Vasthu Shastra | పెద్ద ద్వారం ఇంటికి మధ్యలో ఉండాలా, చివర్లో ఉండాలా? ఏది మంచిది?
కె. శివరామ్, ఉప్పల్
ఇంటి ద్వారాన్ని నిర్ణయించడంలో ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. తమతమ అనుభవాలను బట్టి.. ఎన్నో రకాలుగా దిశలను సూచించారు నిపుణులు. కానీ, సింహద్వారం అనేది ఇంటికి సరిగ్గా మధ్యలోనూ, ఉచ్ఛమైన ఈశాన్యంలోనూ పెట్టుకోవచ్చు. ఎలాంటి దోషం లేదు. అన్ని నివాసాలూ రాజమహళ్లు కావు. సమాజంలో పేదల ఇండ్లు, ధనవంతుల ఇండ్లు, మధ్య తరగతి ఇండ్లు అని అనేక రకాలుగా ఉంటాయి. అందరికీ ఇల్లు అభివృద్ధి కారకం కావాలి. ఉదాహరణకు ఒకే గదిలో నివసించే చిన్న కుటుంబానికి మధ్యలో.. అంటే, తూర్పు మధ్యలో ద్వారం పెట్టినట్లయితే.. అందులో మధ్యభాగం నడకకు పోతే.. వండుకునేది ఎక్కడ? పండుకునేది ఎక్కడ? అందుకే, ఎన్నో చర్చల తరువాత.. పండితుల శాస్త్ర సూచనల మేరకు ఈశాన్యం దిశలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది సామాన్యుల పాలిట వరమైంది. అభివృద్ధికీ ఆలవాలమైంది. అంతేకానీ, తూర్పు మధ్యలోనే ద్వారం తప్పక ఉండాలి. ఈశాన్యంలోనే తప్పక ప్రధాన ద్వారం రావాలనేది ఆయా గృహాల వైశాల్యం- నిర్మాణదారుల స్థితిగతులను బట్టి ఉంటుంది. అపార్ట్మెంట్లలో ఈశాన్య ద్వారాలే కదా అద్భుత ఫలితాలకు మూలమయ్యాయి. గృహ వినియోగానికి.. అంటే, వ్యవహార యోగ్యతను చాటుకున్నాయి. ఒక్కో నిర్మాణం ఒక్కో స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాన్నిబట్టి ఉచ్ఛమైన ద్వారాల రూపకల్పన అవసరం అవుతుంది. శరీర తత్వాన్ని బట్టి వైద్యం- గృహ నిర్మాణాన్ని బట్టి ద్వారం నిర్ణయించాలి.
ఊరికి చేరే మార్గం నైరుతిలో ఉండవచ్చా? దానిని మార్చాల్సి ఉంటుందా? వాటికి ఏ ఫలితాలు ఉంటాయి?
బి. శ్రీకాంత్, వెంకటాపురం
కొన్ని పల్లెల మార్గాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ, ఆ మార్గాలు ఎప్పటినుంచో వాడుకలో ఉంటాయి. ఏది ఏమైనా మార్గాలను అనుసరించే ఫలితాలే ఉంటాయి. శాస్ర్తానికి తన పర భేదాలు ఉండవు కదా! నైరుతిలోంచి బయటికి వచ్చే ఊరి నడక.. అభివృద్ధికి దూరంగా ఉంటుంది. యోగ్యులైన వ్యక్తులు అక్కడ ఉండలేరు, వలస వెళ్లిపోతారు. గ్రామస్తుల మధ్య ఐక్యత అంతగా ఉండదు. వైషమ్యాలు పెచ్చరిల్లే ఆస్కారం ఉంటుంది. కొత్త రోడ్లు రావడం, కొత్త ప్రాంతాలలో ఇండ్లు కట్టడం వల్ల ప్రభుత్వ అభివృద్ధి కార్యకలాపాలతో అలాంటి ఊర్లకు నడకలు మారే అవకాశం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఊరిదారులు మార్చుకోవచ్చు. అవే మారిపోవచ్చు కూడా!
కింద ఆఫీసు పెట్టుకొని, అందులో లిఫ్ట్, మెట్లు పెట్టి.. పైన కట్టే ఇంట్లోకి వెళ్లవచ్చా?
వి. ప్రశాంత్, మన్నెగూడ
పైభాగంలో ఇల్లు కట్టి, కింద ఆఫీస్ పెట్టుకున్నప్పుడు.. మెట్లు, లిఫ్ట్ మనం అనుకున్నట్లు కాకుండా, ఇంటి ప్లాన్‌ను అనుసరించి వస్తాయి. కింద సెక్యూరిటీగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు. కానీ, కింద కేవలం ఒకేగది కట్టి ఆఫీస్ పెడితే ఇబ్బంది వస్తుంది. కింది భాగంలో ఆఫీస్‌తోపాటు మరో గది కట్టాల్సి వస్తుంది. పైన ఉండే మాస్టర్ బెడ్రూం కిందనే మీకు ఆఫీస్ నిర్మాణం వస్తుంది. వెంటనే దానిని ఆనుకొని మెట్లు, లిఫ్ట్ పెట్టలేం. మీరుండే డూప్లెక్స్ ఇంట్లో పడమర మధ్యలో లేదా దక్షిణం మధ్యలో మెట్లు వచ్చేలా ప్లాన్ చేయండి. కింది భాగంలో అవే మెట్లు కొనసాగుతాయి. వాటితో కలిపి నైరుతి భాగంలో ఆఫీసు గది, అలాగే ఒక వెయిటింగ్ గది ప్లాన్ చేసి కడితే.. అప్పుడు మీరు అనుకున్నట్లు లిఫ్ట్, మెట్ల భాగాన్ని కింద లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా అన్నీ చూపించుకుని ప్లాన్ చేసుకోండి.
రెండు ఇండ్ల మధ్య మంచినీళ్ల బావి ఉండవచ్చా?
బి. సింధు, గౌరారం
నీళ్ల బావి రెండు ఇండ్ల మధ్య ఉంటే.. అది ఒక ఇంటికి మంచి స్థానంలో, మరో ఇంటికి చెడు స్థానంలో ఉంటుంది. మీ బావి ఏ దిశలో ఉందో చెప్పలేదు. ఒక ఇంటికి తూర్పు – ఈశాన్యంలో బావి ఉంటే, దానికి తమ్ముడి ఇల్లు ఉత్తరంలో ఉంటే.. ఆ బావి అతనికి దక్షిణం అవుతుంది. ఒకరికి తూర్పులో ఉంటే.. మరొకరికి పడమర అవుతుంది. ఇలా రెండు ఇండ్ల మధ్య బావి ఉంటే, ఈశాన్యంలో ఉండేవారు లేదా తూర్పు-ఉత్తరంలో బావి కలిగిన ఇంటి వారు దానిని పూర్తిగా లోపలికి తీసుకొని ప్రహరీ కట్టుకోవాలి. అయితే పక్కవారు ఆ నీటిని పంపుతో తోడుకొని వాడుకోవచ్చు. దోషం ఉండదు. ఇద్దరూ ఆ బావిపైన హక్కు కలిగి ఉన్నట్లు ఒప్పందం రాసుకోవాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంట్లో హోమాలు యజమాని చేయాలా? పూజారి చేయాలా?
Vasthu Shastra | ఇంట్లో మొదటిసారి పుట్టిన బాబుకు సూర్యదర్శనం, చంద్రదర్శనం చేయించాలని అంటారు. ఎందుకు?