Vasthu Shastra | ఇంట్లో పెట్టే వస్తువులలో కూడా మంచివి, చెడువి అన్నది చూసుకోవాలా?
– బి. కృష్ణమూర్తి, కొంపెల్లి
అవును. మనసు దేనిమీదికైనా వెళుతుంది. మనసు చాలా శీఘ్రంగా.. సెకన్లో పదో భాగంలో ప్రతిస్పందిస్తుంది. అది చాలా సున్నితం. శక్తిమంతం. అద్భుతం. అలానే, అత్యంత అల్పమైనది కూడా. దీనిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా పిల్లలు.. ఇంట్లో వస్తువులకు, బొమ్మలకు, వాతావరణానికి చాలా తీవ్రంగా ప్రభావితం అవుతారు. వాళ్లదే కదా భవిష్యత్తు. ఇంట్లో ఒక పులి తల, గోడకు వేలాడే కత్తి, తుపాకి, గొడ్డలి, బాణం.. ఇవన్నీ ఊరికే ఉండవు. కదలవు కానీ, మనలో చాలా కదలికలకు మూలం అవుతాయి. ఆయుధాలు చూస్తూ ఉంటే, వాటిని పట్టుకోవాలని అనిపిస్తుంది. పట్టుకున్నాక, ప్రయోగించాలనీ అనిపిస్తుంది. చేతిలో సుత్తి పట్టుకొని తిరిగేవాడికి దేనిని చూసినా.. కొట్టాలని అనిపిస్తుంది. కత్తెర పట్టుకొంటే.. కత్తిరించాలని అనిపిస్తుంది. కత్తి పట్టుకుంటే.. పొడవాలని అనిపిస్తుంది. కర్ర పట్టుకుంటే.. ఎవరి తలమీదనో కొట్టాలని అనిపిస్తుంది. ఇవన్నీ మనిషిలో రజో గుణాన్ని, క్రౌర్యాన్ని పెంచుతాయి. మనసును చంచలం చేస్తాయి. హింసాత్మక స్వభావం అలవాటు అవుతుంది. ఇంట్లో ప్రధానంగా స్ఫూర్తిదాయకమైన మహాత్ముల, దేవతల బొమ్మలు, సాత్విక దృశ్యాల ఫొటోలు పెట్టుకోవాలి. మన వంశంలోని గొప్ప వ్యక్తులు, సమరయోధుల ఫొటోలు పెట్టుకున్నట్లయితే.. ఎన్నో అంశాలు మనకన్నా గొప్పగా మన పిల్లల మనసుల్లో ముద్ర వేసుకుంటాయి. వారి మనోశక్తిని మేల్కొలుపుతాయి. నాలుగు మంచి మాటలు రాసిన బోర్డులను ఇంటి గోడలకు పెడితే.. వాటిని చదివి పిల్లలు స్ఫూర్తి పొందుతారు. ఇంటి ఇంటీరియర్ అనేది.. అర్ధనగ్న చిత్రాలతో కాదు, చిత్తాన్ని చిగురింపజేసేలా స్ఫూర్తిమంతంగా, శక్తిమంతంగా ఉండాలి.
మాకు ఉత్తరం ఖాళీ లేదు. దక్షిణం చాలా స్థలం ఉన్నది. ఇల్లు దక్షిణంలో కట్టుకోవచ్చా?
– బి. స్వాతి, గోల్కొండ
ఉత్తరం వైపు ఖాళీ వదలకుండా హద్దుమీద ఇల్లు కట్టడం మంచిది కాదు. దక్షిణం ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి.. దానిని ఇతరులకు అమ్ముకోవచ్చు. లేదా ఉన్న ఇల్లు ఎలాగూ బాగాలేదు, కొత్తది వాస్తుకు కట్టుకోవాలి అనుకుంటే.. ఉన్న ఇంటి నుంచి ముందు ఖాళీ చేసి వెళ్లండి. పాత ఇల్లు తీసి వేయండి. ఒక మంచి ముహూర్తం చూసుకొని భూమిపూజ చేయండి. స్థలం శుద్ధి చేసిపెట్టి మొత్తం ఖాళీ స్థలంలో ఉచ్ఛమైన భాగంలో శాస్త్ర సమ్మతమైన నక్ష (ప్లాను) తయారు చేయించుకొని, కొత్త ఇల్లు కట్టండి. లేదూ.. ఉన్న ఇల్లు బాగుంటే.. దక్షిణ స్థలం తీసేసి, ఉన్న ఇంటికి ఉత్తరం ఖాళీ వచ్చేలా సవరించుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా వాస్తుపరంగా అనుకూలమైన నివాసం ఉండేలా చూసుకోండి.
రైల్వే కట్టకు దగ్గర్లో స్థలం కొనవచ్చా? కొన్నిచోట్ల ఇండ్లు ఉంటాయి కదా?
– కె. రాజబోస్, ఆలేరు
స్థలం ఎక్కడ కొనాలనేది ముఖ్యం. అయితే, ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రధానంగా.. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం లేనటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి. జీవితానికి అదొక ప్రథమ విజయం. మీరు అన్నట్లు రైల్వేలైన్ దగ్గర శబ్ద కాలుష్యం చాలా ఉంటుంది. అలా అని రైలుకట్ట దగ్గర ఇండ్లు లేవా? అనుకోవద్దు. ఎవరి స్థితిగతులు వారివి. మీకు అవకాశం ఉంది కాబట్టి, మీ ఎంపిక మార్చుకోండి. ఒకరితో పోల్చుకోవద్దు. మీరు ఇంకా ఇల్లు కట్టనప్పుడు తెలిసితెలిసీ అలాంటి స్థలాన్ని ఎందుకు ఎంచుకోవడం? మరో మంచి స్థలాన్ని చూసుకోండి. ముఖ్యంగా శబ్దం చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దేని ప్రభావం దానిదే!
వాయవ్యం స్థలం కొనాలా? నైరుతి స్థలం కొనాలా? రెండిటిలో ఫలితాలు ఎలా ఉంటాయి?
– బి. అనుపమ, తుంగతుర్తి
రెండు స్థలాల్లోనూ ఇంటిని శాస్త్రపరంగా కడితే మంచి ఫలితాలు ఇస్తాయి. మీ ఇష్టానుసారం కడితే.. ఏ స్థలం అయినా ఇబ్బందులే కలిగిస్తుంది. వాయవ్యం బ్లాకులో ఇల్లు కడితే.. పడమర ప్రధానమైన రోడ్డు ఉంటే, దానికి ముఖద్వారం చేసి కట్టాలి. అక్కడ ఉత్తరం వీధి గొప్పదిగా అనిపించినా అది ప్రధానమైన రోడ్డు కాదు. కారణం.. ఆ వీధిలో ఆ రోడ్డు ఇల్లు స్థానం కిందికి ఉంటుంది. కాబట్టి, పశ్చిమం గేటు పెడుతూ ఉత్తరం కూడా ఈశాన్యంలో ఒక గేటు పెట్టాలి. ఇంటికి కూడా ఉత్తరం – పడమర – తూర్పు ప్రధాన ద్వారాలు తప్పకుండా పెట్టాలి. ఇక నైరుతి స్థలంలో కూడా ఏ రోడ్డు ప్రధానమో చూసుకొని ఆ రోడ్డు వైపునకు ప్రధాన సింహద్వారంతో ఇల్లు కట్టాలి. ఈ బ్లాకులో దక్షిణం లేదా పడమర కింద షాపులు కట్టి, మీద ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ రెండు బ్లాకులలో వాయవ్యం బ్లాకు మొదట వస్తుంది. నైరుతి బ్లాకు రెండోది అవుతుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?