Vasthu Shastra | ఇంటి చుట్టూ బాల్కనీ పెట్టి, అన్ని బెడ్రూముల నుంచీ డోర్లు పెట్టొచ్చా?
– టి. చంద్రశేఖర్, ఖమ్మం
ఇంటి చుట్టూ బాల్కనీ రావడం చాలా మంచిది. ఇంటి పైభాగంలో బాల్కనీ వచ్చిందీ అంటే.. పైన కూడా చక్కని ప్రదక్షిణతో కూడుకున్న వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి గాలి, వెలుతురు ధారాళంగా లభిస్తాయి. అయితే బాల్కనీ ఉంది కదా అని నైరుతి మాస్టర్ బెడ్రూమ్ నుంచి ద్వారం పెట్టవద్దు. నైరుతి బెడ్రూమ్కు బాల్కనీలు ఇవ్వడం ఫ్యాషన్‌గా మారిపోయింది. సాక్షాత్తు యజమానులే ఇలా ఉండాలని కోరుతున్నారు కూడా! అది చాలా పెద్దదోషం. బాల్కనీలలోకి పడమర – దక్షిణం, తూర్పు – ఉత్తరాల నుంచి వెళ్లేలా ద్వారాలు పెట్టుకోవాలి. ఆగ్నేయం – నైరుతి, ఉత్తర వాయవ్యం వైపు డోర్లు పెట్టుకోవద్దు. ఇంటి సభ్యులకు ఎంజాయ్మెంట్ కంటే.. ఎదుగుదల – ఆరోగ్యం ముఖ్యం. ఆ కోణంలో ఇంటిని జాగ్రత్తగా కట్టుకోండి. మన అభిరుచులు వాస్తు పరిధిలో ఉంటేనే మేలు.
మాది మూడు అంతస్తుల ఇల్లు (ట్రిప్లెక్స్). పూజగదిని పెద్దగా పైన కట్టుకోవచ్చా?
– ఆర్. అనిత, వరంగల్
పూజగదిని సహజంగా కిచెన్ వచ్చే ఫ్లోర్లో పెడుతుంటారు. అక్కడ పడకల కన్నా.. నిలకడ ఎక్కువ ఉంటుంది. స్త్రీలు ఎక్కువగా ఉండేది.. కిచెన్ ఉండే ఫ్లోర్‌లోనే కదా! అయితే ఫస్ట్‌ఫ్లోర్‌లో కూడా చక్కని స్థలం కేటాయించి పూజగది కట్టుకోవచ్చు. పూజ గదిని ఇంట్లో ఎక్కడ పెట్టినా.. టాయిలెట్ల పక్కన, ఎదురుగా రాకుండా జాగ్రత్త పడాలి. మీరు టెర్రస్ మీద ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. తప్పకుండా కట్టుకోవచ్చు. ఒక ఆలయ వాతావరణం ఏర్పాటు చేసుకొని, పడమర మధ్యలో చిన్న గుడిని తూర్పు ముఖంగా నిర్మించుకోవచ్చు. అయితే, నిత్యపూజలు అవసరం.
బోరు వేశాక భూమిపూజ చేయవచ్చా? ముందే చేయాలా? మరొక సందేహం.. కాంపౌండ్లు ఎప్పుడు కట్టాలి?
– ఎం. మనోహర్, చర్ల
ఒక స్థలం నిర్ణయించాక అన్నిటికన్నా ముందు స్థలశుద్ధి చేయాలి. అంటే.. చెట్లు – చేమలు, రాళ్లు – రప్పలు మొదలైనవి తొలగించడం. నేలను చదును చేయడం. వీటికి ముహూర్తంతో పనిలేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే, బావి తవ్వాలన్నా, బోరు వేయాలన్నా.. భూమిపూజ తరువాతే పని ప్రారంభించాలి. ఒకసారి భూమిపూజ నిర్వహించాక నీటితో చాలా అవసరం ఉంటుంది కాబట్టి, మొదటి పనిగా బోరు వేయడం, లేదా సంపులు కట్టి నీటి వసతి ఏర్పాటుచేసుకోవడం అవసరం. తరువాత తూర్పు – ఉత్తరం రోడ్లు ఉన్న స్థలం అయితే, దక్షిణం – పడమర కాంపౌండ్లు మూలమట్టానికి కట్టుకోవడం చాలా అవసరం. ఈ నిబంధనలు తప్పక పాటించండి.
‘ఊళ్లో డూప్లెక్స్ కట్టకూడదు’ అంటున్నారు. నిజమేనా? అందరూ కడితేనే కట్టాలా?
– కె. భానుమతి, వంగర
గృహం – ఆహారం – ఆహార్యం (బట్టలు) పూర్తిగా వ్యక్తిగతమైనవి. వీటి విషయంలో జాగ్రత్తలు, సూచనలు చేస్తుంది శాస్త్రం. కానీ, నిషేధించదు. శాసించదు. ‘ఊళ్లో డూప్లెక్స్ కట్టకూడదు. నగరాల్లోనే కట్టాలి’ అనేది సరైన భావన కాదు. పైగా కొందరు ఆ ఇంటి వరుసలో డూప్లెక్స్ కడితేనే మనం కట్టాలని అనుకోవడం విడ్డూరం కూడా. మీరు కట్టేది డూప్లెక్స్ ఇల్లు అయితే.. నిరభ్యంతరంగా కట్టుకోండి. అయితే, దాన్ని శాస్త్ర ప్రకారంగా దిశ కలిగిన స్థలంలో రోడ్డును అనుసరించి కట్టండి. ఇక మీ వీధివారు కట్టినా, కట్టకపోయినా ఎవరి స్థితిగతులు (ఆర్థిక విషయాలు) వారికి ఉంటాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిని నిర్మించుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంట్లో మొదటిసారి పుట్టిన బాబుకు సూర్యదర్శనం, చంద్రదర్శనం చేయించాలని అంటారు. ఎందుకు?