Vasthu Shastra | ఇంట్లో మొదటిసారి పుట్టిన బాబుకు సూర్యదర్శనం, చంద్రదర్శనం చేయించాలని అంటారు. ఎందుకు? ఎప్పుడు చేయాలి?
– పి. శ్రీలత, మోత్కూర్
బాబుకే కాదు.. పాపకైనా సూర్య, చంద్ర దర్శనాలు అవసరం అవుతాయి. మొదటిసారి ఇంట్లో పుట్టిన శిశువు (ఆడ, మగ) ఎవరైనా.. ఎందరు పుట్టినా సూర్యుడి దర్శనం చాలా అవసరం. సూర్యదర్శనం అంటే.. ఉదయపు నీరెండలో, సూర్యరశ్మిలో శిశువును పట్టుకొని కూర్చోవాలి. తద్వారా సూర్యుని వెలుగులు శిశువు మీద పడి, విటమిన్-డి అందుతుంది. పురిటి బిడ్డను ఎన్నో బాలరోగాల నుంచి కాపాడుతుంది. ఈ సంప్రదాయంలో శిశువుల ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమని భావించాలి. తల్లీబిడ్డలను నెలల తరబడి ఏ చీకటి గదిలోనో, ఇంట్లో ఏ మూలనో ఉంచకుండా, స్వచ్ఛమైన గాలి, వెలుతురులోకి తెచ్చినప్పుడే ఆ శిశువు, తల్లి ఆరోగ్యాన్ని పొందుతారు. అలాగే చంద్రదర్శనం కూడా. అంటే.. శిశువు పుట్టిన తరువాత వచ్చే తొలి పౌర్ణమి రోజున వెన్నెల పడేచోట శిశువు, తల్లి కూర్చోవడం వల్ల ఆరోగ్యసిద్ధి, ఆనందసిద్ధి కలుగుతుంది. ఈ కార్యాన్ని తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి చేయడం మంచిది. మందులకు లొంగని ఎన్నో సూక్ష్మక్రిములు సూర్య-చంద్ర వెలుగుల స్నానాల వల్ల తొలగిపోతాయి. చంద్రుడు మనఃకారకుడు. అంటే, హృదయ శుద్ధి కూడా కలుగుతుంది అంటారు. శిశువు పుట్టిన 12వ రోజున సూర్య దర్శనం చేయించడం మన తెలుగు రాష్ర్టాలలో సంప్రదాయంగా ఉంది. అంతకన్నా ముందే కూడా.. కొన్నిసార్లు డాక్టర్లు కూడా మరుసగా ఏడు రోజులు పసిపిల్లలను ఉదయపు ఎండలో కూర్చోబెట్టమని చెబుతుంటారు. సనాతన సంప్రదాయాలలో ఆరోగ్య సిద్ధి-అంతరంగ శుద్ధి ప్రధానమైనవి. ఆ రెండూ ప్రకృతి నుంచే అందుతాయి. వాటిని తప్పక పాటించాలి. మూలాలను గౌరవించడం మన బాధ్యత.
రోడ్ల మీదికి బాల్కనీలు చొచ్చుకుని రావచ్చా? ఎందుకంటే, మా ఇంటికి రెండు రోడ్లున్నాయి.
– బి. సింధు, సికింద్రాబాద్
చాలామంది బస్తీలలో, ఊళ్లలో.. వాళ్లకు ఉన్నంత స్థలంలో కింద ఇల్లు కట్టుకొని, పైకి వచ్చేసరికి రోడ్ల మీదికి బాల్కనీలు జరుపుతారు. లేదా ఇంటినే జరుపుతుంటారు. అది అన్ని రకాలుగా దోషం.. ప్రమాదకరం కూడా! దక్షిణం – పడమర వీధులకు ఇండ్లు బయటికి వస్తే.. వీధిపోట్లు కూడా పడుతుంటాయి. కింద సపోర్ట్ లేకుండా పైన విస్తరించడం తప్పు. అంటే.. కింద (నేల మీద) ఎంత వైశాల్యంగా ఇల్లు కడతామో.. పై మేడ కూడా అంతే వైశాల్యంతో కట్టాలి. అది శాస్త్ర సమ్మతం. అప్పుడే ఆ ఇల్లు చాలాకాలం పటిష్ఠంగా ఉంటుంది. మీకు ఎన్ని రోడ్లున్నా సరే.. మీ స్థలానికి కాంపౌండు కట్టి, చుట్టూ ఖాళీ వచ్చేలా ఇల్లు కట్టుకోండి. మీ ఇంటి చుట్టూ బాల్కనీలు ఇచ్చుకోండి. అది గొప్పగా ఉంటుంది.
మాకు పాత ఇల్లు ఉంది. దాని చుట్టూ స్థలం కొన్నాం. ఉన్న ఇంటిని పెంచుకోవచ్చా?
– మనోహరమూర్తి, చీమకుర్తి
పాత ఇంటిని తీసేయకుండా డబ్భు శాతం కొత్త ఇంటిని కట్టడం మంచి నిర్ణయం కాదు. ఒక గొప్ప ఇల్లు కట్టాలంటే సంకల్పం ఉండాలి. అంతేకానీ, ఏదో సర్దుబాటు కోసం కట్టొద్దు. ఒకవేళ పాత ఇల్లు అలాగే ఉంచి కడితే.. ఉన్నదాన్ని బట్టి కొత్త ఇంటిని సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఎంత కష్టపడి కట్టినా.. పూర్ణత్వం సిద్ధించదు. పాతది కొత్తదానిలో కలవదు. మీరు స్థలం కొన్నారు కాబట్టి, పాత ఇల్లు తొలగించండి. స్థలాన్ని పూర్తిగా చదును చేసి, మూల మట్టానికి సరిచేయండి. దానిలో ఉచ్ఛమైన స్థానం ఎంచుకొని, శాస్త్ర సమ్మతంగా ఇంటిని నిర్మించండి. చుట్టూ స్థలం కొన్నామని చెప్పారు. ఉన్న ఇంటికి ఎటువైపు ఎంత స్థలం పెరిగిందో తెలియదు. అలాగే, పాత ఇంటి పిల్లర్లు కొత్తదానికి సరిపడవు కూడా! కాబట్టి, పాత దానిని తొలగించి, కొత్త ఇంటిని కట్టడానికే నిర్ణయం తీసుకోండి. ఇల్లంటే.. తరాల పంట. రాజీ పడటం వల్ల డబ్బు మిగిలినా, పరిపూర్ణత రాదు.
ఇంటికి నాలుగు మూలలు ఉండాలని అంటారు కదా! పార్కింగ్ వల్ల మాకు ఐదు మూలలు వస్తున్నాయి. ఏం చేయాలి?
– బి. సాయిలు, ములుగు
చాలా మంచి ప్రశ్న. శాస్త్ర సమ్మతమైనది కూడా. ఇంటికి నాలుగు మూలలు (నాలుగు కోణాలు) ఉండాలంటే.. చతురస్రంగా లేదా దీర్ఘ చతురస్రంగా ఉండాలి. కానీ, ఇల్లు మనం కట్టుకునే పద్ధతి నుంచి ఇతరులు (బిల్డర్లు) కట్టే పద్ధతికి ఎప్పుడైతే వచ్చిందో.. అంటే, ఇంటి నిర్మాణం కమర్షియల్గా మారినప్పటి నుంచి మూల సిద్ధాంతం మసకబారింది. ఇంటివారు కట్టుకుంటే వేరు, ఎవరో కట్టింది కొంటే వేరు. స్థలం పోతుందనే కారణంతో.. ఒక మూల తెంపి దాన్ని పార్కింగ్ కోసం వదిలి, ఇంటిని నిర్మించడం వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఐదు మూలలతో ఉన్న ఇంటిలో స్థిరత్వం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రధానంగా ఈశాన్యం పోవడం వల్ల ఇంటి మనుగడ మంట కలుస్తుంది. వాటిని సరిచేసుకున్నాకే మనం ఆ ఇంట్లో నివసించాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అవన్నీ చూడాలా?