Vasthu Shastra | ఊరిని బట్టి, రాష్ట్రాన్ని బట్టి వాస్తు మారుతుందా? మా ఊరిలో దక్షిణం రోడ్డుకు తలుపే వద్దు అంటున్నారు.
– జి. భిక్షపతి, మూటకొండూరు
మన దేశానికి వాస్తు ఒకటే! మీ ఊరిలో ‘దక్షిణం ద్వారం, దక్షిణం ఇల్లు వద్దు. కట్టొద్దు’ అంటే.. అది వాళ్ల అజ్ఞానం. ఇల్లు ఏ దిశకైనా, ఏ రోడ్డు వచ్చినా కట్టుకోవచ్చు. ఊరికో విపరీత పండితుడు ఉండవచ్చు. కానీ, ఊరికో తీరుగా వాస్తు శాస్త్రం లేదు. వంట విషయంలో విభిన్న రీతులు ఉన్నా.. ఇంటి విషయంలో శాస్త్రం దిశలను బట్టి ఇల్లు కట్టుకోమని చెబుతుంది. మంచి డాక్టరును కలిస్తే రోగం కుదిరినట్టు.. మంచి నిపుణులతో మీ స్థలం చూపించి ఇల్లు కట్టుకోండి. ప్రతి దిశకూ ఒక నిర్మాణ విధానం ఉంటుంది. దానిని అనుసరించాలి. వీధి ఒక్కో దిశను ప్రభావితం చేస్తుంది. అలాంటి శాస్త్ర మెలవకులతో ఇంటిని నిర్మించి, మంచి ఫలితాలు రాబట్టవచ్చు. వంటరాక కూరగాయలు మంచివికావు అనవద్దు.
1 Father And Son
నా కొడుక్కి దక్షిణం పేరుమీద, నాకు తూర్పు పేరుమీద బాగుందని అంటున్నారు. నా తరువాత నా ఇల్లు వదిలి, నా కొడుకు వేరే ఇల్లు కట్టుకోవాలా? ఇప్పుడే రెండు ఇండ్లు కట్టాలా?
– ఓ పాఠకుడు
ఎవరు ఉన్నా సకల శుభాలు కలిగించే దానినే ‘శాస్త్రగృహం’ అంటారు. అప్పట్లో అలా ఎవరి పేరును బట్టి వారి గృహం కట్టే ఆచారం ఉండేది. లోకాన్ని బట్టి ధర్మం మారుతుంది కాబట్టి, నేటి జీవనరీతిని బట్టి ఎవరు అందరికీ పనికి వచ్చేలా శాస్త్ర ప్రకారం ఇల్లు నిర్మితమవ్వాలని అనేక పండిత చర్చలు జరిగిన తరువాతనే.. నేడు ఇండ్లు కడుతున్నారు. అందుకే ఇంటికి వాస్తు అవసరం పెరిగింది. రేపు ఇల్లు అమ్ముకున్నా, వారసులు ఉన్నా, అందరికీ పనికిరావాలి కదా! ఆ కోవలో ఇంటి ద్వారాలు ఉచ్ఛమైన దిశల్లో పెడుతూ, ఆమోదయోగ్యంగా కట్టాలి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి స్థలంలో వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోండి. రెండు ఇండ్లు కట్టాల్సిన పన్లేదు. ఒకదానిలోనే ఇద్దరూ ఉండొచ్చు. మీ తదనంతరం మీ కొడుకు కూడా వాడుకోవచ్చు.
3 House
మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం. ఇంటి చుట్టూ ఖాళీ ఉంది. నైరుతిలో తప్పకుండా ఒక గది కట్టాలి అంటున్నారు నిజమా?
– బి. సారథి, జడ్చర్ల
వాస్తవానికి ఇంటి చుట్టూ ఉపగదులు ఉండాలి, కట్టాలి అని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. గతంలో ఎవరికి మాత్రం స్టాఫ్ గదులు ఉండేవి? ఇవన్నీ మధ్యలో పుట్టాయి. మనిషి సుఖానికి మరిగి సౌకర్యాల కోసం శాస్ర్తాన్ని మలుచుకుంటున్నాడు. ఎవరి ఇంట్లో వారు జీవనకార్యాలు చక్కగా చేసుకోవాలి. అదే ఆరోగ్యం – ఐశ్వర్యం. మీరు ఇంటి చుట్టూ ఖాళీ వదలడం గొప్పకార్యం. తప్పకుండా నైరుతిలో బరువు ఉండాలనే ఉద్దేశంతో గది కట్టాల్సిన అవసరం లేదు. కొందరు తప్పనిసరై, స్టాఫ్‌ను ఇంటి ఆవరణలో పెట్టుకోవాల్సి రావడం వల్ల చిన్న గదులు నిర్మించుకుంటారు. ఆ గదులైనా నైరుతిలో కాదు.. దేనినీ తగలకుండా ఆగ్నేయ-వాయవ్య దిశల్లో కట్టుకోవాలి.
4 Palmistry
చేతి రేఖలకు, ఇంటికి, భవిష్యత్తుకు సంబంధం ఉంటుందా? ఇవన్నీ నమ్మవచ్చా?
– వెంకటలక్ష్మి, జిల్లెలగూడ
మనిషి బుద్ధిజీవి. కానీ, అతనికి అర్థంకానివి ఎన్నో ఉన్నాయి. ఇదంతా ముందు తెలుసుకోవాలి. మనిషి సర్వజ్ఞుడు కాదు. కానీ, కాలం సర్వజ్ఞత కలిగి ఉన్నది. దాని లిపి మానవ మేధకు ఇంకా అందడం లేదు. ఒక వ్యక్తి కళ్లు, కండరాలు, ఎముకలు, తేలిన నరాలు, కను బొమ్మలు.. ఇలా ఎన్నో అతని మనస్తతాన్ని తెలుపుతుంటాయి. చేతిలోని రేఖలు లైఫ్‌లైన్ – హెడ్లైన్ – హార్ట్‌లైన్ – ఫేట్లైన్ అని లెక్కించి.. ఆ వ్యక్తి స్వభావాన్ని, ఆలోచనలను అంచనావేసి చెబుతారు కొందరు. వ్యక్తి ఆలోచనల సాంద్రతకు శిరో రేఖ (హెడ్లైన్) ప్రభావితమై, చేతిపైన కనిపిస్తుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అది మూఢనమ్మకం కాదు అని అర్థం. అధ్యయనం చేస్తేకానీ అందరికీ అర్థంకాదు. కాబట్టి, తేలికగా తీసుకోవడానికి వీల్లేదు.