవం. ఉదాహరణకు.. మహోన్నత చరిత్ర కలిగిన విజయనగర పతనం వెనుక కారణాలు ఎన్ని ఉన్నా.. వాస్తు లోపాలు కూడా లేకపోలేదు. స్థలం మొత్తంలో రాణివాసానికి ఈశాన్యంలో ఎత్తయిన గుట్ట; లోటస్ మహల్‌కు ఆగ్నేయంలో బావి; తూర్పు దిక్కున రాత్రిపూట పహరా కాయడానికి ఎత్తయిన నిర్మాణం; ఆవరణానికి నైరుతిలో లోతైన స్థలంలో వంటశాల; హంపీలోని హజార రామస్వామి గుడికి పడమరలో బావి; గుడి ఆవరణలోని ఈశాన్యంలో యజ్ఞశాల; రాణి వాసాలు, లోటస్ మహల్ ఉన్న ఆవరణానికి ఉత్తరం ప్రహరీ; ఇంకా.. ఈశాన్యం తెంపుకొంటూ పలు నిర్మాణాలు చేపట్టారు. ఉత్తరంలో గుట్ట, దక్షిణం, ఆగ్నేయం పల్లం. ఎంతో పేరొందిన భువన విజయ భవనానికి ఉత్తరాన గుట్టలు.. ఇలా ఎన్నో రాజ భవనాలు, వాళ్లవాళ్ల అవసరాల కోసం, భద్రత కోసం వాస్తు చూడకుండా నిర్మించిన ఆపద్ధర్మ నిర్మాణాలు అనేకం. అవే విజయనగర జయాపజయాలను ప్రభావితం చేశాయి. అందుకే, రాజుల కోటలు ఎంత అజరామరమో.. వారి అంతఃపుర, రాచరిక చరిత్రలు అంత గందరగోళం.
ఒకే ఇంట్లో ఒకరు ఉంటే ఒక రకం ఫలితం, మరొకరు ఉంటే వేరే ఫలితాలు ఉంటాయా? ఇల్లు ఒకటే కదా.. ఒకే ఫలితం ఉండదా?
– ఎం. సంపత్, కొత్తపేట
మంచి ప్రశ్న. ఇల్లు ఫలితాన్ని ఇవ్వదు. ఆ ఇంట్లో యజమాని మనోవాంఛ ఫలిస్తుంది. అంటే.. ఫ్లయిట్ ఎక్కి అందరూ ఒకే పనికోసం పోరుకదా!? ఎవరి పని వారిది. ఇల్లు కూడా అంతే! నా కోరిక, నా లక్ష్యం వేరు. మీ విజన్.. ఇతరులది కాలేదు. కాబట్టి ఎవరు ఆ ఇంట్లో ఉంటే.. వారి సంకల్ప బలాన్నే బలపరుస్తుంది. ఆమోదిస్తుంది. ఇల్లు కార్యస్థానం మాత్రమే. కార్యసాధకుడు ఆ ఇంట్లోని వ్యక్తి. రేడియో.. శాస్త్రబద్ధంగా చక్కగా తయారైంది. దానిని చెన్నైకి తీసుకెళ్తే.. తమిళ గీతాలు వినిపిస్తుంది. బెంగళూరు తీసుకెళ్తే.. కన్నడంలో పాడుతుంది. రేడియో మారదు కదా! ఇల్లు కూడా అంతే! ప్రకృతిలో ఉన్న గొప్ప అనుకూలత అదే. నిన్ను గట్టెక్కించే ఫలితం అందుతుంది అంటే.. నీ మైండ్‌సెట్‌ను బట్టే కదా! నీ శ్రమ, నీ ఫలితాలు. కాబట్టి.. వ్యక్తిని బట్టి వారి వారి ఫలితాలు ఉంటాయి.
కిచెన్ పైభాగంలో పడకగది దోషం కాదా?
– కె. చంద్రమణి, కొలనుపాక
నీళ్ల మీద నిప్పు తప్పు అవుతుందేమో అనే సంశయం చాలా మందికి కలుగుతుంది. కానీ, ఇబ్బంది లేదు. కింది పోర్షన్లో ఆగ్నేయంలో వంటగది పెట్టి, పై భాగంలో బెడ్రూమ్ నిర్మించుకోవడం వాస్తు దోషమని పూర్వికులు భావించేవారు. అది భౌతికపరమైన దృష్టేకానీ, శాస్త్ర సూచన కానేకాదు. అంతస్తు మారితే అవకాశాలు మారుతాయి. ఒకప్పుడు మట్టి మిద్దెలు ఉండేవి. కింద పొయ్యిపెట్టి, పెద్ద వంటలు చేస్తుంటే.. ఆ కట్టెల పొయ్యికి ఆ మట్టి కప్పు వేడెక్కేది. చాలా అసౌకర్యంగా ఉండేది. సరిగ్గా నిద్రపట్టదని అలా చెప్పేవారు. కానీ, నేటి నిర్మాణ శైలి ప్రకారం, అది దోషం కాదు. ఇందులో ఒక విశేషం ఏమిటంటే.. ఆ పై మేడలోని ఆగ్నేయం పడక గది ఆడపిల్లలకు శుభదాయకం అన్నది మరువకూడదు. అతిథి కోసం కూడా వాడుకోవచ్చు.
మా ఫ్యాక్టరీ స్థలానికి ఆగ్నేయం పెరిగింది. దానిని వేరుచేసి వాడుకోవచ్చా? స్థలం ఎక్కువగా ఉంటుంది.
– బి. శ్రీలత, చింతల్
అటు వాయవ్యం పెరిగినా, ఇటు ఆగ్నేయం పెరిగినా దానిని సరిగ్గా మన ప్రధాన స్థలాన్ని మెట్నకు (మూలమట్టానికి) చేసి, ఎంత కోణంగా పెరిగితే.. అంత వదిలివేయాలి. మీరు మీ ప్లాంటుకు దక్షిణ – ఆగ్నేయం పెరిగింది అంటున్నారు. ఆ స్థలం ఎక్కువగా మిగిలి ఉంటే.. అది దక్షిణం – ఆగ్నేయం కాబట్టి, దానిని శాస్త్రబద్ధంగా సవరించి, వాడుకునే అవకాశం ఉన్నది. అయితే దానిని వేరుచేశాక ఇతరుల పేరుతో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసి, దానిని కూడా తొంభై డిగ్రీలకు సరిచేసి, అందులో తప్పకుండా నిర్మాణం చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ స్థలం మిగిలిపోతుంది అంటున్నారు. కానీ, పెద్ద స్థలం నుంచి ఆ స్థలంలోకి గేటు పెట్టుకొని, రాకపోకలు చేయవద్దు. అయితే, ఆ పెరిగిన స్థలాన్ని స్టాఫ్ క్వార్టర్ల కోసం లేదా సబ్ స్టేషన్ మొదలైన ఇతర నిర్మాణాలకు వాడుకోవచ్చు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | బేస్మెంట్కు స్లాబ్ వేసి, కింద మట్టి నింపకుండా ఇల్లు కట్టుకోవచ్చా?
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?